సాక్షి, సిటీబ్యూరో: లాక్‌డౌన్ వేళ ట్రాఫిక్ నియమ, నిబంధనలను అతిక్రమిస్తూ యథేచ్ఛగా నగర రహదారులు, కాలనీల్లో రయ్యురయ్యమంటూ దూసుకెళుతున్న వాహన చోదకులను సిటిజన్లు సెల్‌ఫోన్లతో క్లిక్‌మనిపిస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు నెలవారీగా మూడు వేల వరకు సామాజిక మాధ్యమాల ద్వారా ఉల్లంఘనల ఫొటోలను సైబరాబాద్ (10.309), రాచకొండ (703) ఫేస్‌బుక్, ట్విట్టర్‌లకు పోస్టు చేస్తే... గత 40 రోజుల నుంచి ఏకంగా 11,012 ఫిర్యాదులు రావడం పోలీసులకే ఆశ్చర్యం కలిగించింది. ఏ ప్రాంతం, ఏ సమయం తదితర వివరాలతో ఆ ఫొటోలను నిక్షిప్తం చేస్తుండడంతో ట్రాఫిక్ పోలీసులు కూడా అది ఏ ఉల్లంఘన కింద వస్తుందో ఎంత జరిమానా విధించారనే విషయంతో కూడిన ఈ–చలానా ఐడీ వివరాల్ని సదరు ఫిర్యాదుదారుడికి పంపిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ నిబంధనలుఅతిక్రమించేవారి ఫొటోలు తీసి మరీ పోస్టు చేసేస్తున్నారు.
సెల్‌ఫోన్‌తో క్లిక్.. ఫేస్‌బుక్‌లో పోస్ట్
రహదారులపై ప్రయాణించేటప్పుడు మరో వాహనదారుడెవరైనా ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడితే వెంటనే స్పందిస్తున్నారు. సెల్‌ఫోన్‌తో దానిని చిత్రీకరించి సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ విభాగానికి పంపుతున్నారు. ఇందుకు ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాల్ని వినియోగిస్తున్నారు. చిత్రంతోపాటు ఉల్లంఘనకు సంబంధించిన వివరాల్ని నమోదు చేస్తే చాలు పోలీసులు వెంటనే స్పందిస్తున్నారు. ఫిర్యాదుదారులకు సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ ఈ–చలానా విభాగం నుంచి తిరుగు సమాధానం వెళ్తోంది. ఏ ఉల్లంఘనకు ఎంత జరిమానా విధించారనే విషయంతో కూడిన ఈ–చలానా ఐడీ వివరాల్ని తెలియజేస్తున్నారు. కేసు నమోదు చేసిన సమాచారాన్ని వెల్లడిస్తున్నారు. ఒకవేళ కేసు నమోదు చేయకపోతే అందుకు గల కారణాన్నీ వివరిస్తున్నారు. ఇలా చేస్తుండటం వల్ల తమ ఫిర్యాదుకు స్పందన ఉంటోందనే నమ్మకాన్ని వారికి కల్పిస్తున్నారు. దీనికితోడు స్వయంగా పోలీసులే ఉల్లంఘనలకు పాల్పడిన చిత్రాల్ని పోస్ట్ చేసినా జరిమానాలు విధిస్తున్నారు. లాక్‌డౌన్ వేళ సిటిజన్లు తమ సెల్‌ఫోన్‌లతో ఫొటోలు తీసి ఆయా ట్రాఫిక్ విభాగాలను సామాజిక మాధ్యమాల ద్వారా పంపుతుండటంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment