సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కొత్తగా మరిన్ని మర్కజ్ కాంటాక్ట్‌లు వెలుగు చూస్తుండటంతో గ్రేటర్ వాసుల్లో ఆందోళన నెలకొంది. రెండు రోజుల క్రితం పెద్దగా కేసులు నమోదు కాకపోవడంతో గ్రేటర్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. వైరస్ తగ్గుముఖం పట్టినట్లేనని భావించారు. కానీ ఆ సంతోషం 24 గంటలు కూడా ఉండలేదు. గురువారం తెలంగాణ వ్యాప్తంగా 50 కేసులు నమోదు కాగా, వీటిలో 37 కేసులు గ్రేటర్ పరిధిలోనివే. తాజాగా శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా 66 పాజిటివ్ కేసులు నమోదైతే..వీటిలో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే కొత్తగా మరో 46 కేసుల వరకు నమోదవడం ఆందోళన కలిగిస్తుంది. దీంతో ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో 431 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీరిలో ఇప్పటికే చికిత్సలకు కోలుకుని డిశ్చార్జి అయిన వారు 131 మంది ఉన్నారు. 14 మంది మృతి చెందారు. ప్రస్తుతం గాంధీ, చెస్ట్ ఆస్పత్రుల్లో 286 మంది పాజిటివ్ బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఏ ఆస్పత్రిలో ఎంత మంది ఉన్నారంటే...?
♦ గాంధీ కరోనా నోడల్ సెంటర్‌లో ప్రస్తుతం 623 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 513 పాజిటివ్ కేసులు ఉన్నాయి. శుక్రవారం 35 మందిని డిశ్చార్జి చేశారు. మిగిలిన వారి రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది.
♦ ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రిలో 44 మంది చికిత్స పొందుతుండగా, వీరిలో 22 మంది కరోనా పాజిటివ్ బాధితులు ఉన్నారు. నలుగురిని డిశ్చార్జి చేశారు. మరో 18 మంది చికిత్స పొందుతున్నారు.
♦ నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి కొత్తగా మరో 12 మంది అనుమానితులు వచ్చారు. దీంతో ఇక్కడి రోగుల సంఖ్య 24కు చేరింది. వీరిలో 17 మందికి నెగిటివ్ రావడంతో డిశ్చార్జి చేశారు.
♦ చార్మినార్ యునానీ ఆస్పత్రిలో ప్రస్తుతం 149 మంది అనుమానితులు ఉన్నారు. మరో 126 మందికి నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ చేశారు. ఇంకో ఏడుగురికి పాజిటివ్ రావడంతో వారిని గాంధీ ఐసోలేషన్‌కు తరలించారు.
♦ ఎర్రగడ్డ ఆయుర్వేద ఆస్పత్రిలో 52 మంది ఉండగా వీరిలో 28 మందికి నెగిటివ్ వచ్చింది. మరో 24 మంది రిపోర్టులు రావాల్సి ఉంది.
♦ కీసర మండలంలోని చీర్యాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వ చ్చినట్లు కీసర మండల వైద్యాధికారి డాక్టర్ సరిత ప్రకటించారు. దీంతో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు ఐదుగురితో పాటు ఆ ఇంట్లో అద్దెకున్న మరో 20 మందిని రాజేందర్‌నగర్‌లో ఉన్న క్వారెంటైన్ సెంటర్‌కు తరలించినట్లు వారు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment