సాక్షి,సిటీబ్యూరో: మహానగరంలో జలమండలి సరఫరా చేస్తున్న తాగునీటిలో 50 ఎంజీడీలు వృథా అవుతోంది. ప్రతినెలా ఇలా రూ.36 కోట్ల ప్రజాధనం నీటిపాలవుతోందని జీహెచ్‌ఎంసీ కమిషనర్, జలమండలి ఎండీ ఎం.దానకిశోర్ తెలిపారు. దీనికంతటికీ ప్రజల అవగాహన రాహిత్యమేనన్నారు. మంగళవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయం వద్ద నీటి పొదుపుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో జలమండలి, జీహెచ్‌ఎంసీ అధికారులు, వాక్ వలంటీర్లు, ఎన్జీవోల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీటిపొదుపుపై అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘జలశక్తి అభియాన్’ కార్యక్రమంతో వాక్ కార్యక్రమానికి చాలా ప్రాధాన్యత ఏర్పడిందన్నారు. నగరానికి సుమారు 200 కిలో మీటర్ల దూరం నుంచి తీసుకువచ్చి సరఫరా చేస్తున్న కృష్ణా, గోదావరి జలాల్లో ప్రతిరోజు 50 ఎంజీడీల నీరు వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నీటిని పొదుపు చేస్తే దాదాపు 30 లక్షల కుటుంబాలకు వినియోగించవచ్చన్నారు. నీటి పొదుపుతో విద్యుత్ చార్జీల రూపేణ నెలకు దాదాపు రూ.36 కోట్ల ప్రజాధనం పొదుపు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. విచక్షణా రహితంగా బోరుబావులను తవ్వి భూగర్భ జలాలను తోడడంతో వందల అడుగుల లోతునకు బోర్లు వేసినా నీరు పడడం లేదన్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి జలమండలి.. ఎన్జీవోల సహకారంతో జలభాగ్యం, జలం జీవం, వాక్ వంటి కార్యక్రమాలను చేపడుతున్నట్టు చెప్పారు.
75 రోజులపాటు అవగాహన
నీటి పొదుపై అవగాహన కల్పించేందుకు నగరంలో ఈనెల మొదటి వారం నుంచి సెప్టెంబర్ రెండో వారం వరకు 75 రోజుల పాటు స్లమ్ లెవెల్ ఫెడరేషన్, వాక్ వలంటీర్లు, జీహెచ్‌ఎంసీ ప్రాజెక్టు ఆఫీసర్స్, జలమండలి జీఎంలు, డీజీఎంలు గ్రేటర్ పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎండీ ఆదేశించారు. ఇందుకు అవసరమైన శిక్షణ ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణ, సెకండరీ ట్రాన్స్‌మిషన్ డైరెక్టర డా. పి.ఎస్. సూర్యనారాయణ, ఆపరేషన్స్ డైరెక్టర్లు అజ్మీరాకృష్ణ, పి.రవి, రెవెన్యూ డైరెక్టర్ బి.విజయ్ కుమార్ రెడ్డి, టెక్నికల్ డైరెక్టర్ వి.ఎల్.ప్రవీణ్ కుమార్, సీజీఎంలు, జీఎంలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment