సాక్షి, సిటీబ్యూరో: క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్లి చదువుకుంటున్న 13ఏళ్ల పిల్లాడిని ఓ సినిమా పోస్టర్ వక్రమార్గం పట్టించింది. నగరంలో అక్కడక్కడ మెట్రో పిల్లర్లు, హోర్డింగ్‌లపై కనిపించిన ఆ సినిమా పోస్టర్లలోని అశ్లీల దృశ్యాలు ఆ చిన్నారిని స్కూల్‌కు దూరం చేశాయి. సినిమాలో ‘ఇంకా ఏదో ఉంటుందనే’ ఉద్దేశంతో అతడు థియేటర్‌కు వెళ్లాడు. క్రమంగా సినిమా ఒక వ్యసనంగా మారింది. సరిగ్గా అలాంటి సమయంలోనే మాదాపూర్‌లోని తమ ఇంటి నాలుగో అంతస్తుకు ఎదురుగా ఉన్న అమ్మాయిల వసతి గృహంపై అతడి దృష్టి పడింది. రాత్రి వేళల్లో ఆ హాస్టల్‌లోంచి వినిపించే నీళ్ల చప్పుడు అతనిలో మరింత క్యూరియాసిటీని పెంచింది. అప్పటికే తండ్రి కొనిచ్చిన ఖరీదైన స్మార్ట్‌ఫోన్ అతని చేతిలో ఉంది. రాత్రివేళ బాత్‌రూమ్‌లలో స్నానం చేస్తున్న అమ్మాయిలు ఆ కుర్రాడి కంటపడ్డారు.
మరో ఆలోచనకు తావులేకుండా తన స్మార్ట్‌ఫోన్‌లో ఆ దృశ్యాలను చిత్రీకరించడం ప్రారంభించాడు. సుమారు నెల రోజులకు పైగా కొనసాగిన ఈ దారుణం రెండు రోజుల క్రితం బయటపడిన విషయం విదితమే. తాము స్నానం చేస్తుండగా పిల్లాడు వీడియో చిత్రీకరించినట్లు గమనించిన ఇద్దరు యువతులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీసుల సమక్షంలో మనస్తత్వ నిపుణులు ఆ పిల్లాడికి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. స్కూల్‌కు వెళ్లి బాగా చదువుకోవాల్సిన పిల్లాడు అలాంటి తప్పుడు చర్యలకు పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. ఇదొక్కటే కాదు... నగరంలో బాల్యాన్ని నేరమయం చేస్తున్న ఉదంతాలు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. పిల్లలు ఏదో ఒక రకమైన లైంగిక ప్రేరణలకు గురై తమకు తెలియకుండానే నేరాలకు పాల్పడుతున్నారు. ‘ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్’ అధ్యయనం ప్రకారం ఇలాంటి నేరపూరితమైన వాతావరణంలో హైదరాబాద్ దేశంలోనే మూడో స్థానంలో ఉండడం గమనార్హం. ఇందులో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
నేరం ఎవరిది?
అభం శుభం తెలియని పిల్లలను నేరాల బాట పట్టిస్తున్న అసలు నేరస్తులెవరు? బాగా చదువుకొని గొప్ప ప్రయోజకులు కావాల్సిన పిల్లలు ఇలాంటి తప్పుడు మార్గాల వైపు ఎందుకు ఆకర్షితులవుతున్నారు? సినిమాలు, అశ్లీల సాహిత్యం వైపు పిల్లలను నెట్టివేయడంలో ఇంటర్నెట్‌లో తామరతంపగా వెలుస్తున్న పోర్న్‌సైట్‌లు అమాయకులైన పిల్లలను ప్రేరేపిస్తున్నట్లు ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. అశ్లీల దృశ్యాలను గుప్పించే సినిమాలు, ఇతర మాధ్యమాలు అందుకు మరింత ఆజ్యం పోస్తున్నట్లు అభిప్రాయపడింది. మాదాపూర్‌లో అమ్మాయిల స్నాన దృశ్యాలను చిత్రీకరిస్తూ పట్టుబడిన పిల్లవాడు ‘అలా చేయడం తప్పని తనకేమాత్రం తెలియదని’ పోలీసుల సమక్షంలో పేర్కొనడం గమనార్హం. అప్పటి వరకు క్రమం తప్పకుండా స్కూల్‌కు వెళ్లిన ఆ చిన్నారి దానికి బానిసగా మారి నిద్రాహారాలకు, స్కూల్‌కు దూరమయ్యాడు.
ఎంతోమంది పిల్లలపై ఇలాంటి ఇంటర్నెట్ నీలినీడలే ముసురుకుంటున్నాయి. పిల్లలకు ఖరీదైన వస్తువులు కొనివ్వడమే తమ విలాసవంతమైన జీవనశైలికి నిదర్శనమని భావించే తల్లిదండ్రులు సైతం పరోక్షంగా ఈ నేరాల్లో భాగస్వాములవుతున్నారు. మరోవైపు ఉన్నతమైన నైతిక విలువలను పెంపొందించే విద్యను బోధించకుండా కేవలం మార్కులు, ర్యాంకులు సంపాదించే ఎడ్యుకేషనల్ ఇన్‌స్ట్రుమెంట్లుగా పిల్లలను తయారు చేస్తున్న విద్యాసంస్థల భాగస్వామ్యం కూడా ఉంది. పిల్లలకు మొబైల్ ఫోన్‌లు ఇస్తున్న తల్లిదండ్రులు ఆ తర్వాత వారిపైన ఎలాంటి నిఘా ఉంచడం లేదు. మొబైల్ ఫోన్‌ను పిల్లలు ఎలా వినియోగిస్తున్నారనే దృష్టి కూడా లేకుండా పోతోంది. మరోవైపు ఉద్యోగం, వ్యాపారం ఇతర అనేక కారణాలతో పిల్లలు, తల్లిదండ్రులకు మధ్య దూరం పెరుగుతోంది. నిత్యం పిల్లలను అంటిపెట్టుకొని ఉండడంలో, వాళ్లను సరైన మార్గంలో నడిపించడంలో తల్లిదండ్రులు విఫలమవుతున్నారు. పిల్లల కోసం బాగా సంపాదించి పెట్టడమే గొప్ప కార్యక్రమంగా భావిస్తున్నట్లు ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ విస్మయం వ్యక్తం చేసింది.
ఉమ్మడి వేదిక అవసరం...
ఈ నెల 13 నుంచి 15 వరకు కోల్‌కతాలో జరిగిన ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ సమావేశంలో దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు అమెరికా, నెదర్లాండ్స్, ఉగాండ, శ్రీలంక, చైనా, భూటాన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ తదితర 20 దేశాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇందులో హైదరాబాద్ నుంచి బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు పాలుపంచుకున్నారు. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో పిల్లలపై జరుగుతున్న లైంగిక దోపిడీ, లైంగిక నేరాలకు బానిసలుగా మారుస్తున్న ఇంటర్నెట్ సైట్‌లపై ఈ సమావేశం విస్తృతంగా చర్చించింది. అన్ని దేశాల్లో పిల్లల పెంపకానికి సవాల్‌గా మారిన పోర్న్‌సైట్‌లను అరికట్టేందుకు సాంకేతికంగా సహాయ సహకారాలు అందజేసేందుకు ఒక ఉమ్మడి వేదిక అవసరమని తీర్మానించింది. ఎక్కడ ఎలాంటి నేరాలు జరిగినా వెంటనే నియంత్రించే విధంగా పరస్పర సహకారం అవసరమని పేర్కొంది. అలాగే స్మార్ట్‌ఫోన్‌లలో ప్రతి స్మార్ట్ ఫోన్‌కు వెబ్‌లాక్ యాప్స్ తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. సైబర్ నేరాలు, చట్టాలపై పిల్లల్లో అవగాహన కల్పించేందుకు స్కూళ్లు, కళాశాలలు, సామాజిక సంస్థలు కృషి చేయాలని స్పష్టం చేసింది.
వాస్తవాలివీ...
♦ ప్రపంచంలో ప్రతి నిమిషానికి ఎనిమిది బాలల సైబర్ నేరాలు నమోదవుతున్నాయి.
♦ పిల్లల నేరాల్లో 71శాతం ఇంటర్నెట్ వెబ్‌సైట్‌లదే ప్రధాన పాత్ర.
♦ 15ఏళ్ల లోపు పిల్లలు 63శాతం మంది పోర్న్‌సైట్‌ల బారినపడ్డారు.
♦ పోర్నోగ్రఫీ ఎక్స్‌ప్లాయిటేషన్‌లో అమెరికా తొలి స్థానంలో ఉండగా, ఇండియా ఆరో స్థానంలో ఉంది.
♦ మన దేశంలో పోర్న్‌సైట్లను చూసి నేరాలకు పాల్పడుతున్న పిల్లలు ఎక్కువగా నమోదువుతున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హైదరాబాద్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment