
ఏ పబ్బులోనూ భాగస్వామిని కాను: తరుణ్
సాక్షి,హైదరాబాద్: తనకు ఏ పబ్బులోనూ భాగస్వామ్యం అసలు లేదని సినీ నటుడు తరుణ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం రాత్రి మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘నేను వారానికి ఒకరోజు గోవాకు వెళ్తానని తప్పుడు ప్రచారం జరుగుతోంది ఇది తప్పు. ఆ వార్తల్లో వాస్తవం లేదు. ఇలాంటి వార్తల వల్ల మా కుటుంబం అమ్మ, నాన్న, మా సిస్టర్ చాలా బాధ పడ్డారు.
దయచేసి ఇలాంటి వార్తలు రాయకండి. మీడియా అంటే నాకు చాలా గౌరవం. నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం మీడియానే.. నాకు చాలా సపోర్ట్ చేసింది. డగ్స్ కేసులో సిట్ ముందు హజరయ్యాను. అకున్ సబర్వాల్, సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పాను. సమాజంలో డ్రగ్స్ నిర్మూలనకు అందరూ కృషి చేయాలి’ అని తరుణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.