మహబూబ్‌నగర్‌లోని వీరన్నపేటలో ఓ పెంకుటిల్లును పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్.
భగీరథయత్నం చేసి నీళ్లుతెస్తా
పాలమూరు పర్యటనలో కేసీఆర్
ఎత్తిపోతలకు రెండు మూడు వారాల్లో శంకుస్థాపన.. త్వరలోనే నెట్టెంపాడు, కల్వకుర్తి పథకాలు పూర్తి చేస్తాం
శ్రీశైలం బ్యాక్‌వాటర్స్ నుంచి మహబూబ్‌నగర్ జిల్లాకు తాగునీరు
అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్, ఆహార భద్రతా కార్డులిస్తామని వెల్లడి
మురికివాడల్లో విస్తృతంగా తిరిగి పరిశీలించిన ముఖ్యమంత్రి.. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తూ పర్యటన
పలుచోట్ల చొరవగా ఇళ్లలోకి వెళ్లిన సీఎం చంద్రశేఖర్‌రావు
‘‘కేసీఆర్ మాట ఇవ్వడు. ఇస్తే చేసి తీరుతడని మీకు తెలుసు. మహబూబ్‌నగర్ ఎంపీగా ఉంటూనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించా. వెనుకబడిన పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు తగినంత బడ్జెట్ విడుదల చేశాం. త్వరలో పనులు పూర్తవుతాయి. అందరం కలలుకంటున్న పాలమూరు ఎత్తిపోతల పథకాలకు రెండు మూడు వారాల్లో శంకుస్థాపన చేస్తా..’’ - కేసీఆర్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లాతో పాటు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు భగీరథ ప్రయత్నం చేసైనా నీళ్లు తెస్తానని.. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంత పోరాటమైనా చేస్తానని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాలకు రెండు మూడు వారాల్లో శంకుస్థాపన చేస్తానని ఆయన చెప్పారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛను, ఆహార భద్రతా కార్డులు అందేలా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ పర్యటించారు. పట్టణం పరిధిలోని పలు మురికివాడల్లో తిరిగి పరిశీలించారు.
అనంతరం ఇక్కడి జిల్లా పరిషత్ ప్రాంగణంలో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘కేసీఆర్ మాట ఇవ్వడు. ఇస్తే చేసి తీరుతడని మీకు తెలుసు. మహబూబ్‌నగర్ ఎంపీగా ఉంటూనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించా. వెనుకబడిన పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు తగినంత బడ్జెట్ విడుదల చేశాం. త్వరలో పనులు పూర్తవుతాయి. అందరం కలలు కంటున్న పాలమూరు ఎత్తిపోతల పథకాలకు రెండు మూడు వారాల్లో శంకుస్థాపన చేస్తా..’’ అని సీఎం ప్రకటించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు శ్రీశైలం బ్యాక్‌వాటర్స్ నుంచి వాటర్ గ్రిడ్ ద్వారా తాగునీరు అందిస్తామని చెప్పారు.
మురికివాడల్లో పర్యటన..
మధ్యాహ్నం 12.30కు మహబూబ్‌నగర్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్... పట్టణంలోని పలు మురికి వాడలను సందర్శించారు. పాత పాలమూరు హరిజన్ బస్తీ, పాతతోట, రైతు బజారు, ఎర్రమన్నుగుట్ట, మాంసం మార్కెట్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తూ... పలు చోట్ల కొందరి ఇళ్లలోకి వెళ్లి వారి జీవన స్థితిగతులపై ఆరా తీశారు. హరిజన్ బస్తీ, పాతతోట, వీరన్నపేటలో స్థానికులను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. వారంతా సమావేశమై మౌలిక సౌకర్యాలతో కూడిన ఇళ్ల నిర్మాణంపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా సూచించారు.
అధికారులు వారం రోజుల్లో ఆయా వాడల్లో సర్వే నిర్వహించి వన్ ప్లస్ వన్ విధానంలో కాకుండా వ్యక్తిగత ఇళ్ల నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తారని సీఎం హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి పింఛను, ఆహార భద్రతా కార్డులు అందేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. సాయంత్రం జిల్లా పరిషత్‌కు చేరుకుని పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు.
సమావేశం మధ్యలో..
‘మిషన్ కాకతీయ’ అంచనాలు రూపొందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అధికారులతో సీఎం సమీక్ష ఆలస్యం కావడంతో ‘ప్రజలతో ముఖాముఖి’ కార్యక్రమ వేదిక వద్ద ప్రజలు సీఎం రావాలంటూ నినాదాలు చేశారు. దీంతో సమీక్షా సమావేశం నుంచి సీఎం మధ్యలోనే వచ్చి ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడారు. జిల్లా అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించి... తిరిగి అధికారులతో సమీక్ష సమావేశానికి వెళ్లారు.
మంత్రులు జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి వి.శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ నిరంజన్‌రెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, అంజయ్య యాదవ్, మర్రి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ భాస్కర్, టీఆర్‌ఎస్ నేతలు భేటీలో పాల్గొన్నారు.