వెయ్యి రూపాయలతో బతికాను.. | Ibrahimpatnam Ex MLA Kondigari Ramulu Interview | Sakshi
Sakshi News home page

వెయ్యి రూపాయలతో బతికాను..

Published Thu, Nov 22 2018 1:22 PM | Last Updated on Thu, Dec 27 2018 4:27 PM

Ibrahimpatnam Ex MLA Kondigari Ramulu Interview - Sakshi

కొండిగారి రాములు

ఆ రోజుల్లో రాజకీయాలంటే డబ్బు, స్వార్థం, పదవీ వ్యామోహం ఉండేది కాదు. పదవి అంటే ఒక బాధ్యతగా భావించేవాళ్లం. నిత్యం జనం కోసమే కృషి చేశాం. ఒక్కోసారి కుటుంబం గురించి కూడా ఆలోచించేవాళ్లం కాదు. నిర్బంధ(ఎమర్జెన్సీ) సమయంలో పోరాటంలోకి వచ్చాం. ప్రజల హక్కుల సాధనకు నిత్యం శ్రమించాను. నన్ను ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. 1989లో నా ఎన్నికల ఖర్చు కేవలం రూ.88వేలు, 1994లో రూ.3 లక్షలు. రూ. వెయ్యితో బతికాను. మిగతా డబ్బంతా పార్టీకే ఖర్చు చేశాను.  ప్రస్తుత రాజకీయాలు డబ్బులతో కూడుకున్నవి. ఓటును నోటుకు అమ్ముకోవడం చాలా పెద్దతప్పు. ప్రస్తుత ఎన్నికల్లో మద్యం ఏరులై పారతోంది. నిత్యం బిర్యానీ లేకపోతే ఈ రోజుల్లో కార్యకర్తలు, నాయకులు వెంట తిరగడం కష్టంగా మారిందని ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. మిగతా వివరాలు ఆయన మాటల్లోనే..     

ఇబ్రహీంపట్నం రూరల్‌ : మాది మారుమూల కుగ్రామం. మంచాల మండలం ఆరుట్ల. నా బాల్యంలో 1952లో అప్పట్లో పంచాయతీ సమితి ఎన్నికల్లో మా తండ్రి కనకయ్య వార్డు సభ్యుడిగా పోటీ చేశారు. అంతకు ముందు నుంచే తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. అప్పట్లో నేను శంషాబాద్‌లోని అమెరికన్‌ మెనోనైట్‌ బ్రదరన్‌ మిషన్‌ స్కూల్‌లో 6వ తరగతి చదువుతుండగానే ఉద్యమాల వైపు ఆకర్షితుడినయ్యాను.

కమ్యూనిస్టు పార్టీలో మా నాన్న పని చేస్తున్నారని అప్పటి దొరలు నాపై కక్షగట్టారు. 9వ తరగతిలోనే చురుకైన కార్యకర్తగా వ్యవహరించడంతో పాఠశాల నుంచి తొలగించాలని అధికారులకు లేఖ రాశారు. నాలో కమ్యూనిస్టు భావజాలం ఉందని పాఠశాల నుంచి పంపించారు. చదువు మానేశాక 14 ఏటనే అసెంబ్లీ ఎన్నికల్లో పీడీఎఫ్‌ తరుఫున పిలాయిపల్లి పాపిరెడ్డికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నాను. అదే స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాను. రెండుసార్లు సీపీఎం తరఫున 1989,1994లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాను. మొదటిసారి ఎన్నికల్లో మొత్తం రూ.88వేలు, రెండవసారి జరిగిన ఎన్నికల్లో రూ.3 లక్షలు పార్టీ విరాళాలు సేకరించి ఖర్చు చేసింది.  

ఇంట్లో తిని పార్టీ కోసం పనిచేశారు..  
1989లో మొదటిసారిగా ఎన్నికల బరిలో నిలిచినప్పుడు 200 మంది కార్యకర్తలు నా గెలుపు కోసం కష్టపడ్డారు. రోజు రూ.2 పెట్టి అద్దెసైకిళ్లు తీసుకొని గ్రామాల్లో తిరిగి ప్రచారం చేశారు. కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్లినప్పుడు అక్కడే భోజనాలు చేసేవారు. నాకు జీపు ఉండేది.. దాని మీదే ప్రచారం చేసేవాళ్లం. అప్పట్లో గోడల మీద రాతలు, నాయకులు నోటితో చేసే ప్రచారామే. అప్పట్లో హైదరాబాద్, మహబూబ్‌నగర్‌ ప్రాంతాల నుంచి కార్యకర్తలు తమ కుటుంబాలను వదిలేసి వచ్చి నెల రోజులు ఇక్కడే ఉండి నన్ను గెలిపించడం కోసం పనిచేశారు.  

రాత్రిపూట బహిరంగ సభలు.. 
గ్రామాల్లోకి ప్రచారం కోసం ముందుగా కళాకారులు వెళ్లేవారు. రాత్రిపూట ఆయా గ్రామాల్లో బహిరంగ సభలు పెట్టి ఉపన్యాసాలు ఇస్తే ప్రజలు ఆకర్షితులయ్యేవారు. పార్టీ కేడర్‌ ఎంతో ధృడసంకల్పంతో పనిచేసేది. కార్యకర్తలు, నాయకులు నిస్వార్థంగా పనిచేసేవారు. అప్పటి ప్రజాప్రతినిధులు సైతం అలాగే ఉండేవారు.    

అసైన్డ్‌ భూములకు పట్టాలిచ్చాను..  
ఆర్థిక సమానత్వం రావలంటే భూమే ప్రధానం. అప్పట్లో పెద్దొళ్ల చేతుల్లో ఉన్న దానిని  పేదలకు దక్కేలా ఆలోచించాం. అప్పట్లో అసైన్‌మెంట్‌ కమిటీ చైర్మన్‌గా స్థానిక ఎమ్మెల్యేలకే హక్కు ఉండేది. దీంతో నా నియోజకవర్గంలోని నిరుపేదలకు భూములు పంచాలని నిర్ణయించుకున్నాను. 20 వేల ఎకరాలను పేదలకు పంచి పట్టాలు ఇచ్చాను. దీంతో నేడు ఇబ్రహీంపట్నంలో దళిత, బడుగుబలహీన వర్గాలకు భూమి ఆధారంగా ఉంది. అభివృద్ధి కోసం అప్పట్లో నేను ఎంతో తపించాను. బావుల నిర్మాణం, రైతులకు ట్రాన్స్‌ఫార్మర్ల అందజేత, బస్సు డిపో నిర్మాణం, ప్రతి గ్రామానికి బస్సులు మంజూరు చేయించాను. ఎస్సీ, ఎస్టీల పిల్లల చదువుల కోసం ఇబ్రహీంపట్నంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశాను.   

సుందరయ్య.. నచ్చిన నాయకుడు 
ఆదర్శమూర్తి నాకు మార్గదర్శకుడు పుచ్చలపల్లి సుందరయ్య. ఆయనంటే పిచ్చి అభిమానం. నేను హంగు ఆర్భాటాలకు పోకుండా సాధారణ జీవితానికి ఆలవాటు పడ్డాను. త్యాగధనుడు సుందరయ్య బాటలోనే నా ప్రయాణం. 

నా కొడుకును పోగొట్టుకున్నా.. 
ప్రస్తుతం ఎమ్మెల్యేలకు జీతం లక్షల్లో ఉంది. దాంతోపాటు వివిధ రకాల అలవెన్స్‌లు ఇస్తున్నారు. నేను మొదట ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు రూ.7,500 జీతం ఇస్తుండేవారు. అందులో రూ.6500 పార్టీకి ఇచ్చి మిగతా రూ.1000 కుటుంబానికి వెచ్చించేవాడిని. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఎక్కడ పోరాటాలు జరిగినా అక్కడికి వెళ్లి పనిచేసేవాడిని. ఈ క్రమంలో నా కొడుకు అరుణ్‌ ఆరోగ్యానికి గురైతే ఆస్పత్రిలో చూపించుకోలేక, ఆర్థిక పరిస్థితి బాగాలేక వాడు చనిపోయాడు. ప్రస్తుతం నాకు వచ్చే పింఛనే ఆధారం.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement