ఎందుకిలా..?
- పోటెత్తని ఓటింగ్
- తలకిందులైన అధికారుల అంచనాలు
- 60 శాతం మందికి అందని ఓటరు చీటీలు
- గుర్తింపు కార్డులనూ పట్టించుకోని సిబ్బంది
- అధికార యంత్రాంగం వైఫల్యం
సాక్షి, సిటీబ్యూరో: ‘ఓటేయండి.. జనం సత్తా చాటండి’ గత కొద్దిరోజులుగా నగరంలో ఎక్కడా చూసినా ఇదే ప్రచారం. ఎన్నికల యంత్రాంగం, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు, మీడియా మూకుమ్మడిగా ఓటుహక్కుపై ప్రచారాన్ని హోరెత్తించాయి. ఇలా ‘గ్రేటర్’లో పోలింగ్ శాతం పెంచేం దుకు ఎవరెన్ని విధాలుగా ఎంత కసరత్తు చేసినా.. ఎన్ని చర్యలు తీసుకున్నా ఆశించిన స్థాయిలో కాదు కదా, కనీసం గతంలో కన్నా పోలింగ్ శాతం పెరగలేదు. కారణాలేంటి? ఎందుకిలా జరిగింది? ఇప్పుడు అధికారులను, అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఇది. ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకోవడంలో కనిపించిన ఉత్సాహం.. పోలింగ్ రూపంలో కానరాలేదు.
మూడు మాసాల వ్యవధిలోనే దాదాపు 3 లక్షల మంది కొత్త ఓటర్లుగా పేర్లు నమోదు చేయించుకున్నారు. ఓటుహక్కుపై అవగాహన వల్లే అంతమంది ముందుకొచ్చి పేర్లు నమోదు చేయించుకున్నారని భావించిన అధికార యంత్రాంగం.. పోలింగ్‌లోనూ అది ప్రతిఫలిస్తుందనుకున్నారు. కానీ.. వారి అంచనాలను తలకిందులు చేస్తూ.. గత ఎన్నికల కంటే ఒక్కశాతం పోలింగ్ కూడా పెరగకపోవడం వెనుక వివిధ కారణాలను ప్రస్తావిస్తున్నారు. అటు అధికారులు.. ఇటు రాజకీయ విశ్లేషకులు.. ఎన్జీవోలు.. తదితరుల అభిప్రాయాల మేరకు పోలింగ్ శాతం పెరగకపోవడానికి కారణాలివీ...
గతంలో ఓటరు స్లిప్పుల్ని రాజకీయ పార్టీలూ పంచేవి. ఈసారి దాన్ని నివారించారు. ఎన్నికల ఉద్యోగులే ఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పుల్ని పంచితే మంచి ఫలితముంటుందని అధికారులు అంచనా వేశారు. కానీ.. క్షేత్రస్థాయిలో దీన్ని అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. తగినంత వ్యవధి లేకపోవడం.. ఒక్కో బీఎల్‌ఓ రోజుకు 200 ఇళ్లు తిరగ్గలరని భావించినప్పటికీ అమలులో అది సాధ్యం కాకపోవడం వంటి కారణాలతో దాదాపు 60 శాతం ఓటర్లకు స్లిప్పులే అందలేదు.
ఎస్‌ఎంఎస్ ద్వారా పోలింగ్ కేంద్రం తెలిసే ఏర్పాట్లు చేసినప్పటికీ.. ఈ సదుపాయాన్ని కొందరే వినియోగించుకున్నారు.
ఓటరు స్లిప్పులు లేకపోయినా నిర్ణీత 11 డాక్యుమెంట్లలో ఏది చూపినా ఓటుకు అవకాశం కల్పిస్తామని అధికారులు ప్రకటించినప్పటికీ, అమలులో ప్రజలకు ఇబ్బందులెదురయ్యాయి.
గుర్తింపు కార్డుల్ని చూపినా ఓటరు స్లిప్ కావాల్సిందేనంటూ చాలా పోలింగ్ కేంద్రాల్లో అధికారులు వెనక్కు పంపారు. ఎపిక్ కార్డు నెంబరు తెలిపినప్పటికీ.. ఓటరు జాబితాలో సీరియల్ నెంబరు వంటివి బీఎల్‌ఓలు చెప్పలేకపోయారు. ఈ కారణం వల్ల కూడా చాలామంది ఓటు వేయలేదు.
కొన్ని కుటుంబాల వారికి ఇంట్లో నలుగురు సభ్యులుంటే.. ముగ్గురికి ఒక పోలింగ్ కేంద్రంలో, మరొకరికి 4 కి.మీ.ల దూరంలోని మరో పోలింగ్ కేంద్రం కేటాయించారు. వీటి వల్ల కూడా పలువురు ఓటు హక్కుకు దూరమయ్యారు.
ఆన్‌లైన్ ద్వారా ఓటరు నమోదుకు కల్పించిన సదుపాయాన్ని వినియోగించుకున్న చాలామంది.. రెండు మూడు పర్యాయాలు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేశారు. ఎన్ని మార్లు దరఖాస్తులు చేస్తే అన్ని పర్యాయాలు ఓటరుగా నమోదు చేశారు. అలా ఒకే వ్యక్తి రెండు మూడు పర్యాయాలు ఓటరుగా నమోదు కావడంతో వాస్తవ ఓటర్ల కంటే ఎక్కువమంది ఓటర్లు లెక్కలో చేరారు. ఎక్కువ పర్యాయాలు ఉన్న పేర్లను తొలగించడంలో అధికారులు విఫలమయ్యారు. అది కూడా పోలింగ్ శాతంపై ప్రభావం చూపింది.
ఓటర్లుగా పేరు నమోదు చేయించుకోవడంలో ఉత్సాహం చూపిన పలువురు.. పోలింగ్‌లో దాన్ని ప్రదర్శించలేదు. ముఖ్యంగా నవఓటర్లు.. యువత ఆశించిన స్థాయిలో పోలింగ్‌లో పాల్గొనలేదు.
యంత్రాంగం వైఫల్యం
అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో పూర్తిగా విఫలమైంది. ఓటరు స్లిప్పుల పంపిణీ నుంచి ఈవీఎంలు స్ట్రాంగ్‌రూమ్‌లకు చేరేంతదాకా ఎన్నికల విధుల్లోని పలు విభాగాల ఉద్యోగుల్లో సమన్వయం లోపించింది. ఉన్నతాధికారులు ఒక విభాగం వారు.. ఉద్యోగులు మరో విభాగం వారు ఉన్నందున విధుల నిర్వహణలో నిర్లక్ష్యం కనబరిచారు.
నామినేషన్ల నాటి నుంచి ఈ లోపం కనిపించినా.. పకడ్బందీ చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకే నామినేషన్ల గడువు ముగిసినా.. ఏరోజు ఎంతమంది నామినేషన్లు వేశారో చెప్పేందుకు అధికార యంత్రాంగానికి రాత్రి 9 గంటల వరకు సమయం పట్టిందంటే పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు. పోలింగ్ రోజు ఉదయం 6 గంటలకే మాక్‌పోలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. చాలా కేంద్రాల్లో అది జరగలేదు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం కావాల్సిన పోలింగ్ పలు కేంద్రాల్లో ఆలస్యంగా ప్రారంభమైంది.
ఓటరు జాబితాలో పేరున్నదీ లేనిదీ నిర్ణీత వ్యవధిలోగా చాలామంది ఓటర్లు చూసుకోలేకపోయారు. దానికి విస్తృతప్రచారం కల్పించలేకపోయారు. ఓటరుగా నమోదుకు పెంచిన గడువుపై జరిగిన ప్రచారం.. ఓటరు జాబితాలో పేరుందో లేదో చూసుకోవడంపై జరగలేదు. తమకు ఎపిక్ కార్డులున్నందున తమ పేర్లు జాబితాలో ఉన్నాయనే అందరూ భావించారు. కార్డున్నంత మాత్రాన సరిపోదని.. జాబితాలోనూ చూసుకోవాలనే సందేశం ప్రజలకు చేరాల్సిన స్థాయిలో చేరలేదు. అది కూడా పోలింగ్‌పై ప్రభావం చూపింది.
అధికార యంత్రాంగం మధ్య సమన్వయ లోపానికి ఇదో మచ్చుతునక. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం కాగా.. గురువారం సాయంత్రం వరకు కూడా ఎంతమంది ఓటర్లు పోలింగ్‌ను వినియోగించుకున్నారో అధికార యంత్రాంగం స్పష్టం చేయలేకపోయింది. కొన్ని నియోజకవర్గాల్లో బుధవారం సాయంత్రం వరకు పేర్కొన్న పోలింగ్ శాతం కంటే.. అంతిమంగా గురువారం వెల్లడించిన పోలింగ్ శాతం తగ్గింది.
ఆసక్తి చూపని సంపన్నులు
ఖైరతాబాద్ నియోజకవర్గం పంజగుట్ట డివిజన్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన కేంద్రంలో 76 శాతం పోలింగ్ అయింది. అదే నియోజకవర్గం ఎర్రమంజిల్ కాలనీలోని ప్రభుత్వోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో కేవలం 33 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. విశ్వేశ్వరయ్య భవన్ కేంద్రంలోని అధిక శాతం ఓటర్లు బస్తీల్లో నివసించే పేదలు, నిరక్షరాస్యులు. ఎర్రమంజిల్ కాలనీ పోలింగ్ కేంద్రంలోని ఓటర్లు సంపన్నులు.. ఎగువ మధ్యతరగతి వర్గాల వారు, బాగా చదువుకున్న వారు కావడం గమనార్హం.