వేతన సవరణ చేయకుంటే సమ్మెకు సై
- ఆర్టీసీ ఎండీకి సమ్మె నోటీసు ఇచ్చినకార్మిక సంఘాలు
- 15వ తేదీ వరకు గడువు విధింపు
- స్పందన రాకుంటే 16 నుంచి సమ్మె
- ప్రభుత్వ విధానాల వల్లే ఆర్టీసీకి నష్టాలు
- ప్రభుత్వ ఉద్యోగులకంటే ఎక్కువ కష్టపడుతున్నాం
- వేల మంది కార్మికులతో బస్‌భవన్ ముట్టడి
- ముట్టడితో డిపోలకే పరిమితమైన బస్సులు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు మరోసారి సమ్మెకు సై అన్నారు. వేతన సవరణ గడువు దాటి రెండేళ్లు గడుస్తున్నా యాజమాన్యం నుంచి స్పందన లేకపోవటంతో సమ్మెబాట పట్టాలని గుర్తింపు పొందిన కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఈ నెల 15 వరకు యాజమాన్యానికి గడువు విధించిన కార్మిక సంఘాలు.. అప్పటికీ స్పందనరాని పక్షంలో 16 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని ప్రకటించాయి. ఈ మేరకు గురువారం ఆర్టీసీ ఎండీ సాంబశివరావు, కార్మిక శాఖ కమిషనర్‌లకు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ), తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) సమ్మె నోటీసులను అందజేశాయి.
2013 ఏప్రిల్ 1న వేతన సవరణ జరగాల్సి ఉన్నప్పటికీ పట్టించుకోకపోవటం, ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ప్రక టించి ఆర్టీసీ కార్మికుల విషయంలో నిర్ణయం తీసుకోకపోవటాన్ని కార్మికులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఫిట్‌మెంట్ ప్రకటించకముందే ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే ఆర్టీసీ కార్మికుల వేతనాలు తక్కువగా ఉండటంతో వాటిని సవరించాలనే డిమాండ్ పెండింగ్‌లో ఉంది. దాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్‌మెంట్ ప్రకటించటంతో ఆ తేడా మరింతగా పెరిగింది. దీనిపై మండిపడుతున్న కార్మిక సంఘాలు ఆందోళనబాట పట్టనున్నట్టు ప్రకటించటంతో కొద్దిరోజులుగా ఆర్టీసీ ఎండీ వారితో చర్చలు జరుపుతున్నారు.
సర్వీస్ కండిషన్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న 273 అంశాలపై చర్చల్లో పురోగతి ఉన్నప్పటికీ.. వేతన సవరణ విషయంలో మాత్రం ఎండీ చేతులెత్తేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమంగా ఫిట్‌మెంట్ ప్రకటిస్తే రెండు రాష్ట్రాలకు సంబంధించి ఆర్టీసీపై సాలీనా రూ.1,800 కోట్ల భారం పడుతుందని లెక్కలేశారు. ఇంత భారం మోయటం నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి అసాధ్యమని ఎండీ తేల్చి చెప్పారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు దీన్ని భరిస్తే తప్ప ఆ మేరకు వేతన సవరణ సాధ్యం కాదని, ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. దీనిపై స్పష్టత రావాలంటే ఏప్రిల్ నెలాఖరువరకు గడువు ఇవ్వాలని బుధవారం జరిగిన చర్చల్లో ఎండీ కార్మికులకు సూచించారు. దీంతో సమ్మె బాటపట్టడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని కార్మిక సంఘాలు నిర్ణయించాయి.
కదం తొక్కిన కార్మికులు..
వేతన సవరణపై స్పష్టత రాకపోవడంతో ముందుగా ప్రకటించినట్టుగానే గురువారం ఆర్టీసీ కార్మికులు బస్‌భవన్‌ను ముట్టడించారు. గురువారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వేల సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు కదంతొక్కారు. ఏపీ, తెలంగాణల్లోని జిల్లాల నుంచి తరలివచ్చిన కార్మికులు ఉదయం 11 గంటలకు సుందరయ్య పార్కు నుంచి బస్‌భవన్ వరకు ర్యాలీగా వచ్చారు. అనంతరం బస్‌భవన్ ప్రాంగణంలో బహిరంగసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వేతన సవరణలో జరుగుతున్న జాప్యంపై కార్మికలోకం తీవ్రంగా మండిపడింది. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచి తమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమంగా వేతనాలు పెంచాల్సిందేనని, పక్షం రోజుల్లో ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే సమ్మెకు దిగి తీరుతామని ప్రకటించింది.
నష్టాలకు కారణం ప్రభుత్వాలే..
ఆర్టీసీ తీవ్ర నష్టాలను మూటగట్టుకోవటానికి ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలే కారణమని ఈయూ ప్రధాన కార్యదర్శి పద్మాకర్, టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. ఇప్పుడు వాటిని బూచిగా చూపి వేతన సవరణను వాయిదా వేయటం సబబు కాదన్నారు. ఆ నష్టాలను సాకుగా చూపి కార్మికులకు అన్యాయం చేస్తే సహించబోమని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువగా కష్టించి పనిచేస్తున్నామని, అలాంటప్పుడు వారితో సమంగా వేతనాలు కోరుకోవటంలో తప్పేంటని ప్రశ్నించారు. రెండు ప్రభుత్వాలు దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. పరిపాలన పరంగా ఆర్టీసీని వెంటనే విభజించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఈయూ-టీఎంయూ కూటమికి కార్మికులంతా మద్దతు పలకాలని కోరారు. సభలో రెండు సంఘాల ప్రతినిధులు బాబు, థామస్‌రెడ్డి, రాజిరెడ్డి, బీవీ రెడ్డి, ఎస్‌వీబీ రాజేంద్రప్రసాద్, మారయ్య, హన్మంతరావు, రామకృష్ణ, ప్రసాదరెడ్డి, దామోదరరావు తదితరులు పాల్గొన్నారు.
ఎక్కడికక్కడ నిలిచిన బస్సులు..
బస్‌భవన్ ముట్టడి కోసం వేల సంఖ్యలో కార్మికులు హైదరాబాద్ చేరుకోవటంతో రెండు రాష్ట్రాల్లో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఉదయం పూట నడవాల్సిన బస్సులు చాలావరకు డిపోలకే పరిమితమయ్యాయి. హైదరాబాద్‌లో ఉదయం షిఫ్ట్ తిరగాల్సిన బస్సుల్లో దాదాపు 80 శాతం డిపోలకే పరిమితం కావటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో పరీక్షలకు హాజరవుతున్న పదో తరగతి విద్యార్థులు అవస్థలు పడాల్సి వచ్చింది.