‘ఇది నా జిల్లా. నాతోపాటు ఆర్థిక మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా. పనిలో నిక్కచ్చిగా ఉంటా. ఇక్కడ ఏ ప్రాబ్లం రాకూడదు. నిర్దేశించిన ల క్ష్యం పూర్తి కాకపోతే చెడ్డపేరొస్తుంది. అధికారులు ఇస్తున్న సమాధానాలు క్యాజువల్‌గా ఉంటున్నాయి. ఇట్లయితే కుదరదు. మళ్లీ రెండు నెలల్లో వస్తా. అప్పుడు కూడా ఇట్లనే నిర్లక్ష్య సమాధానాలిస్తే సస్పెండ్ చేస్తా’ శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో అధికారులను ఉద్దేశించి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చేసిన వ్యాఖ్యలవి.
దాదాపు నాలుగు గంటలకుపైగా జరిగిన సమీక్ష సమావేశంలో పలు పథకాలకు సంబంధించిన పురోగతి, అమల్లో ఎదురవుతున్న అడ్డంకులు తదితర అంశాలపై అధికారులకు సూటి ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టేందుకు యత్నించారు. వాటర్‌గ్రిడ్, ఉపాధిహామీ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు మంత్రి అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వకపోవడంపై పలు సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ఇది నా జిల్లా. పైగా నేను నిర్వహిస్తున్న శాఖ. ఇట్లయితే ఎట్లా? సమీక్ష ఉందని తెలిసి కూడా ప్రిపేరై రాకపోతే ఎట్లా? ఇది పనికిరాదు’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ప్రధానంగా వాటర్‌గ్రిడ్ ఎస్‌ఈ, డ్వామా పీడీ, డీపీఓలు స్పందించిన తీరుపై మండిపడ్డారు. మరోసారి ఇదే రకమైన సమాధానాలిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇందిర జలప్రభ పథకం పురోగతిపై వెంటనే గ్రామీణాభివృద్ధి కమిషనర్‌కు సమగ్ర నివేదిక ఇవ్వాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని డ్వామా పీడీ గణేష్‌ను హెచ్చరించారు. మంచినీ టి ఎద్దడి నివారణపై అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై జిల్లా ఎమ్మెల్యేలంతా ఫిర్యాదు చేశారు.
ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం ఉండటం లేదని వాపోయారు. కేటీఆర్‌తోపా టు ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సైతం తీవ్రంగా స్పందించారు. ‘ఒక్క ఆడబిడ్డ కూడా ఎండకాలంలో బిందె పట్టుకుని రోడ్డుపైకి రా కూడదు. అందుకోసం ఎన్ని డబ్బులైనా ఖర్చు చేస్తామని ఇంతకుముందే చెప్పాం కదా!’ అని ఈటెల పేర్కొనగా, ‘ఎమ్మెల్యేలూ... మీరు అధికారులను దబాయించి అడగండి. మంచినీళ్లతోపాటు ప్రభుత్వం నిర్దేశించుకున్న పనులు సకాలంలో పూర్తయ్యేందుకు పూర్తిగా సహకరించండి’ అని కేటీఆర్ సూచించారు. ఇంకా ఈ సమావేశంలో కేటీఆర్ ఏమన్నారంటే...
వాటర్‌గ్రిడ్‌లో భాగంగా కరీంనగర్ జిల్లాకు 5,110 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నాం. జిల్లాలోని మారుమూల, అటవీ ప్రాంతంతోసహా ప్రతి ఒక్క ఇంటికీ మూడున్నరేళ్లలోపు రక్షిత మంచినీరు అందించాల్సిందే. ఒకవైపు ఇంటెక్‌వెల్స్ ఏర్పాటుతోపాటు మరోవైపు భూసేకరణ, పైపులైన్ల ఏర్పాటు పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాల్సిందే. ప్రతి ఒక్క ఇంటికీ సమాన స్థాయిలో నీరందించడమే మా లక్ష్యం.
మిడ్‌మానేరు రెండేళ్లలో పూర్తవుతుందన్న వాటర్‌గ్రిడ్ అధికారుల జవాబుపై మంత్రి స్పందిస్తూ ‘ఏడాదిలో పూర్తి చేస్తామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. మీరేమో రెండేళ్లు అంటున్నారు. అసలు మీ మధ్యే సమన్వయం లేకపోతే ఎట్లా?’అని ప్రశ్నించారు. భూ సేకరణ విషయంలో అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ ఆధ్వర్యంలో వాటర్‌గ్రిడ్‌పై వారం వారం సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
అధికారులు ఇచ్చిన అంచనాలకు, వాస్తవాలకు పొంతన లేదని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. అంచనాలు రూపొందించే విషయంలో కనీసం తమను సంప్రదించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. నగర మేయర్ రవీందర్‌సింగ్ మాట్లాడుతూ వాటర్‌గ్రిడ్ పథకం నుంచి కరీంనగర్‌ను తీసేశారని వాపోయారు. మంత్రి స్పందిస్తూ.. ఎమ్మెల్యేలను సంప్రదించిన తరువాతే నివేదికలను రూపొందించాలని ఆదేశించారు. కరీంనగర్ కార్పొరేషన్‌కు సైతం మంచినీరు అందిస్తామని, అధికారుల మాటలే శిలాశాసనం కాదని హామీ ఇచ్చారు.
పెద్దపల్లి, కోరుట్ల, చొప్పదండి, రామగుండం ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కె.విద్యాసాగర్‌రావు, బొడిగె శోభ, సోమారపు సత్యనారాయణ సైతం అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గాల్లో మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, అధికారులతో ఎన్నిసార్లు మాట్లాడినా ఫలితం లేదని వాపోయారు. వాటర్‌గ్రిడ్ విషయంలో తమను సంప్రదించలేదన్నారు. కేటీఆర్ స్పందిస్తూ ‘ఏ గ్రామంలో వాటర్‌ట్యాంక్ ఎంత ఎత్తులో ఉంటుంది? ఎంత ఎత్తు నుంచి నీళ్లు సరఫరా అవుతాయనే వివరాలన్నీ ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిందే. మీరు(ఎమ్మెల్యేలను ఉద్దేశించి) ఈ విషయంలో వారిని దబాయించి అడగండి.
మంత్రి ఈటెల మాట్లాడుతూ.. పదిరోజుల క్రితమే నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో ప్రాక్టికల్‌గా ఉండాలని చెప్పానని అన్నారు. అయినప్పటికీ అధికారులు ఆశించిన స్థాయిలో స్పందించకపోవడంపై మండిపడ్డారు.
రోడ్ల అంశం చర్చకు వచ్చినప్పుడు ‘సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా జిల్లాలో రోడ్లన్నీ తళతళలాడాల్సిందే. రోడ్లు పనుల్లో నాణ్యత లోపిస్తే ఊరుకునేది లేదు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లాలో రోడ్ల పనుల కోసం దాదాపు రూ.1800 కోట్లు వెచ్చిస్తున్నాం. దుబాయి బీటీ మెటీరియల్‌ను వినియోగిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఇకపై ఒక్కసారి రోడ్డు వేశాక ఐదేళ్లపాటు అట్లాగే ఉండాలి. మధ్యలో పాడైనట్లు వార్తలొస్తే ఏఈ, డీఈలను సస్పెండ్ చేస్తా’ అని హెచ్చరించారు. వచ్చే మే నాటికి 50 శాతం రోడ్డు పనులు పూర్తి కావాల్సిందేనని స్పష్టం చేశారు.
జిల్లాలో 441 పంచాయతీలకు సొంత భవనాలు లేకపోవడం పట్ల మంత్రి అసహనం వ్యక్తం చేశారు. తన సొంత జిల్లా అయినందున ఆయా పంచాయతీలకు భవనాలు నిర్మించే విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అధికారులకు సూచించారు.
గోదావరి పుష్కరాల్లో భాగంగా జిల్లాకు రూ.110.96 కోట్ల నిధులు కేటాయించామ ని కేటీఆర్ చెప్పారు. జిల్లాలో పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని రకాల వసతులు కల్పించేం దుకు తగిన చర్యలు తీసుకోవాలి. ఇందుకో సం ప్రత్యేకంగా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్‌ను నియమించడం జరిగిందన్నారు.
డీఎస్‌డీవో సత్యవాణి మాట్లాడుతూ.. పం చాయతీరాజ్ శాఖ నుంచి జిల్లా స్పోర్ట్స్ అ థారిటీకి నిధులు రావడం లేదని అన్నారు. ప్రస్తుతం తమ శాఖ కనీసం కరెంటు బిల్లు లు కూడా కట్టలేని పరిస్థితిలో ఉందని వా పోయారు. కేసీఆర్ క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, ఈ విషయంపై సమీక్షించి సమస్యను పరిష్కరించాలని మంత్రి కలెక్టర్‌కు సూచించారు.
తేడా వస్తే.. సస్పెండ్ చేస్తా
Published Sat, Feb 21 2015 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 9:38 PM
Advertisement
Advertisement