సాక్షి, హైదరాబాద్ : కరోనా విస్తరణకు సంబంధించి ప్రస్తుతమున్న అంచనాలు, అధ్యయన పద్ధతులను క్రోడీకరిస్తూ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గువాహటి కొత్త అధ్యయన విధానాన్ని రూపొందించింది. కరోనా విస్తరణను రోజువారీగా నమోదవుతున్న కేసుల సంఖ్య ఆధారంగా (డీఐఆర్) ప్రస్తుతం అంచనా వేస్తున్నారు. ఈ రకమైన లెక్కల ద్వారా కరోనా విస్తరణను శాస్త్రీయంగా అంచనా వేయడం సాధ్యం కాదని ఐఐటీ గువాహటి భావిస్తోంది. ఈ నేపథ్యంలో సింగపూర్‌లోని డ్యూక్–ఎన్‌యూఎస్ మెడికల్ స్కూల్ సహకారంతో కొత్త విధానాన్ని రూపొందించింది. కరోనా విస్తరణ వేగం (ఎక్స్‌పొనెన్షియల్ మోడల్), ఒక చోట నుంచి మరో చోటకు ఎలా వ్యాపిస్తోంది (లాజిస్టిక్ గ్రోత్), ఏ ప్రాంతంలో ఎక్కువగా విస్తరించే అవకాశం ఉంది వంటి అంశాలతో పాటు డీఐఆర్ డేటాను ఆధారంగా చేసుకుని కొత్త విధానం రూపొందించారు. (3 రాష్ట్రాల నుంచి రాకపోకలపై నిషేధం)
డీఐఆర్ ఆధారంగా అంచనాలు
కరోనా డెయిలీ ఇన్‌ఫెక్షన్ రేట్ (డీఐఆర్) ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉండగా, డీఐఆర్ ఆధారంగా రాష్ట్రాలను మూడు కేటగిరీలుగా వర్గీకరిస్తున్నారు. గత 2 వారాలుగా డీఐఆర్ పెరుగుతూ ఉంటే ఎక్కువ ‘తీవ్రమైన’(సివియర్).. డీఐఆర్ రెండు వారాలుగా స్థిరంగా ఉంటే ‘మోస్తరు’(మాడరేట్), రెండు వారాలుగా తగ్గుతూ ఉంటే నియంత్రిత (కంట్రోల్డ్)గా పరిగణిస్తున్నారు. డీఐఆర్ ఆధారంగా కాకుండా ఐఐటీ గువాహటి పరిశోధకుల విశ్లేషణ ప్రకారం లాజిస్టిక్ గ్రోత్‌ను ఆధారంగా చేసుకుంటే.. వచ్చే నెల రోజుల్లో కరోనా కేసుల సంఖ్య తగ్గుతుందని, ఎక్స్‌పొనెన్షియల్ మోడల్ పరంగా చూస్తే పరిస్థితి మరింత దిగజారుతోందని తేలింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధనలు సడలిస్తుండటంతో కేసుల సంఖ్య పెరిగే అవకాశముందనే వాదన వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా డీఐఆర్ సగటును 0.10గా తీసుకుని మే 1న రాష్ట్రాల వారీగా నమోదైన కేసుల సంఖ్యను ఆధారంగా తీసుకుని లెక్కలు వేస్తే శాస్త్రీయమైన ఫలితాలు రావట్లేదు.
రాష్ట్రాల వారీగా అంచనాలు
రాష్ట్రాల వారీగా డీఐఆర్ విలువ ఆధారంగా లాజిస్టిక్, లాజిస్టిక్– ఎక్స్‌పొనెన్షియల్, ఎక్స్‌పొనెన్షియల్ పద్ధతుల్లో మే 31 నాటికి కరోనా పరిస్థితిని ఐఐటీ గువాహటి పరిశోధకులు అంచనా వేశారు. నమోదయ్యే కేసుల సంఖ్యను వివిధ పద్ధతుల్లో అంచనా వేస్తూ, కరోనా వేగంగా విస్తరిస్తే మహారాష్ట్రలో 2 లక్షలు, గుజరాత్‌లో లక్షకు పైగా కేసులు నమోదయ్యే అవకాశముందని తేలింది.
Comments
Please login to add a commentAdd a comment