గవర్నర్‌కు జర్నలిస్టు సంఘాల నేతల ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: టీ న్యూస్ చానల్‌కు ఏపీ పోలీసులు అర్ధరాత్రి వేళ నోటీసులిచ్చి పత్రికా స్వేచ్ఛపై దాడి చేశారని వివిధ జర్నలిస్టు సంఘాల నేతలు, పాత్రికేయులు గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. న్యూస్ చానళ్లకు, టీవీ ప్రసారాలకు కేబుల్ టీవీ నెట్‌వర్క్ చట్టం వర్తించదని, కేబుల్ ఆపరేటర్స్‌కు సంబంధించిన ఈ చట్టంపై పక్కరాష్ట్రం పోలీసులు నోటీసులు జారీ చేయడం చట్టాలను ఉల్లంఘించడమేనని గవర్నర్‌కు అందజేసిన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, నమస్తే తెలంగాణ పత్రిక ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి, సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఆర్.దిలీప్‌రెడ్డి, జై తెలంగాణ సీఈవో క్రాంతికిరణ్, వివిధ పాత్రికేయ సంఘాల నేతలు కె.విరాహత్ అలీ, బి.బసవపున్నయ్య, పల్లె రవికుమార్, ఎస్.వినయ్‌కుమార్ తదితరులు గవర్నర్‌ను కలిశారు. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడిన ‘ఆడియో వెర్షన్’ను ప్రసారం చేసినందుకు వైజాగ్ ఏసీపీ రమణ టీ న్యూస్ కార్యాలయంలోకి చొరబడి నోటీసులు జారీ చే శారని వివరించారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం అల్లం నారాయణ, శేఖర్‌రెడ్డి, ఆర్. దిలీప్‌రెడ్డి తదితరులు మాట్లాడుతూ మీడియా స్వేచ్ఛను అడ్డుకోవడం ద్వారా నిజాలను దాచలేరన్నారు. తనకు చుట్టుకున్న ఉచ్చును హైదరాబాద్‌కు చుట్టాలని బాబు చూస్తున్నారన్నారు.