సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ ప్రజల అవసరాలకు సరిపడా ఆధునిక స్లాటర్ హౌస్‌లు జీహెచ్‌ఎంసీలో లేవు. ఉన్నవి సక్రమంగా పనిచేయడం లేదు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ గురువారం అంబర్‌పేట స్లాటర్‌హౌస్ ఆకస్మిక తనిఖీ చేయగా ఈ విషయం వెలుగు చూసింది. అక్కడ ఆధునిక స్లాటర్‌హౌస్ ఉన్నప్పటికీ, వెలుపల అశాస్త్రీయంగా జంతు వధ జరుగుతోంది. అంతేకాదు.. సదరు స్లాటర్‌హౌస్ నిర్వహణకు తీసుకున్న ఏజెన్సీ కొంతకాలంగా జీహెచ్‌ఎంసీకి రాయల్టీగా చెల్లించాల్సిన మొత్తం కూడా చెల్లించడం లేదని తేలింది. ఈ వ్యవహారం కోర్టు వివాదంలో ఉండగా, వివాదం ముగిసేంత వరకు 25 శాతమైనా చెల్లించాలి. ఆ చెల్లింపుల పేరిట ఇచ్చిన చెక్కులు కూడా బౌన్సయ్యాయి. అయినా సంబంధిత అధికారులు కోర్టు వివాదం పరిష్కరించడంలో శ్రద్ధ చూపలేదని, స్లాటర్ హౌస్ వెలుపల వధ జరుగుతున్నా పట్టించుకోలేదనే విషయాలు వెలుగు చూశాయి. నగరంలోని మిగతా స్లాటర్‌హౌస్‌లపై కూడా జీహెచ్‌ఎంసీ అధికారులు శ్రద్ధ చూపకపోవడంతో వాటిలో ఆధునిక పద్ధతిలో జరగాల్సిన వధ.. ఆరుబయట విచ్చలవిడిగా జరిగుతుందని తేలింది. బయటి వ్యాపారులకు జీహెచ్‌ఎంసీ అధికారులకు మధ్య లోపాయికారీ సంబంధాలు ఉండటం వల్లే ఈ పరిస్థితి నెలకొందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అంతా ఆరుబయటే..
నగర జనాభాలో దాదాపు 70 శాతం మంది మాంసాహారులే. నిబంధనల మేరకు జీహెచ్‌ఎంసీ ధ్రువీకరించి స్టాంప్ వేసిన మాంసాన్నే విక్రయించాలి. కానీ, నగరంలో ఉన్న స్లాటర్ హౌస్‌లలో కాకుండా బయటే ఈ తతంగం జరుగుతోంది. అయినా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోరు. దీంతో ప్రజలకు శుభ్రమైన మాంసం అందక పోగా జీహెచ్‌ఎంసీకి రావాల్సిన ఆదాయమూ రావడం లేదు. అంబర్‌పేటతో పాటు రామ్నాస్‌పురా స్లాటర్‌హౌస్ వద్ద కూడా ఆధునిక యంత్రాలతో కాకుండా నేలపైనే పురాతన పద్ధతుల్లోనే వధిస్తున్నా అధికారులు పట్టించుకుంటున్నది లేదు. అక్కడ రోజుకు దాదాపు 600 జంతు వధ జరుగుతుండగా, దాదాపు 100 మాత్రమే స్లాటర్‌హౌస్‌లో వధిస్తున్నారు. మిగతావి బయటే అశాస్త్రీయంగా వధిస్తున్నారు. తొలుత దీనిని ఒక ప్రైవేటు ఏజెన్సీకి నిర్వహణకిచ్చారు. కాంట్రాక్టు మేరకు జీహెచ్‌ఎంసీకి ఏటా రూ.5.20 కోట్లు రావాలి. రూ.అరకోటి కూడా చెల్లించకపోవడంతో కాంట్రాక్టు రద్దుచేసి, జీహెచ్‌ఎంసీయే నిర్వహిస్తోంది. ఒక్కో జంతువుకు రూ.100 చొప్పున జీహెచ్‌ఎంసీకి కేవలం దాదాపు రూ.10 వేలు మాత్రమే వస్తుండగా, బయట వధిస్తున్నవారికి మాత్రం అంతకు ఎన్నోరెట్లు అధికంగా వస్తోంది. అక్కడ కేవలం గొడ్లను వధించే యంత్రాలు మాత్రమే ఉండగా, అంబర్‌పేట, బోయిగూడల్లో గొడ్లతో పాటు మేకలు, గొర్రెలు వధించే యంత్రాలున్నాయి. ఈ ఆధునిక కేంద్రాలకు కూడా మాంసం వ్యాపారులు రావాల్సినంత మంది రావడం లేదు. దానివెనుకా ప్రైవేట్ హస్తమే ఉందనే ఆరోపణలున్నాయి. ఎక్కడ పడితే అక్కడ వధ జరుగుతుండటంతో, మాంసాన్ని నేలపై ఉంచడం వల్ల బాక్టీరియా పెరుగుతుందని వెటర్నరీ వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అంతటా ఉల్లంఘనే..
నిబంధనల మేరకు స్లాటర్‌హౌస్‌లలో వెటర్నరీ అధికారులు ఉండి వధకు వచ్చే జంతువులు ఆరోగ్యంగా ఉన్నట్లు ధ్రువీకరించాలి. కానీ ఎక్కడా ఆ పని జరగడం లేదు. దీంతో దిగువస్థాయి సిబ్బంది ఆడింది ఆటగా సాగుతోంది. జియాగూడతో సహా నగరంలోని వివిధ ప్రాంతాల్లో సంప్రదాయ పద్ధతిలోనే వధిస్తున్నారు. ఒక్క జియాగూడలోనే రోజుకు దాదాపు 4 వేలకు పైగా జీవాలను వధిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులతో కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఆధునిక స్లాటర్‌హౌస్‌లు అలంకార ప్రాయంగానే మిగిలాయి.
♦ అంబర్‌పేట స్లాటర్ హౌస్‌లో రోజుకు 2000 మేకలు/గొర్రెలతో పాటు 300 గొడ్లను వధించే సామర్థ్యం ఉంది. కానీ కేవలం 300 మేకలు/గొర్రెలు, 150 గొడ్ల వధ మత్రమే జరుగుతోంది. మిగతావి ఆరుబయట చేస్తున్నారు. ఇక్కడి నుంచి జీహెచ్‌ఎంసీకి రూ.10.30 కోట్ల రాయల్టీ రావాలి.
♦ న్యూబోయిగూడ స్లాటర్ హౌస్‌లో కూడా రోజుకు 2000 మేకలు/గొర్రెలతో పాటు 200 గొడ్లను వధించవచ్చు. కానీ 150 మేకలు/గొర్రెలు, 60 గొడ్ల వధ మాత్రమే జరుగుతోంది. ఇక్కడి నుంచి బల్దియాకు రూ.9.30 కోట్లు రావల్సి ఉంది.
♦ రామ్నాస్‌పురాలో గల ఆధనిక జంతు వధశాలలో 100 గొడ్లను వధించే సామర్థ్యం ఉంది. ఇక్కడి నుంచి రూ.5.20 కోట్లు రాయల్టీ రావాలి.
Comments
Please login to add a commentAdd a comment