పత్తి రైతుకు బీజీ–3 ఉరి? | Illegal BG-3 investigations in Telangana farmland | Sakshi
Sakshi News home page

పత్తి రైతుకు బీజీ–3 ఉరి?

Published Sun, Dec 17 2017 3:59 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Illegal BG-3 investigations in Telangana farmland - Sakshi

ఈ రైతు పేరు శీలం చంద్రమౌళి. సిద్దిపేట జిల్లా మర్మాముల గ్రామం. వ్యవసాయం తప్ప ఇంకోపని రాదు. ఏటా తనే విత్తనం ఎంపిక చేసుకుంటాడు. ఈ ఏడాది కూడా మార్కెట్‌కు వెళ్తే బోల్‌గార్డు–3(బీజీ–3) విత్తనం అని చెప్పి వీణా కంపెనీ పేరుతో ఉన్న ప్యాకెట్‌ చేతిలో పెట్టారు. విత్తనం మొలకెత్తింది. కలుపు చావటానికి ఫలానా మందు ఉందని దుకాణం అతనే సలహా ఇస్తే.. ఆ మందు తీసుకొచ్చి కొట్టాడు. ఆకుకు పురుగు పడితే.. నువాక్రాన్, ఉలాలా కొట్టమని చెప్తే అప్పోసప్పో చేసి మూడుసార్లు పురుగు మందు పిచికారి చేశాడు. చేనుకు బోరు నీళ్లు పెట్టాడు. పంట ఏపుగా ఏడడుగుల ఎత్తు పెరుగుతుంటే ఎన్నో ఆశలూ పెంచుకున్నాడు. కానీ చివరికి వచ్చేసరికి చెట్టుకు పూత, కాయ పట్టలేదు.

ఇలా ఒకరు.. ఇద్దరు కాదు రాష్ట్రంలో తొమ్మిది లక్షల మందికిపైగా రైతులు తమకు తెలియకుండానే కార్పొరేట్‌ విత్తన కంపెనీల ప్రయోగాలకు సమిధలయ్యారు. కొన్ని బహుళజాతి విత్తన సంస్థలు అత్యంత రహస్యంగా జన్యుమార్పిడి పత్తి వంగడాన్ని సృష్టించాయి. దానికి ఇంకా పేరు పెట్టలేదు. అనధికారికంగా బోల్‌గార్డు–3(బీజీ–3) పేరుతో పిలుస్తున్నారు. తెలంగాణ మెట్ట భూముల్లో ప్రస్తుతం ఈ విత్తనాన్ని సాగు చేసి వంగడం నాణ్యత, దిగుబడి తీరుపై చట్టవిరుద్ధమైన పరిశోధనలు చేస్తున్నారు. అనధికారిక డీలర్లు, ప్రత్యేక ఏజెంట్ల ద్వారా గ్రామీణ వ్యవసాయంలోకి విత్తనాలు చొప్పించిన కొన్ని కంపెనీలు దాదాపు 13 లక్షల ఎకరాలను బీజీ–3 విత్తనంతో నింపేసినట్టు తేలింది. అన్నదాతలకు ఏమాత్రం అనుమానం రాకుండా వారి చేతనే పెట్టుబడులు పెట్టించి, పైకి సాధారణ వ్యవసాయంగానే ఈ విషపు ప్రయోగం ‘సాగు’తోందని ‘సాక్షి’క్షేత్రస్థాయి పరిశోధనలో వెల్లడైంది. ఈ కార్పొరేట్‌ మాయకు చిక్కి బయటపడలేక రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవటంతో పాటు అనారోగ్యం పాలవుతున్నట్టు బయటపడింది. ‘సాక్షి’క్షేత్ర స్థాయి పరిశోధనలో వెల్లడైన వాస్తవాలపై ఈ వారం ఫోకస్‌..
– వర్ధెల్లి వెంకటేశ్వర్లు, సాక్షి ప్రత్యేక ప్రతినిధి

ఇతని పేరు వేల్పుల చిన యలమంద. సూర్యాపేట జిల్లా, దొండపాడుకు చెందిన కౌలు రైతు. విత్తనాల కోసం డీలర్‌ దగ్గరకుపోతే.. బోల్‌ గార్డు–3 విత్తనాలు కొత్తగా వచ్చాయని, అద్భుతమైన దిగుబడి వస్తుందని, కలుపు రాదని చెప్పాడు. రూ.800 తీసుకుని సంచి చేతిలో పెట్టాడు. విత్తనం విత్తిన 20 రోజుల తర్వాత చెట్టు కంటే ఏపుగా కలుపు పెరిగిందని డీలర్‌ దగ్గరకు పోతే.. గ్లైఫోసెట్‌ మందు పిచికారి చేయమని సలహా ఇచ్చాడు. దానిని వాడితే కలుపు పోయింది.. చెట్టు ఏపుగా ఎదిగింది. కానీ కాయలు మాత్రం రాలేదు. కాయలు రాలేదని డీలర్‌ను నిలదీస్తే.. ‘నీళ్లెట్టా కట్టారు..? పురుగు మందు పిచికారి తర్వాత చేను ఎలా ఉంది? కాయలు ఎన్ని వచ్చాయి..? పత్తి బరువు ఎట్లా ఉంది?’అనే వివరాలు తీసుకున్నారు. అంతకు మించి మరే విధమైన సాయం చేయలేదు.

2,500 గ్రామాల్లో బీజీ–3 సాగు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించిన బోల్‌గార్డు–3 పత్తి విత్తనాలు తెలంగాణ పంట భూముల్లో మాత్రం యథేచ్ఛగా మొలిచాయి. రాష్ట్రంలో 2,500 గ్రామాల్లో బీజీ–3 పత్తి విత్తనాన్ని సాగు చేసినట్లు అఖిల భారత కిసాన్‌ సంఘం, తెలంగాణ రైతు సంఘాల పరిశీలనలో తేలింది. దాదాపు తొమ్మిది లక్షల మంది రైతులు 13 లక్షల ఎకరాల్లో ఈ విషాన్ని సాగు చేసినట్టు గుర్తించారు. ఈ విత్తనాలు వేసిన చోట పత్తి పంట 6 నుంచి 7 అడుగుల ఎత్తు పెరిగినా.. పువ్వులు, కాయలు లేకుండా గిడసబారిపోయాయి. ఎకరం చేనులో 50 కిలోల నుంచి ఒక క్వింటాల్‌ లోపే పత్తి దిగుబడి వచ్చింది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 1.5 లక్షల ఎకరాలు, నల్లగొండలో 1.5 లక్షలు, వరంగల్‌లో 1.5 లక్షలు, ఆదిలాబాద్‌ జిల్లాలో లక్ష ఎకరాల చొప్పున ప్రమాదకర స్థాయిలో, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఓ మోస్తరు స్థాయిలో బీజీ–3 పత్తి విత్తనాన్ని సాగు చేసినట్లు రైతు సంఘాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాత జనగామ తాలూకా మద్దూరు మండలంలోని బైరాంపల్లి, లద్నూరు, మద్దూరు, మర్మాముల, వంగపల్లి, జాలపల్లి, అర్జునపట్ల, కూటిగల్, ధర్మారం, నర్సాయపల్లి, కొండాపూర్, ధూల్‌మిట్ట, వల్లపట్ల, గాగిళ్లాపూర్‌ చేర్యాల మండలంలోని ఆకునూరు, రాంపూర్, సిద్దిపేట జిల్లా గట్ల మల్యాల తదితర 17 గ్రామాల్లో ‘సాక్షి’బాధిత రైతులను కలసి వారి నుంచి వివరాలు సేకరించింది.

కిలోల లెక్కన విడిగా అమ్మకం..
మర్మాముల గ్రామంలో 18 మంది రైతులు 42 ఎకరాల్లో బీజీ–3 సాగు చేశారు. చేర్యాలకు చెందిన ఓ విత్తన డీలర్‌ తమకు శివా సీడ్స్‌ వారి వీణా బీజీ–2 విత్తన ప్యాకెట్‌లోనే బీజీ–3 విత్తనాలు, కలుపు నివారణ కోసం గ్లైఫోసెట్‌ అనే హెర్బిసైడ్‌ టాలరెంట్‌ రసాయనాన్ని వాడమని ఇచ్చాడని డాకూరి తిరుపతిరెడ్డి అనే రైతు చెప్పాడు. ఈ రసాయనాన్ని పిచికారి చేస్తే మొక్క మినహా మిగిలిన కలుపు మొక్కలన్నీ చనిపోయాయి. గాగిళ్లాపూర్‌ గ్రామంలో 15 మంది రైతులు 75 ఎకరాల్లో బీజీ–3ని సాగు చేశారు. అయితే వీటిని ప్యాకెట్ల రూపంలో కాక విడి విత్తనాలను కిలోల లెక్కన విక్రయించారు. బైరాంపల్లి గ్రామానికి చెందిన చంద్రారెడ్డి, బాల్‌రెడ్డి అనే అనధికారిక విత్తన డీలర్లు వీటిని ఇచ్చినట్లు బాధిత రైతులు వాపోయారు. పాత జనగామ తాలూకాతో పాటు కరీంనగర్, వరంగల్, సిద్దిపేట జిల్లాల సరిహద్దు గ్రామాలకు బైరాంపల్లి డీలర్లే విత్తనాలు సరఫరా చేసినట్లు తెలుస్తోంది. వీళ్ల విత్తనాలు ఎంత దూరం వెళ్లాయో.. గాగిళ్లాపూర్‌ గ్రామానికి చెందిన రైతు నారదాసు పండరీ మాటల్లో ‘నా బామ్మర్ది నందనమోని మల్లయ్యది బైరాంపల్లే. పంట మంచిగ వస్తదని చెప్తే రెండు కిలోలు తెచ్చిపెట్టిన. నన్నుజూసి మా పక్కపంటి చెలుకాయన అహ్మద్‌ అలీ 4 కిలోలు తెచ్చిపెట్టిండు. మా బావ డ్యాగల శ్రీనివాస్‌ విత్తనం కోసం ఎదుకులాడుతుంటే బైరాంపల్లి జాడ జెప్పిన. ఆయన 4 కిలోలు కొనుక్కపోయిండు. వాళ్ల అన్నదమ్ములు కూడా ఇదే విత్తనాలు కొని పెట్టిండ్రు. అందరి పంటలు పోయినయి’అని వాపోయాడు. బాధిత రైతులు చెప్తున్న దాని ప్రకారం బైరాంపల్లి డీలర్లు 100–150 గ్రామాలకు విత్తనాలు సరఫరా చేసినట్లు తెలుస్తోంది. డీలర్లను అడిగితే.. తాము కర్నూలు జిల్లా నుంచి విత్తనాలు తెచ్చామని, విత్తనం వేసిన తర్వాత మోసపోయామని చెప్పారు. అయితే వీటికి ఎలాంటి రశీదులు లేకపోవడం గమనార్హం.

ఏడడుగులు పెరిగినా.. పూత, కాయ లేదు
ప్రాంతం ఏదైనా.. లూజ్‌ విత్తనాలు ఇచ్చినా.. ప్యాకెట్ల రూపంలో అంటగట్టినా.. మొక్కల ఎదుగుదల మాత్రం అన్ని జిల్లాల్లో ఒకేలా ఉంది. విత్తనం మొలకెత్తిన 25 రోజుల లోపు రౌండ్‌అప్‌(గ్లైఫోసెట్‌) అనే రసాయనాన్ని పిచికారి చేస్తే కలుపు చనిపోయి మొక్క నిగనిగలాడుతూ పెరిగింది. మిగిలిన పంటకు.. అంటే కంది, మిరప, పత్తిలోనే బీజీ–2 రకానికి ఈ రసాయనం తాకితే చనిపోయాయి. ఒక్క బీజీ–3 మాత్రమే దీనికి తట్టుకుంది. తొలి దశలో పంటకు తెగుళ్లు సోకగా.. వాటికి నువాక్రాన్, ద్రోణ, ఉలాలా, కాన్ఫిడార్‌ తదితర పురుగు మందులు పిచికారి చేయమని చెప్పారు. అవే మందులు తెచ్చికొడితే తెగుళ్లు పోయి ఒక్కో మొక్క 6 నుంచి 7 అడుగుల వరకు పెరిగాయి. చేను ఇంత బాగా ఎదిగినందుకు ఎకరాకు 10 నుంచి 13 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని రైతు ఆశిస్తే.. చెట్టు ఎదిగింది కానీ పూత, కాత లేదు. ఒక్కో చెట్టుకు 10 నుంచి 12 కాయలే వచ్చాయి. ఈ లెక్కన ఎకరాకు 1.5 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. బీజీ–3 విత్తనాల దెబ్బకు రాష్ట్రంలో పత్తి ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఈ ఏడాది 47.73 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా.. ఎకరానికి సగటున 7 క్వింటాళ్ల చొప్పున 3.76 కోట్ల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఆ మేరకు మార్కెటింగ్‌ శాఖ ఏర్పాట్లు చేసుకుంది. కానీ ఇప్పటి వరకు 66 లక్షల క్వింటాళ్ల పత్తి మాత్రమే మార్కెట్‌కు వచ్చింది. పంట చివరి దశలో బీజీ–3 విత్తనాల తాకిడిని గుర్తించిన వ్యవసాయ శాఖ అధికారులు హడావుడిగా దిద్దుబాటు చర్యలు చేపట్టారు. స్టిప్‌ టెస్టు పరీక్షల ద్వారా బీజీ–3 విత్తనాల సాగును నిర్ధారించారు.

నిలువునా మునిగిన పత్తి రైతు..
ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయం పూర్తిగా అప్పుల మీదనే సాగుతోంది. రైతులు గ్రామంలోని షావుకార్ల వద్దనో.. విత్తన వ్యాపారుల వద్దనో అప్పు కింద విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తుంటారు. పంట వచ్చినప్పుడు అప్పు తీర్చేలా ఒప్పందం చేసుకుంటారు. ఎలాగూ అప్పు కింద ఇస్తున్నారు కాబట్టి.. వ్యాపారి ఇచ్చిన విత్తనాలనే రైతులు తీసుకుంటున్నారు. వీటికి ఎలాంటి రశీదులూ ఉండవు. విత్తన డీలర్‌ నిబంధనల ప్రకారం ఒక పత్తి విత్తన ప్యాకెట్‌ అమ్మితే రూ.25–30 లాభం వస్తుంది. అదే బీజీ–3 విత్తన ప్యాకెట్‌ను విక్రయిస్తే రూ.500, కిలో లూజ్‌æ విత్తనాలు విక్రయిస్తే రూ.1,200 చొప్పున ఆదాయం సమకూరుతోంది. దీంతో వీరంతా రైతులకు బీజీ–3 విత్తనాలను అంటగట్టారు. వీటిని సాగు చేసి రైతులు భారీగా నష్టపోయారు. ‘సాక్షి’సేకరించిన వివరాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తున్న ప్రతి 100 మంది రైతుల్లో 47 మంది మండల కేంద్రంలోని అధికారిక విత్తన దుకాణాల నుంచి విత్తనాలు తీసుకుంటుండగా.. 53 మంది రైతులు గ్రామాల్లో్లని షావుకార్లు, ఇతర వడ్డీ వ్యాపారుల అప్పు కిందనే విత్తనాలు తీసుకున్నారు. బ్యాంకుల పంట రుణాలు అవసరమైన మాసంలో ఇవ్వకపోవటం కూడా రైతులు.. వడ్డీ వ్యాపారులు, ప్రయోగాత్మక విత్తనాల బారిన పడటానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

పెట్టుబడి ఎక్కువ.. దిగుబడి తక్కువ
ట్రాక్టర్‌తో దుక్కి దున్నటం, అరకలకు రూ.7 వేలు, విత్తనాలకు రూ.1,700, పురుగు మందులకు రూ.5 వేలు, కూలీల వేతనం రూ.2 వేలు ఇలా అన్నీ కలిపి ఎకరానికి సుమారు రూ.16 వేల వరకు పెట్టుబడి అయ్యింది. ఇందులో ఇంకా రైతు కష్టానికి లెక్క వేయలేదు. అయితే ప్రస్తుతం దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం ఎకరానికి రెండున్నర క్వింటాళ్ల పత్తి దిగుబడి మాత్రమే వచ్చింది. మరో 2 క్వింటాళ్లు వచ్చే అవకాశం ఉంది. మార్కెట్‌ రేటు చూస్తే నాణ్యత పేరుతో రూ.4 వేల కన్నా తక్కువకే కొంటున్నారు. దీంతో రైతన్న తీవ్రంగా నష్టపోతున్నాడు.

బీజీ–3 అంటే?
2006 నుంచి అధిక ఉత్పత్తితో పాటు కలుపును తట్టుకుని పెరిగే పత్తి మొక్కల సృష్టి కోసం అన్వేషణ సాగుతోంది. ఓ కార్పొరేట్‌ విత్తన సంస్థ పంటలో కలుపు మొక్కల నివారణకు రౌండ్‌అప్‌(గ్లైఫోసెట్‌) పేరుతో ఓ విష రసాయనాన్ని సృష్టించింది. ఈ రసాయనం ద్విదళ బీజ మొక్కల కలుపును సమర్థవంతంగా చంపేసింది. కానీ దాంతోపాటు కొన్ని ఎంపిక చేసుకున్న పంట మొక్కలను కూడా చంపేస్తోంది. ఈ నేపథ్యంలో కలుపు మందును తట్టుకుని పెరిగే శక్తి ఉన్న మొక్కలను సృష్టించటానికి జన్యుమార్పిడి చేసి రౌండ్‌ రెడీఫ్లెక్స్‌ మొక్కలను సృష్టించారు. అనగా ఇప్పటి వరకు రాష్ట్రంలో వినియోగంలో ఉన్న బీజీ–2 మొక్కల్లోనే మరో కొత్త జన్యువును చొప్పించి నూతన మొక్కను సృష్టించారు. వీటిని వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయటానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరగా.. పర్యావరణానికి విఘాతం ఏర్పడుతుందనే కారణంతో ఈ విత్తనాలకు అనుమతి నిరాకరించింది. దీంతో కొన్ని కార్పొరేట్‌ విత్తన కంపెనీలు ఎలాంటి పేరూ లేకుండా తెలంగాణలో ఈ విత్తనాలను విడుదల చేసి సాగు చేయిస్తూ పరిశోధనలు చేస్తున్నారు.

ప్రభుత్వమే ఆదుకోవాలి..
పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. సదాశివపేటలోని శ్రీ తేజ ఫెర్టిలైజర్‌ దుకాణంలో ఫోర్స్, మనీమేకర్, పూజ విత్తనాలను కొనుగోలు చేసి తీవ్రంగా నష్టపోయాను. ఈ విత్తనాలతో మంచి దిగుబడి వస్తుందని చెప్పడంతో కొనుగోలు చేశాను. 20 ఎకరాల్లో రూ.6 లక్షలు పెట్టుబడి పెట్టి పత్తి పంట సాగు చేశాను. ఎకరాకు రెండు పత్తి ప్యాకెట్లు విత్తాను. ఇప్పుడు ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి.
– ఎల్లారం నవాజులు, బాబిల్‌ గాం, సంగారెడ్డి జిల్లా

ఎకరాకు 2 క్వింటాళ్లు రావడం లేదు..
ఖరీఫ్‌లో నాకున్న ఐదెకరాల్లో పత్తి సాగు చేసిన. ఎకరాకు రెండు ప్యాకెట్ల చొప్పున మొత్తం 10 ప్యాకెట్లు కొనుగోలు చేసిన. చెట్టు ఏపుగా పెరిగింది. కానీ కాయ రాలేదు. ఎకరాకు రూ.35 వేల పెట్టుబడి పెట్టిన. ఇప్పుడు ఎకరాకు 2 క్వింటాళ్లకు మించి పత్తి దిగుబడి రావడం లేదు. సదాశివపేటలోని భవానీ సీడ్స్‌ దుకాణంలో విత్తన ప్యాకెట్లను కొనుగోలు చేసి నష్టపోయాను.
– సంధ్యనోళ్ల జయరాములు, బాబిల్‌ గాం, సంగారెడ్డి జిల్లా

ఏజెంటును నిలదీస్తే.. ఏం చెప్తలేడు..
బైరాంపల్లిలో నాలుగు కిలోలు తెచ్చి మూడు ఎకరాల్లో పత్తి పెట్టిన. కలుపు రాకుండా ఈ డబ్బా(గ్లైఫోసెట్‌) మందు ఇస్తే తెచ్చి పిచికారీ చేసిన. కలుపుపోయింది. చెట్టు ఏడడుగులు ఎదిగింది. కాయలు మాత్రం రాలేదు. ఎందుకు రాలేదని విత్తనాలిచ్చిన ఏజెంటును నిలదీస్తే.. చెట్టు ఎట్టాపెరిగినయ్, కాయలు ఎన్నివచ్చినయి అని అడిగిండు. మిగిలిన ముచ్చట ఏం చెప్తలేడు.
– డాకూరి తిరుపతిరెడ్డి, మర్మాముల, మద్దూరు

ఆరడుగులు ఎదిగినా.. కాపు లేదు
నేను కౌలు రైతును. ఐదెకరాల్లో పత్తి పెట్టిన. మా పక్క ఊరు సేటు దగ్గరే విత్తనం తెచ్చిన. గ్లైఫోసెట్‌ కొడితే కలుపు పోయింది. తొలకరిలో తెగుళ్లు ఆశిస్తే.. నువాక్రాన్, ఆర్తీన్, ఫ్రైడ్, కాన్ఫిడార్, అక్టోర్‌ మందులు పిచికారీ చేశా. మొక్కల ఎదుగుదల ఆరు అడుగుల పైనే ఉంది. కాపు కాడికి వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. రెండుసార్లు ఏరితే 3 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. నకిలీ విత్తనాల సంగతి బయటకు చెప్పుకోలేక.. లోపల దాచుకోలేక సతమతం అవుతున్నాను.
– మారుడి బ్రహ్మారెడ్డి, దొండపాడు, సూర్యాపేట

చిల్లిగవ్వ కూడా రాలే..
రెండున్నర ఎకరాల్లో పత్తి పెట్టిన. ఎకరంలో బీటీ–2 గింజలు పెట్టిన. ఈ పంట బాగానే ఉన్నది. ఇంకో ఎకరన్నరలో వ్యాపారి మాటలు నమ్మి కొత్త పత్తి ఇత్తులు పెట్టిన. నాలుగు ప్యాకెట్ల విత్తనానికి రూ.3 వేలు, విత్తనం వేసింది మొదలుకుని.. ఎరువులు, క్రిమిసంహారక మందులు అన్నీ కలుపుకుని రూ.20 వేల వరకు ఖర్చు చేసిన. చెట్టు ఎదిగింది. కానీ ఒక్కో చెట్టుకు 4–5 కాయలు మాత్రమే వచ్చినయ్‌. ఈ ఎకరన్నరలో పంట మంచిగా పండితే.. నాకు 22 క్వింటాళ్లకుపైగా పత్తి వచ్చేవి. రూ.4 వేల చొప్పున ధర లెక్కేసుకున్నా రూ.88 వేలు వచ్చేవి. ఖర్చులు మినహాయిస్తే.. రూ.68 వేల ఆదాయం వచ్చేది. ఈసారి చిల్లిగవ్వ రాని పరిస్థితి ఏర్పడింది.
– పొట్ట కమలమ్మ, శ్రీగిరిపల్లి, సిద్దిపేట జిల్లా

జీఈఏసీ అనుమతి లేకుండానే సాగు..
తెలంగాణలో పత్తి సాగుపై మేం పరిశీలన చేశాం. బీజీ–3 విత్తనాల సాగు అత్యంత ప్రమా దకర స్థాయిలో ఉంది. రైతుకు తెలియకుండానే వారి ఖర్చులతో వారి పొలాల్లోనే ఈ విత్తనం మొలకెత్తటం, ఫలించటం జరిగింది. బీజీ–3 విత్తనాల ఫల నాణ్యతపై ప్రయోగం జరుగుతున్నా వ్యవసాయ శాఖ గుర్తించ లేకపోయింది. జెనెటిక్‌ ఇంజనీరింగ్‌ అప్రూవల్‌ కమిటీ(జీఈఏసీ) అనుమతి లేకుండానే బీజీ–3 విత్తనాలను తెలంగాణలో ప్రవేశపెట్టారు. కలుపు నివారణకు క్యాన్సర్‌ కారకమైన గ్లైఫోసెట్‌ రసాయనాన్ని వాడుతున్నారు. యూరోపియన్, ఆస్ట్రేలియా తదితర దేశాలు ఈ రసాయనాన్ని నిషేధించాయి. కేంద్రం దీనికి అనుమతి ఇవ్వలేదు. కానీ మన రాష్ట్రంలో 13 లక్షల ఎకరాల్లో బీజీ–3 విత్తనాలు సాగు అవుతున్నాయి.
– సారంపల్లి మల్లారెడ్డి, అఖిల భారత కిసాన్‌ సంఘం ఉపాధ్యక్షుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement