కాంగ్రెస్ నేతలను హత్య కేసులో ఇరికించడం అన్యాయమని, వరంగల్ డీసీసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డిపై కేసులను
డీజీపీని కలిసిన టీపీసీసీ బృందం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతలను హత్య కేసులో ఇరికించడం అన్యాయమని, వరంగల్ డీసీసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డిపై కేసులను ఉపసంహరించుకోవాలని టీపీసీసీ బృందం రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్(డీజీపీ)ని కోరింది. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్ర మార్క, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తదితరులు మంగళవారం డీజీపీని కలిశారు.
అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ వరంగల్‌లో టీఆర్‌ఎస్ నేత మురళి హత్య కేసులో నిందితులు లొంగిపోయారని, హత్య చేసిన ట్టుగా వారు అంగీకరించారని చెప్పారు. ఈ హత్యకు సంబంధంలేని రాజేందర్ రెడ్డి, నేతలు శ్రీమాన్, శేఖర్‌లపై కుట్ర కేసులు పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతల కుట్రతోనే హత్య జరిగిందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారని చెప్పారు. రాజకీయ ఒత్తిళ్ల వల్లే రాజేందర్‌రెడ్డిపై కేసులు పెట్టారని ఆరోపించారు. సిరిసిల్ల దళితుల మీద థర్డ్ డిగ్రీని ప్రయోగించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్టుగా ఉత్తమ్ వెల్లడించారు.