ముందుచూపు లేని అధికారులు..
మంజూరైన నిధులు రూ.6 కోట్లు..
నాలుగు నెలల కిందటే పనులు ప్రారంభం
తవ్విన రోడ్లు 1.2 కిలో మీటర్లు..
సీసీ వేసిన రోడ్డు 600 మీటర్లు మాత్రమే..
వికారాబాద్: దుమ్ము.. దూళితో పట్టణ ప్రజలు రోజూ అవస్థలు పడుతూ.. శ్వాసకోస వ్యాధులతో ఆస్పత్రుల పాలవుతున్నారు. అనేక ఆరోగ్య సమస్యలతో పట్టణ ప్రజలు భాదపడుతున్నా అధికారులకు మాత్రం చీమకుట్టినట్టయినా లేదు. ‘ఎవరికేమైతే మాకేంటి’ అనే ధోరణిలో పట్టణ వ్యాపారస్తులు వ్యవహరిస్తున్నారు. పట్టణలో పూర్తిస్థాయిలో రోడ్లు వేసి సుందరంగా తీర్చిదిద్దాలని ఆర్‌అండ్‌బీ అధికారుల ఆలోచనబాగున్నప్పటికీ.. అమలులో ముందుచూపు లేకపోవడంతో అధికారుల తీరుపై ప్రజలు ఒకింత అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చే స్తున్నారు. పట్టణ రోడ్డు వెడల్పుపై న్యాయస్థానాల్లో కేసులున్నప్పుడు కాంట్రాక్టర్లతో రోడ్లను ఎలా తవ్విస్తారని అధికారులపై ప్రజలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు.
పట్టణంలో ప్రధాన దారులను అడ్డదిడ్డంగా తవ్వి రెండు నెలలకు పైగా అయింది. ఇటు అధికారుల తీరు, అటు వ్యాపారుల వైఖరితో ఇబ్బందులకు గురవుతున్నది మాత్రం సామాన్య ప్రజలే.. రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 129,130,131లో వికారాబాద్ ఆర్‌అండ్‌బీ డివిజన్ పరిధిలో వందల సంఖ్యలో రోడ్లు మంజూరయ్యాయి. పట్టణంలో రోడ్లన్నీ అధికలోడ్‌తో లారీలు వెళ్లడంతో ధ్వంసమవుతున్నాయి. గమనించిన ఆర్‌అండ్‌బీ అధికారులు దీర్ఘాకాలంపాటు రోడ్డు ధ్వంసం కాకుండా ఉండేందుకు సీసీ రోడ్డు ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టారు.
దీంట్లోభాగంగానే వికారాబాద్ పట్టణం లో 1.5 కిలోమీటరు మేరకు ప్రధాన రహదారులను సీసీ రోడ్డుగా మార్చేందుకు రూ.6 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో నాలుగు నెలల కిందట పట్టణంలో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు బీజేఆర్ చౌరస్తా నుంచి ఆలంపల్లి సీసీ రోడ్డు నిర్మాణం పనులను ప్రారంభించారు. ఆలంపల్లి నుంచి ఎంఆర్‌పీ చౌరస్తా వరకు సీసీ పనులు పూర్తయ్యాయి. కానీ మహాశక్తి టాకీస్ నుంచి కెనరా బ్యాంకు వరకు సీసీ పనులు ఆగిపోయాయి.
అడ్డుకున్న వ్యాపారులు..
పట్టణంలో పెరుగుతున్న జనాభా, వాహనాల రాకపోకల దృష్ట్యా రోడ్డు వెడల్పు కార్యక్రమానికి ఆర్‌అండ్‌బీ అధికారులు 8 సంవత్సరాల కిందట రోడ్డు విస్తరణకు శ్రీకారం చుట్టారు. అప్పట్లో వ్యాపారులకు సంబంధించిన కొన్ని దుకాణాలకు నష్టం వాటిల్లింది. దీంతో కొందరు కోర్టును ఆశ్రయించారు. గతంలో చేసిన రోడ్డు వెడల్పు సంబంధించిన పనులు పూర్తిచేసిన తరువాతే ప్రస్తుతం సీసీ రోడ్డు పనులను ప్రారంభించాలని కోర్టు ద్వారా మధ్యంతర ఉత్తర్వులు పొంది అడ్డుకున్నారు. దీంతో ఎక్కడి పనులు అక్క డే ఆగిపోయాయి. నాలుగు నెలల కిందట తవ్వేసిన రోడ్ల తో పట్టణంలో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
మధ్యంతర ఉత్తర్వులు ఎత్తేస్తే..
ఆర్‌అండ్‌బీ అధికారులకు చిత్తశుద్ధి ఉంటే కోర్టులో వేసిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయించి పనులు పూర్తి చేయొచ్చని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తవ్వారు.. వదిలేశారు!
Published Thu, Nov 26 2015 1:37 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement
Advertisement