పీఠమెవరిదో..! | In four day municipal elections results | Sakshi
Sakshi News home page

పీఠమెవరిదో..!

Published Thu, May 8 2014 3:51 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM

In four day municipal elections results

కౌంట్‌డౌన్ మొదలైంది.. మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రకటనకు మరో నాలుగు రోజులే గడువు.. నాయకుల్లో ఒకటే టెన్షన్.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న నేపథ్యంలో బల్దియాపై తొలిసారి తమ జెండా ఎగురవేయాలని రాజకీయపార్టీలు వ్యూహప్రతివ్యూహాలకు పదునుపెడుతున్నాయి. బల్దియా పీఠం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నాయి. మెజారిటీ వస్తే తమదే చైర్మన్ పీఠం అంటూ ఆశావహులు తమవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కాస్త ఆర్థికంగా ఉన్న వారు ఇప్పటి నుంచే క్యాంప్ రాజకీయాలకు ప్రణాళికలు రచిస్తున్నారు.
 
 కరీంనగర్
 కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ పదవిని అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఏ పార్టీ కూడా ఇప్పటివరకు మేయర్ అభ్యర్థిని ప్రకటించలేదు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మధ్యే హోరాహోరీ పోరు ఉండగా మేయర్ పదవిని తామే దక్కించుకుంటామని రెండు పార్టీల నాయకులు ధీమాగా చెబుతున్నారు. మొత్తం 50 డివిజన్లు ఉండగా 26 స్థానాల్లో విజయం సాధించిన పార్టీ అభ్యర్థి మేయర్ సీట్లో కూర్చుంటారు. గత ఎన్నికల్లో పూర్తి మెజారిటీ సాధించని కాంగ్రెస్... ఎంఐఎంకు డెప్యూటీ మేయర్ పదవి ఇచ్చి ఆ పార్టీ మద్దతుతో మేయర్ పదవి దక్కించుకుంది.
 
 ఈసారి కూడా ఆ పార్టీ కీలకంగా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. గెలుపు అవకాశాలున్న స్వతంత్రులు, ఎంఐఎం నేతల వద్దకు అటు కాంగ్రెస్, ఇటు టీఆర్‌ఎస్ మేయర్ అభ్యర్థులుగా ప్రచారంలో ఉన్నవారు చక్కర్లు కొడుతున్నారు. నగరంలో 10 స్థానాలకుపైగా ఇండిపెండెంట్లు గెలుస్తారనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే మేయర్ ఎన్నికలో వారిదే హవా. కాంగ్రెస్ నుంచి మున్సిపల్ మాజీ చైర్మన్ వావిలాల హన్మంతరెడ్డి, పీసీసీ కార్యదర్శి వై.సునీల్‌రావు పేర్లు మేయర్ అభ్యర్థులుగా ప్రచారంలో ఉన్నాయి. అధిష్టానం వద్ద వీరు ఇప్పటికే  ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
 
 ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల మద్దతు తీసుకునేందుకు సైతం వీరు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు ఎంపీ పొన్నం ప్రభాకర్ తన అనుచరుల్లో ఒకరికి మేయర్ పదవి ఇప్పించుకోవాలని చూస్తున్నారు. ఇటీవలే డీసీసీ బాధ్యతలు చేపట్టిన మృత్యుంజయం అనుచరుల్లో ఒకరు అనూహ్యంగా తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.  టీఆర్‌ఎస్ నుంచి రవీందర్‌సింగ్ ఒక్కరే మేయర్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్నా.. తెరవెనుక మరో ఇద్దరు నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు ప్రధాన అనుచరులుగా ఉంటున్న ఆ ఇద్దరు నేతలు.. తమ పేరు బయటకు రాకుండా అధిష్టానం వద్ద పదవి కోసం ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం.
 - న్యూస్‌లైన్, కరీంనగర్‌కార్పొరేషన్
 
  వేములవాడ
 వేములవాడ నగరపంచాయతీ చైర్‌పర్సన్ పదవి బీసీ మహిళకు కేటాయించారు. పీఠం దక్కించుకునేందుకు ఏడుగురు అభ్యర్థులు ఎత్తుగడలు వేస్తున్నారు. టీఆర్‌ఎస్ నుంచి కొండ పావని, కోయినేని పద్మ, కాంగ్రెస్ నుంచి  నరాల సౌజన్య, నామాల వరలక్ష్మి చైర్‌పర్సన్ బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి  ద్వారక శ్రీదేవి, రాపెల్లి లావణ్య, ముప్పిడి భాగ్యశ్రీ పోటీపడుతున్నారు. చైర్‌పర్సన్‌గిరీపై మొదటినుంచి కన్నేసిన బీజేపీ ప్రస్తుతం ఆది శ్రీనివాస్ చేరికతో మరింత బలం పుంజుకుంది. నగర పంచాయతీ ఎన్నికల నాటికి ఏ పార్టీలోనూ లేని ఆది శ్రీనివాస్ తన అనుచరులను ఇండిపెండెంట్లుగా బరిలో నిలిపారు. వీరు కనీసం రెండు స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయి. వీరి మద్దతు బీజేపీకి లభించే అవకాశం ఉండడంతో అధికారపీఠం తమదేననే ధీమాలో ఆ పార్టీ నాయకులు ఉన్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు సైతం మెజారిటీ స్థానాలు దక్కించుకుంటామనే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కాం గ్రెస్ తరఫున ఏనుగు మనోహర్‌రెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు కట్కూరి శ్రీనివాస్ వ్యూహాలు రచిస్తున్నారు. టీఆర్‌ఎస్ నాయకులు తాము ముందుగానే నిర్దేశించుకున్న అభ్యర్థికి పట్టం కట్టేందుకు మంతనాలు సాగిస్తున్నారు. క్యాంపు రాజకీయాలను నెరపగలిగే సత్తా ఉన్న కనీసం ఇద్దరు అభ్యర్థులను పార్టీలు ఎంచుకుంటున్నా యి. అభ్యర్థులు సైతం ఎవరికి మద్దతు ఇస్తే ఎంత గిట్టుబాటు అవుతుందనే ఆలోచనల్లో మునిగితేలుతున్నారు.
 - న్యూస్‌లైన్, వేములవాడ
 
 
  రామగుండం
 రామగుండం కార్పొరేషన్‌లో 50డివిజన్లు ఉండగా మేయర్ పదవిని ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ చేశారు. కాంగ్రెస్ నుంచి మున్సిపల్ మాజీ చైర్మన్ బడికెల రాజలింగం, టీఆర్‌ఎస్ నుంచి అనిల్‌కుమార్ మేయర్ అభ్యర్థులుగా మొదట ప్రచారం జరిగింది. 15వ డివిజన్ అభ్యర్థి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మహాంకాళిస్వామి సైతం మేయర్ బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి 23వ డివిజన్ అభ్యర్థి, ఆ పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్ మేయర్ బరిలో ఉన్నారు. వీరంతా ఆయా డివిజన్లలో గెలిచే అభ్యర్థులను కలుస్తూ మద్దతు పొందేందుకు యత్నిస్తున్నారు. ఓ మేయర్ అభ్యర్థి తనను గెలిపించిన వారికి ఒక ప్లాట్‌ను నజరానాగా ఇస్తానని ఆఫర్ ప్రకటించినట్లు తెలిసింది. పార్టీకి మెజారిటీ రాకుంటే స్వతంత్రుల మద్దతు కూడగట్టుకునేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. రామగుండం విచిత్ర పరిస్థితి ఉంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల టికెట్ దక్కక రెబల్ అభ్యర్థులుగా కొందరు బరిలో నిలిచారు. అంతకుముందే మున్సిపల్ ఎన్నికలు కావడంతో రెబల్ అభ్యర్థుల అనుచరులు పార్టీ టికెట్లపై పోటీ చేశారు. వీరు గెలిస్తే ఆయా పార్టీలకు మద్దతు ఇస్తారా? లేక  వేరే వారికి మద్దతు ప్రకటిస్తారా? అనే ఉత్కంఠ ఏర్పడింది. ఫలితాలు ప్రకటించగానే కౌంటింగ్ కేంద్రం నుంచి కార్పొరేటర్లను తరలించేందుకు ఆయా పార్టీల అధినాయకులు వ్యూహరచన రూపొందించారు.
 - న్యూస్‌లైన్, గోదావరిఖని
 
  పెద్దపల్లి
 పెద్దపల్లి నగర పంచాయతీలో 20 వార్డులు ఉండగా, మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని బీసీ జనరల్‌కు కేటాయించారు. టీఆర్‌ఎస్‌లో ముగ్గురు, కాంగ్రెస్‌లో ముగ్గురు, టీడీపీలో ఒకరు, బీజేపీలో ఒకరు చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. టీడీపీ నుంచి చైర్మన్‌గిరీ ఆశిస్తున్న ఉప్పు రాజు మినహా మిగిలిన ఏడుగురిలో గెలుపుపై అనుమానాలున్నాయి. బీజేపీ రెండు, టీడీపీ రెండు స్థానాలు గెలుస్తామనే నమ్మకంతో ఉన్నాయి.
 
 ఇండిపెండెంట్లను కలుపుకుని చైర్మన్ కుర్చీ ఎక్కాలని తహతహలాడుతున్నారు. పట్టణంలో ముగ్గురు ఇండిపెండెంట్లు గెలిచే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. దీంతో చైర్మన్ ఎన్నికలో వారే కీలకంగా మారబోతున్నారు. నాలుగు స్థానాల్లో పోటీపడ్డ ఎంఐఎం నుంచి ఒకరు గెలిచే పరిస్థితి ఉండడంతో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల అంచనాలు తల్లకిందులయ్యే అవకాశాలున్నాయి. గెలుపు ధీమాతో ఉన్న అభ్యర్థులను తమ శిబిరానికి రప్పించుకోవడానికి చైర్మన్ అభ్యర్థులు పావులు కదుపుతున్నారు. ఎమ్మెల్సీ భానుప్రసాదరావు తీసుకునే నిర్ణయం చైర్మన్ ఎంపికను మలుపుతిప్పే అవకాశాలున్నాయి. టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి మనోహర్‌రెడ్డి ఎలాగైనా తమ పార్టీకే చైర్మన్ పదవి దక్కాలని వ్యూహాలు రూపొందిస్తున్నారు.
 - న్యూస్‌లైన్, పెద్దపల్లి
 
  జగిత్యాల
 జగిత్యాల మున్సిపాలిటీలో 38వార్డులుండగా, చైర్‌పర్సన్ పదవి జనరల్ మహిళకు కేటాయించారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ  బలంగా ఉండడంతో పోటీ తీవ్రంగా ఉంది. కాంగ్రెస్ నుంచి 4వ వార్డు అభ్యర్థి తాటిపర్తి విజయలక్ష్మిని చైర్‌పర్సన్ అభ్యర్థిగా నిర్ణయించారు. టీఆర్‌ఎస్ నుంచి తాటిపర్తి సరళాదేవి, టీడీపీ నుంచి గంటి ఇందిర చైర్‌పర్సన్ అభ్యర్థులుగా ఎన్నికల సమయంలో ప్రచారం జరిగింది. జగిత్యాల మున్సిపల్ అధికారపీఠాన్ని దశాబ్దకాలంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటూ వస్తోంది. ఈసారి సైతం ఎలాగైనా తమ జెండా ఎగురవేయాలనే పట్టుదలతో నాయకత్వం పనిచేసింది. బీజేపీ, టీడీపీ కలిసి పనిచేశారు. టీఆర్‌ఎస్ కొన్ని స్థానాల్లోనే తన అభ్యర్థులను బరిలో దించింది. అయితే బలమైన అభ్యర్థులనే ఉంచామని, చైర్‌పర్సన్ స్థానం తమదేననే ధీమాలో వారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని, విజయలక్ష్మి చైర్‌పర్సన్ అవుతారని స్థానికులు చర్చించుకుంటున్నారు.    
 - న్యూస్‌లైన్, జగిత్యాల
 
  కోరుట్ల
 కోరుట్ల అసెంబ్లీ కాంగ్రెస్ టికెట్ కొమొరెడ్డి రామ్‌లుకు రావడంతో ఇన్నాళూ మున్సిపల్ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్న  ఆ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు డైలామాలో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా.. తనకు అనుకూలంగా ఉన్నవారికి మున్సిపల్ పదవులు అప్పగించేందుకు కొమొరెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలువురికి పదవులు ఆశ చూపి జువ్వాడి నర్సింగరావు వర్గం నుంచి పలువురిని తన వర్గంలోకి లాక్కున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌కు మెజారిటీ వస్తే ఎవరు చైర్మన్ అవుతారనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. మున్సిపల్‌లో మొత్తం 31 వార్డులున్నాయి.
 
 చైర్మన్ పదవి జనరల్ మహిళకు కేటాయించారు.  కాంగ్రెస్ నుంచి పదవి ఆశిస్తున్న గండ్ర రాజు, యాటం చిట్టి... అసెంబ్లీ ఎన్నికల్లో జువ్వాడికి అనుకూలంగా పనిచేయడంతో పార్టీ మద్దతు ఏ మేరకు ఉంటుందనే డైలామా ఏర్పడింది. గెలిచే అవకాశమున్న జువ్వాడి వర్గీయుల మద్దతు ఎవరికి ఉంటుందనేది కీలకంగా మారనుంది. ఇటీవల టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరి పోటీ చేసిన అన్నం అనిల్ పేరు టీఆర్‌ఎస్ తరఫున ప్రధానంగా వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈయన ఎమ్మెల్యే కల్వకుంట్లకు ముఖ్య అనుచరునిగా వ్యవహరించడం గమనార్హం. కొన్ని స్థానాల్లోనే పోటీచేసిన బీజేపీ, ఎంఐఎంలు చైర్మన్ ఎన్నికల్లో కీలకమయ్యే అవకాశముంది. ఇండిపెండెంట్లు సైతం ఎవరికి అనుకూలంగా వ్యవహరిస్తారనే అంశం చర్చనీ యామైంది.                       - న్యూస్‌లైన్, కోరుట్ల
 
  హుజూరాబాద్
 నగర పంచాయతీ హోదాతో మొదటిసారి ఎన్నికలు జరిగిన హుజూరాబాద్ చైర్మన్ పదవి బీసీ జనరల్‌కు కేటాయించారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు మెజారిటీ స్థానాలు తమకే వస్తాయని ధీమాలో ఉన్నాయి. అవసరమైతే ఇతర పార్టీలు, స్వతంత్రుల మద్దతు తీసుకుని చైర్మన్ పీఠం ఎక్కాలని వ్యూహాలు రూపొందిస్తున్నాయి. చైర్మన్ పదవి ఆశించిన నేతలకు వార్డుల రిజర్వేషన్ అనుకూలించకపోవడంతో తమ సతీమణులను రంగంలోకి దింపి తాము కూడా రేసులో ఉన్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి ప్రతాప తిరుమల్‌రెడ్డి, కొయ్యడ కమలాకర్‌గౌడ్, వడ్లూరి బ్రహ్మచారి, తోట రాజేంద్రప్రసాద్, కాజిపేట శ్రీనివాస్ చైర్మన్‌గిరీ కోసం పోటీపడుతున్నారు. టీఆర్‌ఎస్ తరఫున బండ స్వర్ణ, తాళ్లపల్లి అరుణ, తాళ్లపల్లి రజితను రంగంలోకి దింపి జనరల్ స్థానంలో మహిళ చైర్‌పర్సన్ అయ్యేలా కీలక ప్రయోగం చేస్తున్నారు. అపరాజ ముత్యంరాజు, కొలిపాక శ్రీనివాస్, చింత శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి. టీడీపీ నుంచి  గుర్రం వెంకటేశ్వర్లు ప్రయత్నాలు చేస్తున్నారు.
 
 పట్టణంలో 20 వార్డుల్లో 13 చోట్ల టీడీపీ బరిలో ఉండగా స్వతంత్రుల మద్దతుతో జెండా ఎగురవేయాలని పావులు కదుపుతున్నారు. టీఆర్‌ఎస్ నాయకులు అప్పుడే గెలుపుధీమాలో ఉన్న స్వతంత్రులకు గాలం వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ నేత ఈటెల రాజేందర్ విజయం సాధించి, మంత్రి పదవిలో ఉంటారని, అప్పుడు పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయొచ్చంటూ స్వతంత్రులను ఆకర్షిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తూ స్వతంత్రులతో మంతనాలు సాగిస్తున్నారు.              
  - న్యూస్‌లైన్, హుజూరాబాద్
 
  సిరిసిల్ల
 సిరిసిల్లలో 33 వార్డులుండగా చైర్‌పర్సన్ స్థానాన్ని బీసీ మహిళకు కేటాయించారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్  మధ్య  ప్రధాన పోటీ నెలకొంది. ఆయా పార్టీల్లో చైర్‌పర్సన్ పీఠాన్ని ఆశిస్తున్న వారి జాబితా సైతం బాగానే ఉంది. టీఆర్‌ఎస్ నుంచి జిందం కళ, దార్నం అరుణ, గడ్డం చందన, కుల్ల నిర్మల, బూట్ల రుక్కుంబాయి చైర్‌పర్సన్ సీటు ఆశిస్తున్నారు.
 
 కాంగ్రెస్ నుంచి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గుడ్ల మంజుల, ఆడెపు చంద్రకళ, కొండ అనూష, రాపెల్లి లక్ష్మి, పిస్క సుప్రజ చైర్‌పర్సన్ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఇండిపెండెంట్లుగా బరిలో నిలిచిన ముగ్గురు అభ్యర్థులు విజయం సాధించి చైర్‌పర్సన్ ఎంపికలో కీలకమవుతారనే ప్రచారం ఉంది. ఎవరివైపు మొగ్గు ఎక్కువగా ఉంటే అటువైపు దూకి గిట్టుబాటు చేసుకోవాలనే ఆలోచనలు చేస్తున్నారు. బల్దియా పీఠమెక్కేందుకు రెండు పార్టీలు తెరచాటు వ్యూహాలతో ముందుకుసాగుతున్నాయి. - న్యూస్‌లైన్,సిరిసిల్ల
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement