రాజకీయ బీమా ఏజెంట్లు! | Political insurance agents! | Sakshi
Sakshi News home page

రాజకీయ బీమా ఏజెంట్లు!

Published Mon, Feb 9 2015 2:42 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM

Political insurance agents!

ఎన్నికల్లో రకరకాల హామీలు, తాయిలాల ఎర చూపి ఓట్లు అభ్యర్థించిన రాజకీయ పార్టీలు ఇప్పుడు సభ్యత్వ నమోదుకోసం కొత్తఅవతారమెత్తాయి. సభ్యత్వాలు పెంచుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ వినూత్నంగా ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని ఆఫర్ చేస్తున్నాయి. ఆయా పార్టీల నాయకులు బీమా ఏజెంట్ల అవతారమెత్తారు. ‘మా పార్టీ సభ్యత్వం తీసుకుంటే లక్షల రూపాయల ప్రమాద బీమా సదుపాయం’ అంటూ ఆఫర్లు గుప్పిస్తున్నారు. టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీ బీమా సౌకర్యం ప్రకటించగా, కాంగ్రెస్ కూడా అదే బాటలో పయనించబోతోంది.
 - సాక్షి ప్రతినిధి, కరీంనగర్
 
 ప్రధాన పార్టీలన్నీ సభ్యత్వ నమోదులో తలమునకలయ్యాయి. అధిక సభ్యత్వాలు చేయించడమే లక్ష్యంగా బీమా పేరిట వివిధ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అధికార టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వానికి రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తింపజేస్తామని చెబుతుండగా, బీజేపీ లక్ష బీమా సౌకర్యం ప్రకటించింది. టీడీపీ విషయానికొస్తే... సభ్యత్వం తీసుకుంటే రూ.2 లక్షల బీమాతోపాటు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యానికయ్యే ఖర్చులో 50 శాతం వరకు రాయితీలిస్తామని ఆశ చూపుతోంది. కాంగ్రెస్ నేతలు మాత్రం తాము ఇన్సూరెన్స్ సంస్థలతో చర్చలు జరుపుతున్నామని, త్వరలోనే బీమా, ఇతర సౌకర్యాల అంశాలను వివరిస్తామని చెబుతున్నారు.
 
 గులాబీ జోష్
 అన్ని పార్టీలతో పోలిస్తే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆలస్యంగా ప్రారంభించిన అధికార టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదులో ముందు భాగాన నిలుస్తోంది. జిల్లాలో 4 లక్షల సభ్యత్వాలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుని, ఈ నెల 5న సభ్యత్వ నమోదు ప్రారంభించారు. ఈ నెల 20 వరకు గడువు ఉండగా నాలుగు రోజుల్లోనే లక్ష మందికి సభ్యత్వం కల్పించినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఒక్కో నియోజకవర్గంలో 25 వేల మందికి సాధారణ, 5 వేల మందికి క్రియాశీల సభ్యత్వం ఇవ్వాలని పార్టీ నుంచి ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో విస్త్రతంగా పర్యటిస్తూ సభ్యత్వ నమోదులో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ సైతం తన నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. జగిత్యాల, పెద్దపల్లి మినహా మిగిలిన నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు సైతం జోరుగా పాల్గొంటున్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి రెండ్రోజులుగా నియోజకవర్గ ప్రజాప్రతినిధులను వెంటేసుకుని ‘నర్సరీ’కి సంబంధించిన అంశాలపై అధ్యయనం చేసే పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. ఆయన ప్రత్యర్థులు మాత్రం మనోహర్‌రెడ్డి తీరును తప్పుపడుతున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సభ్యత్వ నమోదునుప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చెబుతుంటే మొక్కల పెంపకం పేరుతో ఆంధ్రాకు వెళ్లడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. జగిత్యాల నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు ప్రారంభమే కాలేదు. సోమవారం ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.
 
  పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ సంజయ్‌కుమార్ ఆసక్తి చూపకపోవడం వల్లే ఇప్పటివరకు నమోదు ప్రారంభం కాలేదని ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాలు మినహా మిగతా చోట్ల యమ స్పీడుగా సభ్యత్వ నమోదు సాగుతోంది. అధికార పార్టీ కావడం, నామినేటెడ్ పదవులు ఊరిస్తుండడంతో నాయకులు, కార్యకర్తలు చురుగ్గా పాల్గొంటున్నారు. దీనికితోడు టీఆర్‌ఎస్‌లో సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ రూ.2 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తుండటం అధికార పార్టీకి కలిసొస్తోంది.
 సా...గుతున్న ప్రతిపక్షాల సభ్యత్వంసాధారణ ఎన్నికల్లో ఓటమి నుంచి తేరుకుని సభ్యత్వ నమోదుతో పూర్వవైభవాన్ని సంతరించుకునేందుకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.
 
 అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షానికే పరిమితమైన కాంగ్రెస్ సభ్యత్వ నమోదుతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. జిల్లాలో 2 లక్షల మందికి సభ్యత్వం ఇవ్వాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుని నెల రోజుల క్రితం ప్రక్రియ ప్రారంభించారు. ఆశించిన స్థాయిలో సభ్యత్వం కాకపోవడం, ప్రజల నుంచి పెద్దగా స్పందన రాకపోవడంతో కాంగ్రెస్ పెద్దలు ఆలోచనలో పడ్డారు. అందులో భాగంగా ఏఐసీసీ కార్యదర్శి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య జిల్లాకు విచ్చేసి సభ్యత్వ నమోదుపై ప్రత్యేకంగా సమీక్షించారు.
 
  పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమైనందున, ఫిబ్రవరి 28లోపు 2 లక్షల మందిని సభ్యులుగా చేర్పించాలని నిర్దేశిస్తూ సభ్యత్వ పుస్తకాలను పంపిణీ చేశారు. మండలాల వారీగా ఇన్‌చార్జీలను నియమించారు. దీంతోపాటు ఆన్‌లైన్‌లో పార్టీ సభ్యత్వం తీసుకునేందుకూ అవకాశం కల్పించారు. అధిష్టానం నిర్దేశించిన గడువుకు ఇంకా 20 రోజులే ఉన్నప్పటికీ నేటికీ సగం లక్ష్యం కూడా నెరవేరలేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితి కాంగ్రెస్ నేతలది. ప్రభుత్వ నిర్ణయాలపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రజలను ఆకర్షించి సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చే యాలని భావించిన ఆయా నేతలు ఇప్పుడు అదే పనిలో నిమిగ్నమయ్యారు.
 
 కమల విలాపం: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ ఈసారి జిల్లాలో గట్టి పట్టు సాధించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ చరిష్మాతో ఈసారి జిల్లాలో 3 ల క్షల మందికి సభ్యత్వం అందజేయాలనే లక్ష్యంతో నవంబర్ 23న ఈ ప్రక్రియ ప్రారంభించారు. కాంగ్రెస్ మాదిరిగానే ఆన్‌లైన్ సభ్యత్వాన్ని కల్పిస్తున్నా, రూ.లక్ష ప్రమాద బీమా సౌకర్యాన్ని వర్తింపజేస్తున్నా నిర్దేశించుకున్న లక్ష్యంలో సగానికి కూడా చేరువ కాలేదని తెలుస్తోంది. పార్టీ వర్గాలు మాత్రం ఇప్పటివరకు 1.6 లక్షల మందికి సభ్యత్వం కల్పించామని చెబుతున్నాయి.
 
 టీడీపీలో ‘సభ్యత్వ’ నైరాశ్యం
 జిల్లాలో ఒకనాడు వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం మనుగడ కోసం చెమటోడ్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్న తెలుగు తమ్ముళ్లు నవంబర్ మొదటివారంలో సభ్యత్వ నమోదును ప్రారంభించారు. జిల్లాలో 2 ల క్షల మందికి సభ్యత్వం అందజేసేలా ప్రణాళికలు రూపొందించారు. మిగతా పార్టీలతో పోలిస్తే అనేక ఆఫర్లు కూడా ప్రకటించారు. ‘టీడీపీ సభ్యత్వం తీసుకుంటే రూ.2 లక్షల ప్రమాద బీమాను వర్తింపజేస్తాం.
 
  సభ్యత్వం తీసుకున్న వారితోపాటు కుటుంబసభ్యులకూ కార్పొరేట్ ఆసుపత్రుల్లో 50 శాతం వరకు రాయితీ వర్తించేలా చూస్తాం. కేశినేని ట్రావెల్స్‌లో ప్రయాణించే వారికి చార్జీల్లో రాయితీ కల్పిస్తాం’ అని ఆఫర్లు గుప్పించారు. అయినప్పటికీ ఆశించినస్థాయిలో స్పందన రాకపోవడంతో తెలుగు తమ్ముళ్లు డీలా పడ్డారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం జిల్లాలో 40 వేల మందికి మాత్రమే సభ్యత్వాన్ని అందించగలిగారు. ఇందులోనూ పెద్దపల్లి, కోరుట్ల నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు వేలల్లో ఉండగా, మిగతా నియోజకవర్గాల్లో వందలకే పరిమితం కావడం గమనార్హం. వేములవాడలో 152, సిరిసిల్లలో 567, హుస్నాబాద్‌లో 950 మందికి మాత్రమే సభ్యత్వం తీసుకోవడం గమనార్హం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement