అక్షరం.. ఆమడదూరం
సాక్షి, మహబూబ్‌నగర్: కేజీ నుంచి పీజీ వరకు ఉచితవిద్యను అందిస్తామని చెబుతున్న ప్రభుత్వాలు ఆచరణంలో మాత్రం విఫలమవుతున్నాయి. విద్యాభివృద్ధికి జిల్లాలో ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ఆశించిన అక్షరాస్యత మాత్రం పెరగడం లేదు. గత రెండేళ్లలో జిల్లాలో బడిమానేసిన పిల్లల సంఖ్యను చూస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. డ్రాపౌట్స్‌లో మహబూబ్‌నగర్ జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో ఉండగా, జిల్లాలో గట్టు మండలం మొదటిస్థానం దక్కించుకున్నట్లు విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో ఒకటి నుంచి పదో తరగతి చదివే విద్యార్థుల సంఖ్యే ఎక్కువగా ఉంది.
కారణం ఏదైనా ఏటా జిల్లాలో దాదాపు 53.21శాతం మంది విద్యార్థులు మధ్యలోనే బడి మానేస్తున్నారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందిన విద్యార్థులే ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఇటీవల రాష్ట్రవిద్యాశాఖ నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాలమూరు గణాంకాలు వెలుగుచూశాయి. జిల్లాలో డ్రాపౌట్స్ సంఖ్యచూసి రాష్ట్రప్రభుత్వం చూసి నివ్వెరపోయింది. 2011-12 విద్యాసంవత్సరంలో 12,126 మంది బడి మానేసిన వారుంటే అందులో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులే ఉన్నారు. ఎస్సీలు 2,455 మంది విద్యార్థులు ఉండగా ఎస్టీలు 2,068 మంది ఉన్నారు. ఇక 2012-13 విద్యాసంవత్సరంలో కూడా ఇవే ఫలితాలు ఎదురయ్యాయి. బడిమానేసిన వారిలో 2,059మంది ఎస్సీ విద్యార్థులు ఉండగా, ఎస్టీలు 1,605 మంది ఉన్నారు.
కదిలిన యంత్రాంగం
బడుగు, బలహీనవర్గాల పిల్లలే చదువుకు దూరం కావడం పట్ల ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు, విద్యాశాఖ దిద్దుబాటుకు ఉపక్రమించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడంతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ‘బడిపండుగ’ వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. పిల్లలను స్కూళ్లకు పంపితే మధ్యాహ్న భోజనంతో పాటు దుస్తులు కూడా ఉచితంగా అందజేస్తామని ప్రచారం చేపట్టింది. ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రుల్లో మార్పు వస్తేనే ఫలితం ఉంటుదనే ఆలోచనతో జిల్లా విద్యాశాఖ ఆదిశగా కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం గ్రామాల్లోని యువత, డ్వాక్రా సంఘాలు, అంగన్‌వాడీల ద్వారా ప్రచారాన్ని చేపట్టింది. తద్వారా ఈ ఏడాది ఇప్పటి దాకా 4,372 మంది బడిమానేసిన పిల్లలను తిరిగి చేర్పించగలిగారు. అయితే బడిలో చేరిన వారి కంటే ఇంకా బడిబయట ఉన్న వారి సంఖ్య 5,019 మంది ఉండటం గమనార్హం.
గట్టు.. ఫస్ట్
గట్టు మండలంలో రాష్ట్రంలోనే అతితక్కువ అక్షరాస్యత శాతం 30 మాత్రమే నమోదైంది. ఇప్పటికీ 800 విద్యార్థులు బడిబయటే ఉన్నారు. వలసలు ప్రధానంగా ఉండే ఈ మండలంలో ఎక్కువమంది తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపడం లేదు. రాయిపురం, పెంచికలపాడు తదితర గ్రామాల్లో బాలికల అక్షరాస్యత శాతం జీరోగా ఉంది. 15 ఏళ్లలోపే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. అలాగే కర్ణాటక సరిహద్దులో ఉన్న నందిన్నె, చింతలకుంట గ్రామాల్లో డ్రాపౌట్స్ ఎక్కువగా ఉన్నారు. వయోజనుల్లో అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు అమలుచేసిన గట్టు విద్యాజ్యోతి కార్యక్రమం మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది. బడిబాట కార్యక్రమం కూడా సత్ఫలితాలను ఇవ్వలేకపోతోంది.