వికారాబాద్: కంచే చేను మేసింది. ప్రభుత్వ అధికారులే పక్కదారి పట్టారు. అక్రమ మైనింగ్‌కు అనుమతులిచ్చారు. రూ.5 కోట్ల ప్రభుత్వాదాయానికి గండి కొట్టారు. తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత చందాన గనులను కొల్లగొట్టారు. ఈ అక్రమ వ్యవహారం ఐదేళ్లుగా కొనసాగుతున్నా పట్టించుకునేవారే లేకుండాపోయారు. దీనికంతటికీ ప్రధాన సూత్రధారిగా మైనింగ్ ఏడీపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివరాలు.. జిల్లా పరిధిలోని పెద్దేముల్, మోమిన్‌పేట్, ధారూరు మండలాల్లో ఎక్కువగా సుద్ద గనుల తవ్వకాలు జరుగుతుంటాయి. వీటికి సంబంధించిన అన్ని ధ్రువపత్రాలను తనిఖీ చేసే ఏడీ కార్యాలయం తాండూరులో ఉంది. సుద్ద మైనింగ్ ప్రాంతాలు మారేపల్లి, గోపాల్‌పూర్, తింసాన్‌పల్లి, ఇందోల్, అల్లీపూర్, అవుసుపల్లి, జైద్‌పల్లి, తరిగోపుల, నాగ్‌సాన్‌పల్లిలలో ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి.
గత 5 ఏళ్లుగా.. సంవత్సరానికి 2 లక్షల టన్నుల చొప్పున ఆయా గ్రామాలను నుంచి సుద్దను కాకినాడ పోర్టుకు రవాణా చేస్తున్నారు. అక్కడి నుంచి వ్యాపారులు ఓడల ద్వారా మలేషియాకు తరలిస్తున్నారు. కాగా.. సుద్ద మైనింగ్‌లో సక్రమం సగం ఉండగా.. అక్రమం సగం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. యేటా జనవరి నుంచి మొదలుకొని మే నెలాఖరువరకు సుద్ద ఉన్న ప్రాంతాల్లో లీజ్‌కు తీసుకున్న వ్యాపారులు తవ్వకాలు జరిపి కుప్పలు పోసి నిల్వ చేస్తారు. కాగా.. ఇక్కడే అసలు సంగతి ఉంది. అనుమతి పొందింది అర ఎకరం అయితే అక్రమ మైనింగ్ చేస్తున్నది ఆరు ఎకరాల వరకు ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతి పొందింది కొంత కాగా అక్రమ తవ్వకాలు చేస్తోంది మాత్రం ఎక్కువగా ఉంది.
సాక్ష్యం ఇదిగో..
ధారూరు మండలం తరిగోపులలోని సర్వేనంబర్ 389లో అర ఎకరం లీజ్ తీసుకొని ఆరు ఎకరాల వరకు తవ్వకాలు జరిపారు. ఇందులో మైనింగ్ ఏడీ జయరాజ్ అర ఎకరానికి అనుమతినిచ్చి ఆరు ఎకరాల వరకు తవ్వకాలకు సరిపడా రాయల్టీని మంజూరు చేశారు. అర ఎకరం భూమిలో 10 ఫీట్ల వరకు సుద్ద ఉంది. 6 వేల టన్నుల వరకు ఉత్పత్తి అవుతోంది. కానీ ఆ భూమిలో 4 ఫీట్లు లేని సుద్దకు సుమారు 20 వేల టన్నుల రాయల్టీలు ఇచ్చారు. జయరాజ్ అండదండలతోనే అక్రమ మైనింగ్ తవ్వకాలు జరుగుతున్నాయనే విషయం స్పష్టమవుతోంది. మరో ఆసక్తికర విషయమేంటంటే.. ఆరేళ్లుగా ఆయన బదిలీ కాకుండా పెద్దల అండదండలతో తాండూరులోనే తిష్టవేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తవ్వకం ఓ ఊరిలో.. రాయల్టీ మరో గ్రామంలో..
జైద్‌పల్లి సమీపంలోని సుద్ద స్టాక్ పాయింట్‌ను పరిశీలించగా.. అదే గ్రామానికి చెందిన ఓ భూమిలో అక్రమ మైనింగ్ చేసిన సుద్దను తరిగోపుల భూములకు సంబంధించిన రాయల్టీపై స్టాక్‌పాయింట్‌కు తరలించి నిల్వ చేశారు. దీంతో సుద్ద మైనింగ్‌లో ఎన్ని అక్రమాలు చోటుచేసుకున్నాయో అవగతమవుతోంది. ఈ వ్యవహారంలో మైనింగ్ అధికారికి లక్షలాది రూపాయలు ముడుపులు ముట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. స్టాక్‌పాయింట్‌లో ప్రస్తుతం అక్రమ నిల్వలు సుమారు 25 వేల టన్నులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సుద్ద తవ్వకాలకు సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు తీసుకోలేదని సమాచారం. ఏడీ జయరాజ్ వివరణ కోరేందుకు ప్రయత్నించగా స్పందించేందుకు ఆయన అందుబాటులోకి రాలేదు.
సుద్ద గనుల్లో తహసీల్దార్ ఆకస్మిక తనిఖీలు
ధారూరు: మండలంలోని జైదుపల్లి సమీపంలోని సుద్ద గనుల నిల్వలను శుక్రవారం తహసీల్దార్ విజయ, ఇన్‌చార్జి ఆర్‌ఐ ఓం కుమార్, వీఆర్వో ఆకస్మిక తనిఖీలు చేశారు. పొలాల నుంచి సేకరించిన సుద్దను రాయితీ చెల్లించకుండా రాత్రి వేళల్లో అక్రమంగా తరలిస్తున్నారనే ఫిర్యాదుపై తనిఖీలు చేసినట్లు తహసీల్దార్ తెలిపారు. తనిఖీ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో అధికారులు వెనుదిరిగివచ్చారు.
ఉల్లం‘ఘనులు’
Published Fri, May 29 2015 11:53 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement