మాట్లాడుతున్న కలెక్టర్ సయ్యద్ ఒమర్ జలీల్
సాక్షి, వికారాబాద్: జిల్లాలో మైనింగ్ కాలుష్య ప్రభావిత ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు ప్రణాళికలు సిద్ధంచేసి అంచనాలు సమర్పించాలని కలెక్టర్ సయ్యద్ ఒమర్‌జలీల్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి అనే అంశంపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మైనింగ్ ద్వారా కాలుష్యానికి గురవుతున్న జిల్లాలోని పలు ప్రాంతాల్లో విరివిగా మొక్కలు నాటడానికి అవసరమైన నర్సరీల ఏర్పాటుకు అంచనాలు సిద్ధం చేయాలని జిల్లా అటవీశాఖ అధికారి శ్రీలక్ష్మిని ఆదేశించారు. మొక్కలను పెంచడం ద్వారా కాలుష్యాన్ని చాలా వరకు తగ్గించచ్చని పేర్కొన్నారు.
మైనింగ్ నిర్వహిస్తున్న గ్రామాల్లో భారీ వాహనాల రాకపోకలతో రోడ్లు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. అటువంటి వాటిని గుర్తించి మరమ్మతులు చేసేందుకు ప్రతిపాదనలు పంపించాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలను అందించేందుకు అవసరమైన వైద్య పరికరాల కొనుగోలు, అంబులెన్స్ ఏర్పాటుకు ప్రణాళికలను రూపొందించాలని జిల్లా వైద్యాధికారి దశరథకు సూచించారు. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినీవిద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, అదనపు తరగతి గదులు, తాగునీరు, క్రీడా సదుపాయాలు, ఫర్నిచర్‌తో పాటుగా సైన్స్ ల్యాబ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డీఈఓ రేణుకాదేవిని ఆదేశించారు.
అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులకు వైద్య పరీక్షలు, వృద్ధులు, దివ్యాంగులకు కంటి ఆపరేషన్లు చేసేందుకు వీలుగా ఫర్నిచర్ సమకూర్చడంతో పాటు తాగునీరు, భవనాల కల్పనకు చర్యలు చేపట్టాలఅన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతకు ఉద్యాన, పశువైద్య, వ్యవసాయ రంగాల్లో నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా అవసరమైన అంచనాలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఈ సందర్భంగా కలెక్టర్ సయ్యద్ ఒమర్ జలీల్ ఆదేశించారు. టీఎస్ ఐ పాస్‌పైనా కలెక్టర్ సమీక్షించారు. ఇప్పటివరకు వచ్చిన 242 దరఖాస్తుల్లో 197 దరఖాస్తులకు పూర్తిస్థాయి అనుమతులు పలు శాఖల ద్వారా మంజూరు చేసినట్లు వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో డీఆర్‌డీఓ జాన్సన్, జిల్లా మైనింగ్ ఏడీ శామ్యూల్‌జాకబ్, వికారాబాద్ ఆర్డీఓ విశ్వనాథం, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment