‘షీ’కి చిక్కారు | in Week 40 evtigers on the case | Sakshi
Sakshi News home page

‘షీ’కి చిక్కారు

Published Sat, Nov 1 2014 11:30 PM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

‘షీ’కి చిక్కారు - Sakshi

‘షీ’కి చిక్కారు

* వారంలో 40 మంది ఈవ్‌టీజర్లపై కేసు
* ఈవ్‌టీజర్లపై కఠిన చర్యలు: స్వాతిలక్రా

సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రత కోసం నగర పోలీసులు రంగంలోకి దింపిన ‘షీ’ టీమ్‌లకు వారంలో 40 మంది ఈవ్‌టీజర్లు పట్టుబడినట్లు అదనపు పోలీసు కమిషనర్ (క్రైమ్స్) స్వాతిలక్రా తెలిపారు. తన కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ‘షీ’ టీమ్స్ పనితీరు, ఈవ్‌టీజర్ల వివరాలను వెల్లడించారు. గత నెల 24న  పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి వంద మంది పోలీసులతో‘ షీ టీమ్’లను రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. ఈ టీమ్‌లు ఉద యం, సాయంత్రం వేళ్లల్లో కళాశాలలు, షాపింగ్ సెంటర్లు, రైల్వే, బస్సు స్టేషన్‌ల వద్ద కాపు కాశాయి. 40 మంది ఈవ్‌టీజర్లను అదుపులోకి తీసుకుని పిటి కేసు  నమోదు చేసి వారి కుటుంబీకుల సమక్షంలో సీసీఎస్ పోలీసులు కౌన్సెలింగ్ చేశారు.

నిందితుల్లో ఎక్కువ మంది యువకులు, ఇంటర్ విద్యార్థులు, ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారు. ఈ సమావేశంలో సీసీఎస్ డీసీపీ పాలరాజు, అదనపు డీసీపీ రంజిత్త్రన్‌కుమార్, ఏసీపీ కవిత  ఉన్నారు. ఈ మేరకు ‘షీ టీమ్స్ మీ వెంటే ఉన్నాయి, ఆపదలో ఉంటే వెంటనే 100 నెంబర్‌కు ఫోన్ చేయండి’ అనే వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు. షీ టీమ్‌లు ఈవ్‌టీజర్ల ఆట కట్టించడమే కాకుండా ఫిర్యాదులు చేసే విధంగా మహిళలలో ధైర్యం కల్పిస్తున్నారు. ఈవ్‌టీజింగ్ బారిన పడితే ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చని, బాధితుల పేర్లు, వివరాలు గోప్యంగా ఉంచుతామని నగర పోలీసులు ఎంఎంటీఎస్ రైలు ఎక్కి  మహిళలు, విద్యార్థినులను  కలిసి భరోసా ఇస్తున్నారు.
 
ఈవ్‌టీజర్లతో అవగాహన తరగతులు..
ఈవ్‌టీజింగ్‌ను మరింత కట్టడి చేసేందుకు పట్టుబడిన వారితో ఆయా కళాశాలలో అవగాహన తరగతులు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. తాము ఈవ్ టీజింగ్ చేయడం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు వచ్చాయి, దాని వల్ల పోయిన పరువు, ఎంత నష్టం కలుగుతుందో స్వయంగా వివరించేందుకు నిందితులు అంగీకరించారు.  
 
ఇలా పట్టుబడ్డారు...
20 ఏళ్ల ఓ యువకుడు మెహిదిపట్నం బస్టాప్‌లో నిల్చున్నాడు. అక్కడికి వచ్చే ఏ బస్సు ఎక్కలేదు.ప్రయాణిలకు చూస్తూ ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతూ షీ టీమ్‌కు చిక్కాడు. సికింద్రాబాద్‌లో ఓ యువకుడు బస్సులోకి మహిళలు ఎక్కే ముందు డోర్ నుంచి ఎక్కడం, వారికి తగలడం చేస్తూ షీ టీమ్స్‌కు పట్టుబడ్డాడు. అమీర్‌పేటలో ఓ ప్రైవేట్ ఉద్యోగి(36) బస్టాప్‌లో నిల్చున్న మహిళలపై పట్ల అసభ్యకరంగా చూడడంతో పాటు మాట్లాడుతూ ఈవ్‌టీజింగ్‌కు పాల్పడి చిక్కాడు.సుల్తాన్‌బాజర్‌లో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన ఓ వ్యక్తి ఏకంగా మహిళను లాడ్జికి రమ్మని కోరాడు. ఆమె నిరాకరించడం, ఈ దృశ్యం షీ టీమ్స్ కంట్లో పడడంతో అతగాడి ఆటలకు అడ్డుకట్ట వేశారు.
 
ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే చర్యలు: స్వాతిలక్రా
ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. ‘షీ’ టీమ్స్ నిరంతరం పర్యవేక్షిస్తాయి. మొదటిసారైతే  పిటీ కేసుతో పాటు కౌన్సెలింగ్ చేస్తాం. మరోసారి పట్టుబడితే నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేస్తాం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement