బడ్జెట్ లొసుగుల్ని ఎండగడతాం
- నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి స్పష్టీకరణ
నంద్యాల: ఎన్ని కుట్రలు పన్నినా.. అడ్డంకులు సృష్టించినా ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బడ్జెట్‌లోని లొసుగులను శాసనసభలో ఎండగడతారని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి స్పష్టం చేశారు. నంద్యాలలోని తన నివాసంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రజలకు ఏ మాత్రం అనుకూలంగా లేని బడ్జెట్‌ను రూపొందించిందని ఆయన మండిపడ్డారు. దీనిపై శాసనసభ సమావేశాల్లో వైఎస్సార్‌సీపీ పోరాడుతుందని తెలిపారు.
చంద్రబాబుకు ప్రతిపక్ష నేతగా కూడా పదేళ్ల అనుభవం ఉన్నందువల్ల.. విపక్షానికి గౌరవం ఇచ్చి జగన్ ప్రసంగానికి అడ్డుతగలకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. విపక్షగళం ప్రజలకు వినిపించేలా స్పీకర్ కోడెల శివప్రసాద్ తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అధికార పార్టీ నాయకులు చిన్న ఆరోపణలనే తట్టుకోలేకపోతుంటే.. ఇక బడ్జెట్‌లోని ఘోరాలను ఎలా జీర్ణించుకుంటారనేది సమావేశంలో తేలుతుందన్నారు. ప్రతిపక్ష నేత 4 రోజుల ముందే బడ్జెట్‌పై అధికార పార్టీని కడిగి పారేస్తానని వెల్లడించడంతో ప్రభుత్వానికి వణుకు పుట్టిందన్నారు. దీంతో జగన్ ప్రసంగంపై అందరిలో ఉత్కంఠ నెలకొందన్నారు. సమావేశాలకు తమ పార్టీ ఎమ్మెల్యేలంతా హాజరవుతున్నట్లు చెప్పారు.
శోభానాగిరెడ్డి వర్ధంతి వాయిదా: తెలుగు సంవత్సరం ప్రకారం తన సతీమణి దివంగత శోభా నాగిరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం (16న) నిర్వహించాల్సి ఉందని భూమా నాగిరెడ్డి తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో ‘తెలుగు’ పంచాంగాన్ని అనుసరిస్తుండటంతో ఏప్రిల్ 24వ తేదీన నిర్వహించాల్సిన కార్యక్రమాలను సోమవారం జరుపుకోవాల్సి ఉందన్నారు. అయితే కార్యక్రమం నిర్వహిస్తే తనతో పాటు, కర్నూలు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, అఖిలప్రియ కూడా అసెంబ్లీకి వెళ్లే అవకావం ఉండదని వివరించారు. శోభా నాగిరెడ్డి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరే వారు కాబట్టి కార్యక్రమాన్ని మరో రోజుకు వాయిదా వేసుకొని శాసనసభకు వెళుతున్నట్లు తెలిపారు.