'తెలంగాణలో కారంచేడు, చుండూరు జరగలేదు'
తెలంగాణలో రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు పటేల్, దొర అంటున్నారని.. కానీ తమ తెలంగాణలో కారంచేడు, చుండూరు లాంటి ఘటనలు జరగలేదని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు దీక్షలు చేసే నైతిక హక్కు లేదని ఆయన స్పష్టం చేశారు. ఆ పార్టీ నేతలు చేస్తున్నదంతా కొంగ జపం, దొంగ జపమేనని మండిపడ్డారు. ఎన్టీఆర్ మీద నిజంగా గౌరవం ఉంటే.. చంద్రబాబు తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆయన జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో ఎందుకు పెట్టలేదని హరీశ్రావు ప్రశ్నించారు.
ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీని ఎదుర్కోడానికి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారని ఆయన అన్నారు. తెలంగాణలో టీడీపీ నాయకులు, చంద్రబాబు తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న పురందేశ్వరి అన్నప్పుడు అడ్డుకున్నది చంద్రబాబు కాదా అని ఆయన ప్రశ్నించారు.