► కేంద్రాన్ని ఒప్పించిన రాష్ట్రం
► మూడు నెలలకోసారి నిబంధన నుంచి మినహాయింపు
సాక్షి, హైదరాబాద్: ఉజ్వల్ డిస్కం యోజన (ఉదయ్) అమలు చేసినా.. రాష్ట్రంలో ఏడాదికోసారి మాత్రమే విద్యుత్ చార్జీలు పెంచేందుకు కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించింది. తీవ్ర అప్పుల భారంలో మునిగి ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల ఆర్థిక పునర్వ్యవస్థీకణ కోసం ఉదయ్ పథకంలో తెలంగాణ చేరబోతోంది. ఉదయ్‌లో చేరికకి సంబంధించి కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖతో రాష్ట్ర ఇంధన శాఖ అధికారులు బుధవారం ఢిల్లీలో పరస్పర అంగీకార ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకోనున్నారు. రాష్ట్రం ఈ పథకంలో చేరితే కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు డిస్కంల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రధానంగా ఇంధన సర్దుబాటు చార్జీల రూపంలో ప్రతి మూడు నెలలకోసారి విద్యుత్ చార్జీలను సవరించాలని ఉదయ్ పథకంలోని ఓ నిబంధన పేర్కొంటోంది.
రాష్ట్రంలో మాత్రం ఈ నిబంధనను అమలు చేయలేమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు యథాతథంగా ఏడాదికోసారి విద్యుత్ చార్జీలను పెంచుకునేందుకు కేంద్రం మినహాయింపు ఇచ్చిందని ఇంధన శాఖ వర్గాలు తెలిపాయి. అదేవిధంగా ఉదయ్ పథకానికి సంబంధించిన మరికొన్ని నిబంధనల మార్పు విషయంలో సైతం కేంద్రం మినహాయింపులు ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా ఉదయ్ నిబంధనల మేరకు 2015 సెప్టెంబర్ 30 నాటికి డిస్కంల 75శాతం అప్పులను రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చిలోగా స్వాధీనం చేసుకోనుంది. డిస్కంల అప్పులు రూ.12 వేల కోట్ల వరకు ఉన్నాయి. ఉదయ్‌లో చేరిన అనంతరం మొత్తం అప్పుల్లో రూ.9 వేల కోట్ల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించనుంది. ఈ అప్పులకు గ్యారెంటీగా 20 ఏళ్ల కాలపరిమితి గల బాండ్లను రుణ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయనుంది.