కాళేశ్వరం వంతెన వద్ద పరవళ్లు తొక్కుతున్న గోదావరి , నీటమునిగిన పంటలు
కాళేశ్వరం/ఏటూరునాగారం: మహారాష్ట్రతోపాటు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి మరింత పెరిగింది. ఎగువన ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో శుక్రవారం ఉదయం నుంచి 4 లక్షల క్యూసెక్కుల వరద కాళేశ్వరం మీదుగా తరలిపోతోంది. అటు మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా నుంచి సైతం వరదనీరు వస్తుండడంతో కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 10.6 మీటర్ల ఎత్తులో నీరు ప్రవహిస్తోంది. మొత్తంగా 7 లక్షల క్యూసెక్కుల వరద నీరు తరలిపోయినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. 2016, 2017లో వచ్చిన వరదల కంటే ఈ ఏడాది అధికంగా ప్రవాహం నమోదైందని తెలిపారు.
నీటమునిగిన పంటలు
గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని పంట చేలు నీట మునిగాయి. పలుగుల, మద్దులపల్లి, కాళేశ్వరంలోని పూస్కుపల్లి గ్రామాల్లో వంద లాది ఎకరాల పత్తి పంటను వరద కమ్మేసింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
మొదటి ప్రమాద హెచ్చరిక ఎత్తివేత..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి ప్రవాహం తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు శుక్రవారం ఉపసంహరించారు. గురువారం రాత్రి 9.30 సమయంలో 8.97 మీటర్లకు చేరిన ప్రవాహం శుక్రవారం ఉదయం 9.3 మీటర్లకు వచ్చింది. ఆ తర్వాత సాయంత్రం వరకు క్రమేణ తగ్గుతూ 8.36 మీటర్లకు చేరింది. ఎగువ ప్రాంతాల్లోని వరద నీరు ఇంకా చేరలేదని ఆర్డీవో రమాదేవి, తహసీల్దార్ నరేందర్ తెలిపారు. కాగా, ముల్లకట్ట వద్ద గోదావరి 76 మీటర్ల ఎత్తున రెండు కిలోమీటర్ల వెడల్పుతో ప్రవహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment