అన్నీ అధనమే! | Increasing Of Candidate's Canvass Budjet | Sakshi
Sakshi News home page

అన్నీ అధనమే!

Published Wed, Nov 28 2018 11:08 AM | Last Updated on Wed, Nov 28 2018 11:08 AM

Increasing Of Candidate's Canvass Budjet - Sakshi

సాక్షి, ఖమ్మంరూరల్‌: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ గడువు సమీపిస్తున్న కొద్దీ..ఇటు ప్రచారం ఊపందుకుంటుండగా, బరిలో నిలిచిన అభ్యర్థులకు మాత్రం అదనపు ఖర్చులు పెరుగుతున్నాయి. అవి తడిసి మోపెడవుతున్నాయి. జిల్లాలోని ప్రధాన పార్టీలకు సంబంధించి కొందరు అభ్యర్థుల ఖర్చు అంతకంతకూ పెరుగుతోంది. ఇంకా రెట్టింపయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గెలుపును సవాల్‌గా తీసుకున్న నేతలు వెనుకాడడంలేదు. గెలుపుపై దృష్టి సారించారు. ఇప్పటికే పార్టీల అభ్యర్థులు  తమ అనుచరులు, బయటి వ్యక్తులతో గుటుట్చప్పుడు కాకుండా అవసరమైన నిధులను సమకూర్చుకుంటున్నారు. ఎన్నిడబ్బులు ఖర్చుపెట్టినా ప్రచా రం ఏస్థాయిలో చేశారన్నదానిపైనే గెలుపోటములు ఆధాపడి ఉంటాయని భావించి ఆ స్థాయిలో వెచ్చించేస్తున్నారు. ప్రచారానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నవారు డబ్బుల విషయంలో వెనుకాడట్లేదు. వాల్‌పోస్టర్లు, డోర్‌స్టిక్కర్లు, జెండాలు, టోపీలు, కండువాలు, టీషర్ట్స్, చొక్కాలు ఇతర ప్రచార సామగ్రికి ప్రధాన పార్టీల అభ్యర్థి రూ.5లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. ప్రచారానికి ఆటోలు ఉపయోగిస్తున్నారు. ఒక్కో ఆటో కిరాయి రోజుకు రూ.600. డీజిల్‌ ఖర్చు కూడా అభ్యర్థులే భరిస్తున్నారు. డ్రైవర్‌తో పాటు వాహనంలో అభ్యర్థికి సంబంధించిన వారు ఉంటారు. వీరికి భోజనంతోపాటు సదరు రూ.300నుండి రూ.400 వరకు చెల్లిస్తున్నారు. మైక్‌సెట్‌ అద్దె రోజుకు రూ.800నుంచి1000 వరకు ఉంటోంది. కొందరు నాయకులు ప్రత్యేకంగా పాటలు రూపొందించుకుంటున్నారు. రోడ్‌షోలకు కొందరు నాయకులు కొత్త వాహనాలు కొంటున్నారు. ఈమొత్తం ప్రక్రియకు లక్షలు ఖర్చు చేస్తున్నారు.  

అంతా ప్రచారజపమే..  
ఖమ్మంసహకారనగర్‌: ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో బరిలో ఉన్న వివిధ పార్టీల అభ్యర్థులు దొరికిన వారందరినీ ప్రచారానికి వినియోగించుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, బంధువులు, సన్నిహితులను ప్రధాన వ్యూహకర్తలుగా ఉపయోగిస్తున్నారు. జిల్లా కేంద్రమైన ఖమ్మం నియోజకవర్గంలో రెండు మండలాలే ఉండగా మిగతా నియోజకవర్గాలకు ఒక్కొక్క నియోజకవర్గానికి నాలుగు నుంచి ఐదు మండలాలు ఉన్నాయి. ఇక్కడ తమ ప్రచారాన్ని వాహనాల ద్వారా చేస్తుండగా ఖాళీ సమయాల్లో అభ్యర్థులు, వారి అనుయాయులు గ్రామాల్లోని నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. బరిలో ఉన్న అభ్యర్థులు తొలుత ఆయా ప్రాంతాల వారీగా ముఖ్య నాయకులు, అనుచరులతో ముందస్తుగా సమావేశం అవుతున్నారు. అనంతరం వారిచ్చే సలహాలు సూచనలతో పాటు వారి ఆలోచనల ప్రకారం తేదీని నిర్ణయించి ప్రచార సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వీటిని నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో కూలీలు అధికంగా ఉండడంతో వారిని ఆకట్టుకునేందుకు, కలిసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాము చేసిన, చేయబోయే కార్యక్రమాలను సభల్లో ప్రజలకు వివరిస్తున్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో సైతం అభ్యర్థుల ప్రచార కార్యక్రమాలను తెలియజేయడంతో పాటు వారిని గెలిపించాలని కోరుతూ కొద్దిమంది వాట్సాప్‌ గ్రూప్‌లు ఏర్పాటు చేసి ప్రచారంలో ముందుకెళ్తున్నారు. నేరుగా అభ్యర్థులు కూడా సందేశాలు పంపించే సంస్కృతి ఉంది. ఒక అభ్యర్థి పోస్టర్‌ ఎక్కడ వేస్తే మరో అభ్యర్థి పోస్టర్లు, అక్కడ, ఆ సమీపంలో వేస్తూ ప్రచారంలో ఒకరికి ఒకరు సై అంటే సై అంటూ దూసుకెళ్తున్నారు.    

ఖర్చుకు వెనుకాడకుండా.. 
అప్పులు చేసైనా, బంగారం తాకట్టుపెట్టి అయినా..లేదా బంగారు ఇచ్చయినా ఓట్లు పడేలా చూసుకోవాలనేలా కొందరు డబ్బు విషయంలో భయపడకుండా వెచ్చిస్తున్నారు. ఏ పార్టీకి ఎంతబలం ఉంది..ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉందని ఓ అంచనాకు వచ్చినట్లు తెలిసింది. గెలవాలంటే ఇంకెన్ని ఓట్లు అవసరం అవుతాయని లెక్కలు కడుతున్నారు. ఈ మేరకు ఓటర్లకు గాలం వేసేందుకు ప్రణాలిక రూపొందిస్తున్నారు. ప్రత్యర్థి ఎంతముట్టచెబితే  అంతకంటే ఎక్కుగా ఓటర్లకు  ఇవ్వాలన్నా నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అంతేగాక ఏస్థాయిలో మద్యం, తాయిలాలు వంటివి ఎరవేయాలనేది అంచనా వేస్తున్నారు. ఇదంతా జరిగితే అభ్యర్థుల ఖర్చుకు ఇక అంతే ఉండదు. ప్రచారానికి తిరిగే సమయంలో వందల సంఖ్యలో జనం, కార్యక్తలు ఉండేటట్లు చూసుకుంటున్నారు. వీరిలో ఎక్కువమంది దినసరి కూలీలనేది ఓ విమర్శ. వీరికి మధ్యాహ్నం భోజనం అందిస్తూ, సాయంత్రం వేళ మద్యం కూడా పంపిణీ చేస్తున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement