ఖమ్మం, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులను ఖరారు చేసే విషయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ చేతులెత్తేసింది. జిల్లా పార్టీలో నెలకొన్న వర్గపోరు దృష్ట్యా పీసీసీనే సర్వే చేసి అభ్యర్థులను ఎంపిక చేయాలని పార్టీ అధిష్టానాన్ని కోరినట్లు తెలిసింది. ఆశావహుల జాబితా చాంతాడంత ఉండడంతో ఎవరి పేర్లను అధిష్టానానికి పంపాలి, ఎవరిని తొలగించాలి అనేది కొలిక్కి రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఏ వర్గం నేతల పేర్లు తీసేస్తే ఎలాంటి తంటా వస్తుందోననే సందేహంతో జిల్లాకు పరిశీలకులను పంపి అభ్యర్థులను ఎంపిక చేయాలని పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యలను డీసీసీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావు కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
12 స్థానాలు.. 100 మందికి పైగా అభ్యర్థులు...
జిల్లాలోని పది అసెంబ్లీ, రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ఇప్పటికే 100 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఖమ్మం లోక్‌సభ స్థానానికి మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, స్పీకర్ నాదెండ్ల మనోహర్, సినీనటి విజయశాంతితో పాటు జిల్లాలోని ప్రముఖ కాంట్రాక్టర్ పేర్లను పరిశీలిస్తున్నారు.
ఖమ్మం అసెంబ్లీ స్థానానికి మాజీ ఎమ్మెల్యే యూనస్ సుల్తాన్‌తోపాటు మరో ఐదుగురు, పాలేరు నియోజకవర్గంలో మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డితోపాటు ఆరుగురు, భద్రాచలం నుంచి ఎమ్మెల్యే కుంజా సత్యవతితోపాటు మరో ముగ్గురు, పినపాక నుంచి ఎమ్మెల్యే రేగా కాంతారావుతోపాటు మరో ఐదుగురు, ఇల్లెందు నుంచి ఆరుగురు, అశ్వారావుపేట నుంచి ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేనతోపాటు మరో ఇద్దరు, సత్తుపల్లి నుంచి మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌తోపాటు మరో ఇద్దరు పోటీ పడుతున్నారు. వైరాలో బలమైన నేత లేకున్నా చాలామంది టికెట్ తమకంటే తమకు కావాలని అడుగుతున్నారు. మధిర, కొత్తగూడెం స్థానాలకు మాత్రం పెద్దగా పోటీలేదని డీసీసీ వర్గాలు చెపుతున్నాయి.