కొమ్ములు విరిచామా? | India Completed 30 Days For Coronavirus | Sakshi
Sakshi News home page

కొమ్ములు విరిచామా?

Published Fri, Apr 24 2020 1:58 AM | Last Updated on Fri, Apr 24 2020 1:58 AM

India Completed 30 Days For Coronavirus - Sakshi

కరోనా కాటుతో యావత్‌ దేశం స్తంభించి 30 రోజులైంది. మార్చి 22న జనతా కర్ఫ్యూతో ఒక రోజు లాక్‌డౌన్‌ శాంపిల్‌ చూసిన దేశం.. రెండు రోజుల తరువాత ఏకంగా 21 రోజులు, ఆ తరువాత మరో 19 రోజులు ఆంక్షల మధ్య గడిపేందుకు సిద్ధమైంది. చిల్లరగా బయట తిరిగే వాళ్లకు పోలీసు దెబ్బ రుచిచూపడం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ప్రజలు సమస్య తీవ్రతను అర్థం చేసుకున్నట్లే కనిపిస్తోంది. అందుకేనేమో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ లాక్‌డౌన్‌ అమలుపై 73 దేశాల్లో చేసిన సర్వేలో భారత్‌ తొలిస్థానంలో నిలిచింది.

బస్సులు, రైళ్లు, విమానాలన్నింటినీ రద్దు చేయడం, విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతోపాటు అనవసరమైన ప్రయాణాలన్నింటిపై నిషేధం విధించడంలో భారత్‌ వందకు వంద మార్కులు కొట్టేసింది. తబ్లిగీ సమావేశాలు, వ లస కార్మికుల సమస్య లు లేకుంటే ఈపాటికి కరోనాను జయించిన దే శాల జాబితాలో మన దే శం చేరి ఉండేదేమోగానీ ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. రోజువారీ కేసుల నమో దు, మరణాల రేటు.. కేసులు రెట్టిం పు అవుతున్న వేగం వంటి చాలా అంశా ల్లో భారత్‌ అగ్రరాజ్యం అమెరికాతోపాటు అనేక యూరోపియన్‌ దేశాలను కూడా అధిగమించింది. కరోనా కొమ్ములు విరిచే క్రమంలో అగ్రభాగంలో ఉంది.

అంకెలు చెప్పే వాస్తవాలు... 
భారత వైద్య పరిశోధన సమాఖ్య (ఐసీఎంఆర్‌) ఇటీవల చేపట్టిన పరిశోధనలో కట్టడులేవీ లేకపోతే కరోనా బారినపడ్డ ఒక వ్యక్తి నెల రోజుల్లో కనీసం 406 మందికి వైరస్‌ను అంటించగలడని తేలింది. నాలుగు వందల మంది ఒకొక్కరూ 406 మందికి వైరస్‌ను అంటిస్తే బాధితుల సంఖ్య కాస్తా 1.64 లక్షలకు పెరిగిపోతుంది. చికిత్స, వ్యాక్సిన్లేవీ లేని నేపథ్యంలో పరిస్థితి అలాగే కొనసాగితే కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడటానికి ఎక్కువ సమయం పట్టదు. కరోనా వైరస్‌ ఆర్‌.నాట్‌ అంటే.. ఒకరి నుంచి ఎంత మందికి పాకుతుందో తెలిపే సంఖ్య 2.8 వరకూ ఉంటుందని ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. అంటే.. కట్టడి చర్యలేవీ లేకపోతే ఈ వైరస్‌ కారణంగా ప్రపంచంలోని అత్యధిక శాతం మంది మంచాన పడేందుకు ఎక్కువ సమయం పట్టదు. కానీ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉందని మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఇదే కాదు.. లాక్‌డౌన్‌ అనేది లేకపోతే ఏప్రిల్‌ 15కల్లా దేశంలో సుమారు 8 లక్షల మంది కరోనా బారిన పడతారని ఐసీఎంఆర్‌ లెక్కకట్టినా ఏప్రిల్‌ 22 నాటికి దేశం మొత్తమ్మీద కేసుల సంఖ్య 21,500 మాత్రమే ఉన్నాయి. మరణాల సంఖ్య కూడా 680 మాత్రమే.

మరణాల రేటు తక్కువగానే..
దేశంలో మరణాల రేటు విషయానికొస్తే ఇది 3.4 శాతం నుంచి 3.19 శాతం వరకూ తగ్గింది. జర్మనీలో ఈ సంఖ్య ఇప్పటికీ 3.42 శాతంగా ఉంటే కెనడాలో 4.77 శాతం, అమెరికాలో 5.53 శాతంగానూ ఉంది. చైనాలో ప్రతి వంద మందిలో ఆరుగురు మరణించగా స్పెయిన్‌లో ఏకంగా పది శాతం మంది మరణించారు. ఫ్రాన్స్, ఇటలీ, యూకేల్లో మరణాల రేటు అత్యధికంగా 14 శాతం వరకూ నమోదైంది. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మిగిలిన దేశాలతో పోల్చుకుంటే భారత్‌లో వ్యాధి నయమై డిశ్చార్జ్‌ అవుతున్న వారి శాతం చాలా ఎక్కువగా ఉండటం. ఏప్రిల్‌ 23 నాటికి వ్యాధి బారిన పడ్డ ప్రతి వంద మందిలో చికిత్స తరువాత 20 మందికి నయమవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రెండు వారా ల కిత్రం కేవలం 8 శాతం మందికే వ్యాధి నయమవుతుం డగా వారం తిరిగేసరికి ఇది 12 శాతానికి పెరిగింది.

కేసుల పెరుగుదలలో మార్పు
దేశంలో తొలి కరోనా కేసు జనవరి ఆఖరులో నమోదైంది. లాక్‌డౌన్‌ కు వారం ముందు, మార్చి 17 నాటికి దేశంలోని కేసుల సంఖ్య 137 కాగా మార్చి 24కల్లా ఇది 519కి చేరిం ది. ఇంకోలా చెప్పాలంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువైంది. లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చాక.. కేసులు పెరిగిపోతున్న రేటులో స్పష్టమైన మార్పు కనిపించింది. మార్చి 25 నాటికి 606 కేసులు ఉండగా తొలివారం కేసులు మూడు రెట్లు పెరిగాయి. ఆ తర్వాతి వారానికి ఇది కాస్త తగ్గింది. రెండో వారానికి కేసుల సంఖ్య రెండు రెట్లు మాత్రమే పెరి గింది. ఏప్రిల్‌ 21తో ముగిసిన మూడో వారానికి ఈ సంఖ్య మరికొంత తగ్గి ఒకటిన్నర రెట్లకంటే కొంచెం ఎక్కువగా నమోదైంది. కేసుల సం ఖ్య రెట్టింపు అయ్యేందుకు లాక్‌డౌన్‌ విధించిన తొలిరోజుల్లో 3 రోజులు పట్టగా లాక్‌డౌన్‌ చివరికల్లా ఏడు రోజులు పట్టింది.  ఈ మార్పులన్నీ భౌతిక దూరం  పాటించడం వల్లేనని పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు కె.శ్రీ నాథ్‌రెడ్డి ప్రకటించారు.

మే 15 తర్వాత ఉపశమనం
దేశంలో కరోనా ఉధృతి మే 15 వరకూ కొనసాగుతుందని, ఆ తర్వాత కొన్ని పరిస్థితులకు అనుగుణంగా తగ్గుముఖం పట్టడం మొదలవుతుందని ఒక టీవీ చానల్‌ అధ్యయనం చెబుతోంది. మరోవైపు దేశంలోనే ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు డాక్టర్‌ జయప్రకాశ్‌ ములియల్‌ మాత్రం మనం కరోనా గ్రాఫ్‌ను ఇప్పటికే ఫ్లాటన్‌ చేసినట్లు చెబుతున్నారు. కేసులు, మరణాల సంఖ్య, వైరస్‌బారిన పడుతున్నవారి సంఖ్య రెట్టింపు అవుతున్న వేగం వంటి విషయాలన్నీ దేశంలో వైరస్‌ ఉధృతి తగ్గుతోందనే చెబుతున్నాయని జయప్రకాశ్‌ ములియల్‌ అంటున్నారు. అయితే టీవీ చాన ల్‌ అధ్యయనం మా త్రం మే 22కల్లా దేశంలో కేసుల సంఖ్య 75 వేలకు చేరుకుం టుందని, ఆ తరువాత క్రమేపీ తగ్గుముఖం పడుతుందని చెబు తోంది. లాక్‌డౌన్, భౌ తిక దూరం, ఆర్‌.నాట్‌ వంటి కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాక తాము అంచనాలను రూపొందించామని ఆ చానల్‌ పేర్కొంది. లాక్‌డౌన్‌ను మే 3తో ముగించకుండా 15 వరకూ పొడిగిస్తే కేసుల సంఖ్య సున్నాకు చేరేందుకు 4 నెలలు పడుతుందని, అలా కాకుండా లాక్‌డౌన్‌ను మే 30 వరకూ పొడిగిస్తే జూన్‌లోనే కేసుల సంఖ్య సున్నాకు చేరుకుంటుందని తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement