భారతదేశ మొత్తం భూభాగంలో వరదలకు గురయ్యే ప్రాంతం దాదాపు 14 శాతం. ఇందులో 15 శాతం కంటే ఎక్కువ ప్రాంతంలో ప్రతి ఏటా వరదలు సంభవిస్తూనే ఉన్నాయి. 1953 నుంచి 2016 వరకూ దేశంలో వరదల బారిన పడి ప్రతి ఏడాది సగటున 1,626 మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
వరదల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ఏటా కలుగుతున్న నష్టం సగటున రూ.4,282 కోట్లు. ఈ విషయాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) ఆఫ్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. ఇక 2007 ఏప్రిల్ నుంచి 2016 మార్చి మధ్యలో వరదల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో 61 శాతం ఇప్పటికీ విడుదల కాలేదని పేర్కొంది. ఇదే కాలంలో కేంద్రం ఆమోదించిన 517 పనులు ఇప్పటికీ పూర్తికాలేదని తేల్చింది. – సాక్షి, తెలంగాణ డెస్క్
17 రాష్ట్రాల్లో అధ్యయనం..
2007–08 నుంచి 2015–16 మధ్య 206 వరద నిర్వహణ కార్యక్రమాలు, 38 వరద హెచ్చరిక స్టేషన్లు, 49 నదీ నిర్వహణ కార్యకలాపాలు, సరిహద్దు ప్రాంతాల్లో ప్రాజెక్టులకు సంబంధించిన పనులు, 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 68 భారీ డ్యామ్‌లు మొదలైన వాటిపై కాగ్ అధ్యయనం చేసింది.
ఈ 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఎనిమిది రాష్ట్రాల్లో చేపట్టిన వరద నిర్వహణ కార్యక్రమాలను సరైన పద్ధతిలో నిర్వహించడం లేదని తన నివేదికలో కాగ్ వెల్లడైంది. ఈ పనులు పూర్తికావడానికి 10 నెలలు మొదలుకుని 13 ఏళ్ల వరకూ ఆలస్యం జరుగుతున్నట్టు తేల్చింది. నిధులు విడుదలయ్యే నాటికి టెక్నికల్ డిజైన్లు ఉపయోగించలేని స్థితికి చేరుతుండటమే ఆలస్యానికి కారణమని నివేదిక పేర్కొంది.
భారత్‌కు ముప్పు ఇలా..
భారత భూభాగంలో 14 శాతం లేదా 45.64 మిలియన్ హెక్టార్ల ప్రాంతం వరదలకు గురవుతూ ఉంటుందని కాగ్ నివేదిక పేర్కొంది. వరద ప్రభావానికి గురయ్యే మొత్తం ప్రాంతంలో 16 శాతం లేదా 7.55 మిలియన్ హెక్టార్లలో ఏటా వరదలు సంభవిస్తున్నాయి. 1996 నుంచి 2015 మధ్య ప్రకృతి విపత్తుల వల్ల సంభవిస్తున్న మరణాల్లో ప్రపంచంలోనే మన దేశం ఐదో స్థానంలో ఉంది. ఈ కాలంలో ప్రకృతి విపత్తుల వల్ల 97,691 మరణాలు సంభవిస్తే అందులో మూడో వంతు అంటే 35,325 లేదా 36.1 శాతం వరదల వల్ల కలిగినవే.
దేశంలో పెరిగిన మరణాల సంఖ్య
ప్రకృతి వైపరీత్యాల వల్ల మరణాల్లో హైతీ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంటే.. ఇండోనేషియా, మయన్మార్, చైనా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్(యూఎన్‌ఐఎస్‌డీఆర్) నివేదిక తెలిపింది. వరదల వల్ల ఎక్కువ మరణాలు సంభవిస్తున్న దేశాలు 2015కు ముందు పదేళ్ల కాలంలో ప్రతిసారి వరద వచ్చినప్పుడు మరణాల సంఖ్యను సగటున 34కు తగ్గించగలిగాయని యూఎన్‌ఐఎస్‌డీఆర్ నివేదిక తెలిపింది.
అంతకుముందు పదేళ్ల కాలంలో ప్రతిసారి వరదలు వచ్చినప్పుడు మరణించేవారి సంఖ్య సగటున 68గా ఉంది. డ్యామ్‌ల నిర్మాణం, మెరుగైన హెచ్చరికల వ్యవస్థ ఏర్పాటు చేయడం తదితర కారణాల వల్లే మరణాల సంఖ్యను తగ్గించడం సాధ్యమైంది. అయితే మనదేశంలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. 1996–2015 మధ్య చైనాలో 182 సార్లు వరదలు వస్తే.. మనదేశంలో 167 సార్లు వరదలు సంభవించాయి.
1996–2005 మధ్య చైనాలో 14,400 మరణాలు సంభవిస్తే.. 2006–2015 మధ్య ఇది 6,600కు తగ్గింది. అదే భారత్ విషయానికి వస్తే 1996–2005 మధ్య 13,660 మంది మరణిస్తే.. 2006–2015 మధ్య ఇది కాస్త పెరిగి 15,860కి చేరింది. వరద నిర్వహణ కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించకపోవడం.. పనుల్లో ఆలస్యం.. సరైన అంచనా వ్యవస్థ లేకపోవడం వల్లే ఈ పరిస్థతి ఏర్పడిందని కాగ్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment