సాక్షి, న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో విశేష కృషిచేసిన ప్రముఖులకు క్యాపిటల్ ఫౌండేషన్ ఏటా అందిస్తున్న వార్షిక అవార్డులను ఆదివారం ఢిల్లీలో ప్రదానం చేసింది. తెలంగాణకు చెందిన నెప్లస్ ల్యాబ్స్ సీఎండీ డాక్టర్ తూడి ఇంద్రసేనారెడ్డికి క్యాపిటల్ ఫౌండేషన్ ప్రొ.టి.శివాజీరావ్ జాతీయ అవార్డు దక్కింది. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అవార్డు ప్రదానం చేశారు. గ్రామ్‌వికాస్ భారతి పేరుతో పర్యావరణ పరిరక్షణ, పర్యావరణంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆయన చేపట్టిన కార్యక్రమాలకు, సేవ్ రివర్ పేరుతో మూసీనది ప్రక్షాళనకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినందుకు గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డు దక్కింది.
ఓయూలో ఎమ్మెస్సీ పూర్తిచేసిన ఇంద్రసేనారెడ్డి, పుణేలోని నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ నుంచి ఫార్మకాలజీలో డాక్టరేట్ పూర్తి చేశారు. జర్మనీకి చెందిన హుంబోల్ట్ ఫౌండేషన్, అమెరికాకు చెందిన ఎన్‌ఐ హెచ్‌ల నుంచి ఫెలోషిప్ పొందారు. అనంతరం యూఎస్‌ఏ, భారత్‌లో నెప్లస్ అల్ట్రా ల్యాబ్స్‌ను స్థాపించారు. 2010లో బీజేపీలో చేరిన ఇంద్రసేనారెడ్డి తెలం గాణ బీజేపీ ఎన్‌ఆర్‌ఐ విభాగానికి కన్వీనర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం కెమిస్ట్రీ ప్రొఫెసర్ సి.సురేశ్ రెడ్డికి కూడా ఈ అవార్డు దక్కింది. ఎమ్మెస్సీలో గోల్డ్ మెడల్ సాధించిన సురేశ్‌రెడ్డి సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎలక్ట్రో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ప్రసిద్ధ నిపుణులు. ఈయన ఏపీ అకాడమి ఆఫ్ సైన్స్‌లో సభ్యుడిగా కొనసాగుతున్నారు.
కేంద్ర ఐటీ, న్యాయశాఖలో తీసుకొచ్చిన సంస్కరణలకు గుర్తింపుగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు క్యాపిటల్ ఫౌండేషన్ జస్టిస్ పీఎన్ భగవతి జాతీయ అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ.. వివిధ పథకాలకు ఆధార్‌ను అనుసంధానించడం వల్ల ఎలాంటి వ్యక్తిగత సమాచారం బహిర్గతంకాదని కేవలం పేరు, చిరునామా, పుట్టినతేదీ మాత్రమే తెలుసుకోగలమన్నారు. మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీకి క్యాపిటల్ ఫౌండేషన్ జస్టిస్ వీఆర్ కృష్ణ అయ్యర్ అవార్డును ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షుడు జస్టిస్ ఏకే పట్నాయక్, ప్రధాన కార్యదర్శి వినోద్ సేతి, ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇంద్రసేనారెడ్డికి ‘క్యాపిటల్’ అవార్డు
Published Mon, Sep 25 2017 1:47 AM | Last Updated on Mon, Sep 25 2017 1:47 AM
Advertisement