ఇంద్రవెల్లి అమరులకు ఘన నివాళి
34 ఏళ్ల తర్వాత అనుమతి
ఇంద్రవెల్లి/ఉట్నూర్: భూమి, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాడి పోలీసుల కాల్పుల్లో అసువులు బాసిన అమరవీరులకు నివాళి అర్పించడానికి 34 ఏళ్ల తర్వాత అనుమతి లభించింది. దీంతో ఆదివాసీలు సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద ఘన నివాళి అర్పించారు. ఏఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యం లో మండల కేంద్రంలో 144 సెక్షన్ విధించారు. స్తూపం వద్ద భారీ బందోబస్తు ఏర్పా టు చేశారు. నివాళి అర్పించడానికి మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు షరతులతో అనుమతి లభించింది. దీంతో సంప్రదాయ వాయిద్యాలతో పూజలు చేశారు. ఆసిఫాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, రాథోడ్ బాపూరావ్ హాజరయ్యారు.
భీమ్ మునిమనవరాలుకు ఉద్యోగం: ఆదివాసీల ఆరాధ్య దైవం కొమురం భీమ్ మునిమనవరాలైన కొట్నాక వరలక్ష్మికి ఐటీడీఏ ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. సిర్పూర్(యు) మండలం చిన్నదోబలో నివాసముంటున్న వరలక్ష్మికి పంగిడి ఆశ్రమ పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా నియమిస్తూ ఉత్తర్వులు అందించింది.