పరిశ్రమలకు ‘మహాభాగ్య’నగరి: కేటీఆర్
హైదరాబాద్: దేశంలోనే హైదరాబాద్‌ను పారిశ్రామికంగా మొదటిస్థానంలో నిలిపేందుకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఐటీ,పంచాయతీరాజ్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు( కేటీఆర్) తెలిపారు. బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణలో రౌండ్ టేబుల్ ఇండియా ఏరియా-9 ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, పెట్టుబడులు, వ్యాపారాలు అనువైన పరిస్థితులపై విశ్లేషించేందుకు, సందేహాలు నివృత్తి చేసేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారందరికీ తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే నగరంలో ఐటీ, ఫార్మా, బల్క్‌డ్రగ్, బయోటెక్నాలజీ, సీడ్, పౌల్ట్రీ పరిశ్రమలు విస్తరించాయన్నారు. ఆయారంగాల్లో మరిన్ని పెట్టుబడులను తాము ఆహ్వానిస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు.
ఐఎస్‌బీ, ఐఐఐటీలతో కలసి దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌కు రూపకల్పన చేస్తామన్నారు. హైదరాబాద్‌ను వైఫై నెట్‌వర్క్‌తో అనుసంధానం చేసే ఆలోచనలో ఉన్నామని, తద్వారా నగరఖ్యాతిని పెంపొందించడమే కాకుండా ఆకర్షణీయమైన ప్రాంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. లక్షకుపైగా ఇంజనీరింగ్ తదితర గ్రాడ్యుయేట్‌లు ప్రతి ఏటా ఉత్తీర్ణులై బయటకు వస్తున్నారని వీరికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇందుకోసం హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్ కంపెనీలు, ఇంజనీరింగ్ కాలేజీలకు ప్రభుత్వం సంధానకర్తగా వ్యవహరిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రౌంట్ టేబుల్ ఇండియా 9 ప్రతినిధులు రియాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.