త్రిముఖ ‘పోరు’గల్లు
తెలంగాణ రాజధాని హైదరాబాద్ తర్వాత కేంద్రం. రాజకీయ, ప్రజా ఉద్యమాలకు కేంద్ర స్థానం. విప్లవ రాజకీయాలు, సామాజిక ఉద్యమాలకు నెలవు. విద్యలో తెలంగాణలో కీలకమైన ప్రాంతం. తొలి నుంచి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన గడ్డ. మలి దశ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి కేంద్రంగా ఉన్న ప్రాంతం. రాజకీయ చైతన్యానికి మారుపేరైన వరంగల్ లోక్‌సభ ఎన్నికలు ముక్కోణపు పోరుతో ఈసారి రసవత్తరంగా మారింది.
లోక్‌సభ నియోజకవర్గం వరంగల్
ఎవరెన్నిసార్లు గెలిచారు
కాంగ్రెస్ -7, కాంగ్రెస్(ఐ) -2, టీడీపీ -5,
టీఆర్‌ఎస్ -1, టీపీఎస్ -1, పీడీఎఫ్-1
తొలి ఎంపీ : పెండ్యాల రాఘవరావు
ప్రస్తుత ఎంపీ : సిరిసిల్ల రాజయ్య
ప్రస్తుత రిజర్వేషన్ : షెడ్యూలు కులాలు(ఎస్సీ)
నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాలు: వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట(ఎస్సీ), పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్(ఎస్సీ), పరకాల, భూపాలపల్లి
మొత్తం ఓటర్లు : 14,95,470
పురుషులు : 7,50,743
మహిళలు: 7,44,727
కొత్త ఓటర్లు : 32,000
ప్రత్యేకతలు: అన్ని సామాజిక వర్గాల వారి కోట్లు ప్రభావితం చూపుతాయి. రాజకీయ చైతన్యం ఎక్కువ. తెలంగాణవాదం ఎక్కువ. నగర ఓటర్లు ఎక్కువ. విద్యావంతుల ప్రభావం ఉంటుంది. దళితుల ఓట్లు ప్రభావితం చూపుతాయి.
ప్రస్తుతం బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే:
సిరిసిల్ల రాజయ్య (కాంగ్రెస్)
కడియం శ్రీహరి (టీఆర్‌ఎస్)
రామగల్ల పరమేశ్వర్ (బీజేపీ)
(పిన్నింటి గోపాల్, వరంగల్): 1952 నుంచి ఈ నియోజకవర్గం ఉంది. జనరల్ స్థానంగా ఉన్నప్పుడు సైతం మూడుసార్లు ఇక్కడ ఎస్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 2009 నుంచి ఎస్సీ కేటగిరిలోకి మారింది. రెండు ఉప ఎన్నికలతో కలిసి ఇప్పటికి 17 సార్లు ఎన్నికలు జరిగాయి. వరంగల్ లోక్‌సభకు ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన వారిలో ఎవరు కేంద్ర మంత్రులు కాలేదు. పలువురు సీనియర్ నేతలు ఇక్కడ గెలిచినా... ఇతర నియోజకవర్గాల నుంచి ప్రాతినిథ్యం వహించినప్పుడే ఈ పదవి వరించింది. 2009 ఎన్నికల్లో రామగల్ల పరమేశ్వర్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. 1,24,661 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో పరమేశ్వర్ టీడీపీ మద్దతు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పార్టీ ముఖ్య నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి బరిలో ఉన్నారు.
సిరిసిల్లకు అసంతృప్తి దెబ్బ...
ప్రస్తుత ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు సహజంగానే ఉండే వ్యతిరేకత ఉంది. తెలంగాణ ఉద్యమం, రాజకీయ పరిస్థితులు అడ్డంకిగా ఉన్నాయని... మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానని చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్‌లోని గ్రూపు రాజకీయాలు ఇబ్బందిగానే ఉన్నాయి. వరంగల్ లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో... వరంగల్ తూర్పు, పాలకుర్తి నియోజకవర్గ నేతలతోనే సఖ్యత ఉంది.
వర్ధన్నపేట, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ నేతలతో దూరం ఉంది. భూపాలపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణతో సాధారణ సంబంధాలే ఉన్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ ఇటీవలే టీఆర్‌ఎస్ నుంచి వచ్చిన జి.విజయరామారావుకు టిక్కెట్ ఇవ్వడంతో కాంగ్రెస్ ఇంచార్జిగా ఉన్న రాజారపు ప్రతాప్ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్రుడిగా బరిలో ఉన్నారు. దీని ప్రభావం లోక్‌సభ ఎన్నికపైనా పడే అవకాశం ఉంది.
కడియం కొత్త రూపు...
దాదాపు మూడు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న కడియం శ్రీహరి మొదటిసారి లోక్‌సభ బరిలో దిగుతున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో అనుభవం కడియంకు అనుకూలంగా ఉంది. లోక్‌సభ పరిధిలోని స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి కడియం శ్రీహరి టీడీపీ తరుపున మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ స్థానంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన టి.రాజయ్య తర్వాత టీఆర్‌ఎస్‌లోకి వచ్చారు.
ఈయన ఎమ్మెల్యేగా బరిలో ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఇక్కడ టిక్కెట్ గొడవలు తనకు మరింత మేలు చేస్తాయని కడియం నమ్మకంతో ఉన్నారు. వర్ధన్నపేట కడియం సొంత నియోజకవర్గం. ఈ రెండు ఎస్సీ కేటగిరి నియోజకవర్గాలు కావడం కడియంకు అనుకూలాంశాలు. మిగిలిన నియోజకవర్గాల్లోనూ టీఆర్‌ఎస్ ఈసారి బలమైన అభ్యర్థులనే రంగంలోకి దించింది. పరకాలలో టీఆర్‌ఎస్ టిక్కెట్ల పోరు పార్టీకి ఇబ్బందిగా మారే అంశంగా ఉంది. టీడీపీలో ఉన్నప్పుడు టీఆర్‌ఎస్‌ను తీవ్రస్థాయిలో విమర్శించిన నేతల్లో కడియం ఒకరు అనే అంశాన్ని గులాబీ పార్టీ నేతలు ఇంకా మరిచిపోవడంలేదు.
మోడీ మంత్రం...
బీజేపీ అభ్యర్థి రామగల్ల పరమేశ్వర్ గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ సానుభూతికి తోడు జాతీయ స్థాయిలో నరేంద్రమోడీ అనుకూల పవనాలు తనకు కలిసొస్తాయని భావిస్తున్నారు. టీఆర్‌ఎస్ నుంచి వచ్చిన పరమేశ్వర్‌కు టిక్కెట్ ఇవ్వడంపై బీజేపీ శ్రేణులు అసంతప్తిగా ఉన్నాయి. గతంలో వరంగల్‌లో ఒకసారి బీజేపీ అభ్యర్థిగా ఎంపీగా గెలిచారు. బీజేపీ శ్రేణులు పరమేశ్వర్‌కు ఎంతవరకు సహరిస్తాయనేదానిపై గెలుపోటములు ఉండనున్నాయి. టీడీపీతో పొత్తు పరమేశ్వర్‌కు ఇబ్బందిగా మారింది. తెలంగాణ వ్యతిరేక పార్టీతో పొత్తు వల్ల తెలంగాణవాదులు ఎంతవరకు ఆదరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ అంశమే ప్రచారాస్త్రం
ప్రజాసమస్యలు, జిల్లా సమస్యలు,అభివృద్ధి, సంక్షేమం ఇవేవీ వరంగల్ లోక్‌సభ అభ్యర్థుల ప్రచారంలో పెద్దగా కనిపించడంలేదు. ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం అంతా తెలంగాణ కేంద్రంగా సాగుతోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీ తమదే అని సిరిసిల్ల రాజయ్య చెప్పుకుంట న్నారు. కేంద్రంలో అధికార పార్టీలో ఉండి ప్రతిపక్ష పార్టీలకు దీటుగా తెలంగాణ కోసం అన్ని స్థాయిల్లో పోరాటం చేశానని అంటున్నారు. తెలంగాణ కోసం తాను చేసిన పోరాటాన్ని ప్రజలు గుర్తిస్తారనే భావనతో ముందుకు వెళ్తున్నారు.
తెలంగాణ ఏర్పాటు పూర్తిగా టీఆర్‌ఎస్ ఘనత అని గులాబీ పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరి చెబుతున్నారు. ప్రజా ఉద్యమాన్ని చూసి అనివార్య పరిస్థితుల్లో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని అంటున్నారు. తెలంగాణ అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే అవుతుందని... కేంద్రంలోనూ టీఆర్‌ఎస్‌కు బలం ఉంటే ఇవన్నీ సాధ్యమని కడియం శ్రీహరి చెబుతున్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రామగల్ల పరమేశ్వర్ తెలంగాణ ఎజెండాతోనే ముందుకు వెళ్తున్నారు. బీజేపీ మద్దతు లేకపోతే తెలంగాణ ఏర్పాటు అయ్యేదే కాదని అంటున్నారు. కేంద్రంలో ఏర్పడేది బీజేపీ ప్రభుత్వమే కాబట్టి... వరంగల్ ప్రజలు తనను ఆదరిస్తే అభివృద్ధి బాగా జరుగుతుందని చెబుతున్నారు.
బలాబలాలు
సిరిసిల్ల రాజయ్య (కాంగ్రెస్)
అనుకూలం
హా తెలంగాణ ఏర్పాటు చేసిన పార్టీ
హా దళితుల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్న ఓటర్ల వర్గం నేత
ప్రతికూలం
హా చెప్పుకోదగ్గ అభివృద్ధి లేకపోవడం
హా ఏడు సెగ్మెంట్లలో రెండు సెగ్మెంట్లలోనే సఖ్యత ఉంది.
హా స్థానికేతరుడు అనే ప్రచారం
అనుకూలం
హా తెలంగాణ తెచ్చిన పార్టీగా సానుకూలత
హా సుదీర్ఘ రాజకీయ అనుభవం
హా టీడీపీ శ్రేణులతో పరిచయాలు
హా స్టేషన్‌ఘన్‌పూర్ మెజారిటీపై భారీ అంచనాలు
ప్రతికూలం
హా టీఆర్‌ఎస్ అధినేతపై గతంలో చేసిన తీవ్ర విమర్శల ప్రభావం
హా అసెంబ్లీ అభ్యర్థులతో సమన్వ యలేమి, పలుచోట్ల సంస్థాగత లోపం
రామగల్ల పరమేశ్వర్ (బీజేపీ)
అనుకూలం
హా గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరుపున పోటీ చేసి ఓడిపోయిన సానుభూతి
హా జాతీయ స్థాయిలో నరేంద్రమోడి అనుకూల పవనాలు
ప్రతికూలం
హా లోక్‌సభ పరిధిలోని మూడు సెగ్మెంట్లలోనే బీజేపీ పోటీ
హా టీడీపీ శ్రేణుల సహకారం లేకపోవడం
నే.. గెలిస్తే
హా వరంగల్ నగరానికి అండర్‌గ్రౌండ్ డ్రెనేజీ సదుపాయం
హా జిల్లా కేంద్రంలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు
హా వరంగల్ (మామునూరు) ఎయిర్‌పోర్టు పునరుద్ధరణ
హా పుర పథకం విస్తరణ
హా స్టేషన్‌ఘన్‌పూర్ లెదర్ పార్క్
హా కుంటలు, చెరువులు మరమ్మతులు
హా పశుపోషణ ప్రాధాన్యత
హా ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లను రెసిడెన్సియల్ స్కూళ్లుగా మార్పిడి
హా చారిత్రమ కట్టడాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దడం.
కడియం శ్రీహరి (టీఆర్‌ఎస్)
హా జిల్లాలను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దడం...
హా నియోజకవర్గ అభివద్ధికి ప్రత్యేక ప్రణాళిక
హా టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో వరంగల్‌కు సంబంధించిన అంశాల అమలు
హా వైద్య సేవల విస్తరణ, ఆరోగ్య సంరక్షణ, ఎంజీఎంను అత్యాధునిక వైద్య సేవల కేంద్రంగా అప్‌గ్రేడ్.
హాహైదరాబాద్-వరంగల్-భూపాలపల్లి ప్రాంతాలను కలుపుతూ పరిశ్రమల కారిడార్ ఏర్పాటు
హా దళిత యూనివర్సిటీ, బొగ్గు పరిశోధన కేంద్రం, కళాశాల స్థాపన
హా వరంగల్-ఖమ్మం సరిహద్దులో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు
హా రైల్వే లైన్ల ఆధునికీకరణ, రైల్వే వ్యాగన్ పరిశ్రమ ఏర్పాటు
బాగా ‘గుర్తు’ంది...!
ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకొనేందుకు అభ్యర్థులు రకరకాల వస్తువులను, దుస్తులను పంపిణీ చేస్తుంటారు. గత 2009 ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ సుమారు 10 వేల కాటన్ టీషర్టులను కొనుగోలు చేసి, వాటిపై తన ఫొటోలను, హస్తం గుర్తును చిత్రీకరించి ఓటర్లకు అందజేశారు. ఈ కాటన్ టీషర్టులను రెండు, మూడు జతల చొప్పున తీసుకొన్న ఓటర్లు ఐదేళ్లుగా వాడుతూనే ఉన్నారు. ఓ రైతు ఈ టీషర్టు ధరించి బాన్సువాడ మండలం ఇబ్రాహింపేటలో గడ్డివాము మోసుకెళ్తుండగా, అదే సమయంలో ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి కాసుల బాల్‌రాజ్ అతనికి ఎదురయ్యారు. ఆ రైతును ఓటడగబోగా ‘‘నేను కాంగ్రెస్ టీషర్టునే ధరించా... మీకే ఓటేస్తా’’ అంటూ సెలవిచ్చాడు. అప్పటి టీషర్టులు భలే పనికొస్తున్నాయే అని కాంగ్రెస్ నేతలు నవ్వుకున్నారు. కొసమెరుపేమిటంటే..అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్థన్ ఇపుడు టీఆర్‌ఎస్‌లో చేరారు.
-బాన్సువాడ, న్యూస్‌లైన్
ఇద్దరే...!
రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఇద్దరి రికార్డు చెరపలేనిది. పెం డ్యాల రాఘవరావు 1952లో వరంగల్ జిల్లా హన్మకొండ నియోజకవర్గం నుంచి పీడీఎఫ్ తరుఫున పోటీ చేసి గెలి చా రు. అదే సమయం లో వర్ధన్నపేట అసెంబ్లీ నుంచి, వరంగల్ లోక్‌సభ స్థానాల్లో సైతం గెలిచారు. తర్వాత రాఘవరావు హన్మకొండ, వర్ధన్నపేట అసెంబ్లీ స్థానాలకు రాజీనామా చేసి ఎంపీగా కొనసాగారు. 1983లో తెలుగుదేశంపార్టీ స్థాపించిన ఎన్టీ రామారావు తెలంగాణలోని నల్లగొండ, చిత్తూరు జిల్లా తిరుపతి, కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశారు. మూడు చోట్లా గెలుపొం దారు. ఆ తర్వాత నల్లగొండ, తిరుపతి స్థానాలకు రాజీనామా చేసి గుడివాడ ఎమ్మెల్యేగా కొనసాగి ముఖ్యమంత్రి అయ్యారు. వీరిద్దరు మినహా రాష్ట్ర చరిత్రలో ఒకేసారి మూడు సెగ్మెంట్ల నుంచి గెలిచిన వారె వ్వరూ లేరు.
-న్యూస్‌లైన్, హన్మకొండ
రెండు కండువాల ప్రచారం
ఎలక్షన్ ముచ్చట్లు: తెలుగుదేశం కండువా వేసుకుని...అదే పార్టీ తరుఫున స్థానిక పోరులో అభ్యర్థులను రంగంలోకి దింపిన వరంగల్ జిల్లా భూపాలపల్లి అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు రాత్రికేరాత్రే పార్టీ మారాల్సిన పరిస్థితి ఎదురైంది. టీడీపీ-బీజేపీ పొత్తులో ఈ భూపాలపల్లి స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. అప్పటికే ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు బీజేపీ తరుఫున మాజీ ఎంపీ జంగారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడి టీడీపీ అభ్యర్థి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి గండ్ర సత్యనారాయణ పోటీ చేయాలని ఆశించారు.
కానీ పొత్తులో ఆ సీటును బీజేపీకి కేటాయించడంతో అదే రాత్రి బీజేపీలో చేరారు. ఈనెల 9న ఉదయం బీజేపీ అభ్యర్థిగా బీఫాంతో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ, బీజేపీ కండువాలు మెడలో వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఆయన బీజేపీలో చేరడమే కలిసి వచ్చిందని, సైకిల్ గుర్తుకు ఇక్కడి బొగ్గు గని కార్మికులు వ్యతిరేకంగా ఉంటారని ప్రచారం జరుగుతోంది. కానీ జిల్లాలో రాత్రికి రాత్రే పార్టీ మారిన వ్యక్తిగా సత్యనారాయణరావు గుర్తుండిపోయారు.
- న్యూస్‌లైన్,హన్మకొండ
పొత్తుతో చిత్తు
తెలుగుదేశం పార్టీ అవిర్భావం నుంచి వరుసగా ఐదు ఎన్నికల్లో 20 సంవత్సరాల పాటు ఎదురులేకుండా గెలుస్తూ వచ్చిన నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం స్థానాన్ని పదేళ్లు గా పొత్తులో భాగంగా ఆ పార్టీ కోల్పోవాల్సి వచ్చింది. పొత్తులో భాగంగా 2009లో టీఆర్‌ఎస్, 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీలకు వదులుకుంది. కాగా, 2010 ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన జాజాల సురేందర్ 11,700 ఓట్లు సాధించి డిపాజిట్ కోల్పోయారు.
- న్యూస్‌లైన్,ఎల్లారెడ్డి టౌన్