తెలంగాణలో తెల్లముఖమే
పోలింగ్‌కు ముందే చేతులెత్తేసిన టీడీపీ
ఎదురీదుతున్న అభ్యర్థులు
బాబు రోజుకోజిల్లా తిరిగినా
ఫలితం శూన్యం
తెలంగాణలో పోలింగ్‌కు గడువు దగ్గరపడుతోంది. నేటితో ఎన్నికల ప్రచారానికి కూడా తెరే! కానీ, గెలుపు ధీమా లేకపోయినా... ఉనికినైనా నిలబెట్టుకోవాలనే తాపత్రయంతో బరిలోకి దిగిన తెలుగుదేశం అభ్యర్థులు మాత్రం పోలింగ్‌కు రెండు రోజుల ముందే చేతులెత్తేశారు.చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ కాళ్లకు బలపాలు కట్టుకుని జిల్లాల్లో తిరిగినా, సినీ మోజు మురిపిస్తుందనే ఆశతో పవన్ కల్యాణ్‌ను రంగంలోకి దించినా వీసమెత్తు కూడా ప్రయోజనం లేకుండా పోయిందని అభ్యర్థులు వాపోతున్నారు. తెలంగాణవాదం ముందు బాబు చెప్పే కబుర్లు జనం నెత్తికెక్కలేదంటున్నారు. స్థానిక పరిస్థితులు, ప్రచార సరళి, బట్టి చూస్తే తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తున్న 72 సీట్లలో ఏకంగా 50 పైచిలుకు చోట్ల మూడో స్థానానికే పరిమితమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
పని చేయని అగ్ర నేతల ప్రచారం
హైదరాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్‌లలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రచారం చేసినా, బాబు, లోకేశ్ రోజుకో జిల్లా తిరిగినా ఓటర్లు వారిని పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఆదిలాబాద్ పర్యటనలోనైతే బాబుపై కోడిగుడ్లతో దాడికే ప్రయత్నిం చారు. పవన్ పర్యటనలకు జనం వచ్చినా ఆయన ప్రసంగాల్లో స్పష్టత, గానీ జోష్ గానీ లేక వెనుదిరిగారు. దాదాపుగా అన్ని చోట్లా టీడీపీ అభ్యర్థులు ఎదురీదుతున్నారు. పలుచోట్ల ఆశలు వదులుకుని ప్రచారాన్ని కూడా పక్కన పెట్టారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ‘ఎన్టీఆర్ భవన్ (టీడీపీ ప్రధాన కార్యాలయం) నుంచి నిధులొస్తే ఏదో మా ఉనికి కాపాడుకోవడానికి డబ్బులు పంచి ప్రచారం చేస్తాం. లేదంటే మాత్రం ఈసారికింతే’ అనే ధోరణి టీడీపీ అభ్యర్థుల్లో కనిపిస్తోంది. పలుచోట్ల, ‘పార్టీని పక్కన పెట్టి, మమ్మల్ని చూసి ఓటేయండి’ అంటూ వారు ఓటర్లను ప్రాధేయపడుతున్నారు!
అంతటా ఎదురీతే
ఉత్తర తెలంగాణలోనే గాక గత ఎన్నికల్లో అధిక స్థానాలు సాధించిన మహబూబ్‌నగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో నూ ఈసారి టీడీపీ పూర్తిగా వెనకబడిపోయింది. మహబూబ్‌నగర్‌లో కొడంగల్, ఆలంపూర్‌లలో మాత్రమే కాస్త గట్టి పోటీ ఇస్తోంది. అందుకు పార్టీ కంటే కూడా వ్యక్తిగత, ఇతరత్రా కారణాలే పనిచేస్తున్నాయి. కొడంగల్‌ను టీడీపీ అభ్యర్థి రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకోగా ఆలంపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక అబ్రహంకు కలిసి రావచ్చ న్న అంచనాలున్నాయి. నిజామాబాద్‌లోని బాల్కొండలో మాత్రమే టీడీపీ అభ్యర్థి మల్లికార్జునరెడ్డి కాస్త పోటీ ఇస్తున్నారు. అదిలాబాద్‌లో బోథ్ మినహా మిగతా వాటిల్లో టీడీపీకి మూడో స్థానమేనని తెలుస్తోంది.కరీంనగర్‌లోనైతే తెలంగాణ టీడీపీ ఎన్నికల కమిటీ అధ్యక్షుడు ఎల్.రమణ సహా అభ్యర్థులందరికీ గడ్డు పరిస్థితే. గజ్వేల్, నారాయణఖేడ్‌లలో మాత్రమే కాస్త పోటీ ఇస్తోంది. వరంగంల్‌లో ములుగు, నర్సంపేట, పాలకుర్తి, పరకాలలో కాస్త పోటీలో ఉంది. ఖమ్మంలో టీడీపీ అభ్యర్థులు పూర్తిగా ఎదురీదుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో ప్రజాదరణ అనూహ్యంగా పెరగడంతో చతుర్ముఖ పోటీలో టీడీపీ అభ్యర్థులు చమటోడుస్తున్నారు.
ఖమ్మం, మధిర, వైరా, అశ్వరావుపేటల్లో మాత్రమే కాస్త పోటీ ఇస్తున్నారు. నామా, తుమ్మల వర్గ పోరు అభ్యర్థుల పాలిట శాపంగా మారింది. నల్లగొండలోనూ కాంగ్రెస్, టీఆర్‌ఎస్ హవాయే కొనసాగుతోంది. ఇక్కడ పరువు నిలుపుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. రంగారెడ్డి అర్బన్ ప్రాంతంలోని ఏడు సీట్లలో కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నుంచి టీడీపీ గట్టి పోటీ ఎదుర్కొం టోంది. ‘సీఎం అభ్యర్థి’ ప్రకటనఎల్‌బీ నగర్‌లో తన రాత మారుస్తుందేమోనని ఆర్.కృష్ణయ్య ఆశపడుతున్నారు. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కూకట్‌పల్లి, మేడ్చల్, శేరిలింగంపల్లిల్లో పోటీ ఇవ్వకపోతామా అన్న భావన ఉంది. జిల్లాలోని రూరల్ స్థానాల్లో రెండో స్థానం కోసమే పోటీ పడుతోంది. పాతబస్తీలోని ఏడు సీట్లు ఎంఐఎం ఖాతాలోకేనని ఇప్పటికే నిర్ణయానికి వచ్చింది. సికింద్రాబాద్, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, కంటోన్మెంట్లలో చెమటోడుస్తున్నాయి.