ఏడాదిన్నర క్రితం అర్థంతరంగా పరిశ్రమలో ఉత్పత్తి నిలిపివేయడంతో దిక్కుతోచని స్థితిలో కార్మికులు బుధవారం పరిశ్రమ ఏదుట నిరసన చేపట్టారు.
♦ ఏడాదిన్నర కాలంగా దిక్కుతోచని స్థితిలో కార్మికులు
♦ పట్టించుకోని యాజమాన్యం
♦ పరిశ్రమపై ఆధారపడిన వెయ్యి కుటుంబాలు
♦ ఆదుకోవాలంటూ పరిశ్రమ ఎదుటే కార్మికుల నిరసన
తూప్రాన్ : ఏడాదిన్నర క్రితం అర్థంతరంగా పరిశ్రమలో ఉత్పత్తి నిలిపివేయడంతో దిక్కుతోచని స్థితిలో కార్మికులు బుధవారం పరిశ్రమ ఏదుట నిరసన చేపట్టారు. ఈ సంఘటన మండలంలోని కాళ్లకల్ పారిశ్రామిక ప్రాంతంలోని టీఎం టైర్స్ పరిశ్రమ వద్ద జరిగింది. ఈ సందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడుతూ కాళ్లకల్ సమీపంలోని టీఎం టైర్స్ పరిశ్రమలో తాము గత కొన్నేళ్లుగా పనిచేస్తున్నామని, పరిశ్రమలో 99 మంది పర్మినెంట్ కార్మికులుగా, 650 మంది కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నామన్నారు. మరో 150 మంది కార్యాలయ సిబ్బంది పనిచేస్తున్నారన్నారు.
2013 అక్టోబర్ 13న యాజమాన్యం కార్మికులతో సమావేశం నిర్వహించి పరిశ్రమ నిర్వహణలో ఇబ్బందులు ఉన్నందున, పదిరోజుల్లో సమస్య పరిష్కరిస్తామని, అప్పటి వరకు పరిశ్రమలో ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు చెప్పారన్నారు. యాజమాన్యం చెప్పిన మాటలకు ఒప్పుకున్న కార్మికులు పది రోజుల వరకు వేచి చూసి, హెచ్‌ఎంఎస్ యూనియాన్ అధ్యక్షుడు నాయిని నర్సింహారెడ్డికి తమ గోడు వినిపించామన్నారు. అలాగే గజ్వేల్ (గడా) ప్రత్యేకాధికారి హన్మంతురావు దృష్టికి తీసుకవెళ్లామన్నారు. అయినప్పటికీ తమ సమస్య పరిష్కారం కాలేదని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణలో పరిశ్రమలకు పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గంలోనే పరిశ్రమ యాజమాన్యం కార్మికుల జీవితాలతో చెలాగాటమాడుతుంటే తమ గోడు ఎవరికి చెప్పుకోవాలన్నారు. ప్రస్తుతం తమకు పూట గడవడం కూడా కష్టంగా మారిందన్నారు. పాఠశాలలు ప్రారంభయ్యే రోజులు దగ్గర పడుతుంటే కనీసం పిల్లలను చదివించలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని పరిశ్రమను తెరిపించి వెయ్యిమంది కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని కార్మికులు కోరారు.