భూపంపిణీలో అనర్హులు | Ineligible land distribution | Sakshi
Sakshi News home page

భూపంపిణీలో అనర్హులు

Published Sun, May 22 2016 5:08 AM | Last Updated on Mon, Sep 4 2017 12:37 AM

Ineligible land distribution

19 మందిలో ఏడుగురు అనర్హులని తేల్చిన ఆర్డీవో
 
కాటారం : ప్రభుత్వం నిరుపేద దళితుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన భూ పంపిణీ కార్యక్రమంలో పలు అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. మండలంలోని చిద్నెపల్లి గ్రామపంచాయతీ పరిధిలో రెండవ విడతగా చేపట్టిన భూ పంపిణీ లబ్ధిదారుల ఎంపికలో అనర్హులకు చోటు కల్పించినట్లు అధికారులపై విమర్శలు వస్తున్నారుు. మండలంలో మొదటగా ఇదే గ్రామపంచాయతీ పరిధిలో భూ పంపిణీ కార్యక్రమం చేపట్టి విజయవంతం చేసిన అధికారులు... తిరిగి ఇదే గ్రామపంచాయతీలో రెండవ విడతగా దళితులకు భూమి పంపిణీ చేయడం కోసం చర్యలు వేగవంతం చేశారు. చిద్నెపల్లితోపాటు ఒడిపిలవంచ, గుమ్మాళ్లపల్లి గ్రామపంచాయతీల పరిధిలో భూపంపిణీ కోసం భూమిని కొనుగోలు చేశారు.

గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేసి ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. ఒడిపిలవంచ, గుమ్మాళ్లపల్లిల్లో ఈ ప్రక్రియ సజావుగానే కొనసాగినప్పటికీ చిద్నెపల్లిలో లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగినట్లు తేలింది. గతంలో గ్రామసభ నిర్వహించి లబ్ధిదారుల నుంచి రెవన్యూ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. కొన్ని రోజుల తర్వాత తిరిగి గ్రామసభ నిర్వహించి 19 మందిని ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఇందులో కొంతమంది అనర్హులని గతంలోనే పలువురు గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారు పట్టించుకోలేదు.
లబ్ధిదారుల ఎంపికలో మండల రెవెన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు కొంతమంది స్థానికులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ నీతూప్రసాద్ విచారణ కోసం మంథని ఆర్డీఓను ఆదేశించారు. శుక్రవారం ఆర్డీఓ బాల శ్రీనివాస్ లబ్ధిదారులను తహసీల్దార్ కార్యాలయానికి పిలిపించి విచారణ చేపట్టారు. క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల వివరాలు సేకరించి, రెవెన్యూ రికార్డుల ప్రకారం పరిశీలించి 19 మందిలో ఏడుగురిని అనర్హులుగా తేల్చారు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు నివేదించి తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు ఆర్డీఓ పేర్కొన్నారు.

 అవినీతి, అక్రమాలు..?
భూపంపిణీలో అనర్హులకు చోటు కల్పించడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏవైనా ఒత్తిళ్ల మేరకు అనర్హులకు చోటు కల్పించాల్సి వచ్చిందా? లేక క్షేత్రస్థాయిలో పరిశీలన లోపం వల్ల జరిగిందా? అని చర్చ జరుగుతోంది. ఆర్డీఓ స్థాయి అధికారి విచారణ జరిపి అనర్హులను గుర్తించే వరకు మండల రెవెన్యూ అధికారులు గుర్తించలేకపోవడం, అంతకముందు పలు ఆరోపణలు వచ్చినా స్పందించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. దీనికితోడు లబ్ధిదారుల ఎంపికలో పలువురు రెవెన్యూ అధికారులు, సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్లు విశ్వసనీయ సమాచారం.

అటు భూ విక్రయదారులతోపాటు ఇటు లబ్ధిదారుల నుంచి ముడుపులు అందుకున్నట్లు తెలిసింది. ముందస్తు ఒప్పందం మేరకే సదరు అధికారులు, సిబ్బంది అనర్హులకు సైతం జాబితాలో చోటు కల్పించడానికి కృషి చేసినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి సైతం వెళ్లిందని, తమ శాఖ పరుపుపోతుందని భావించి వదిలేసినట్లు సమాచారం. ఈ అవినీతి, అక్రమాల వ్యవహారంలో గత కొంతకాలంగా మండలంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ముఖ్య రెవెన్యూ అధికారి చక్రం తిప్పు తూ అన్ని తానై వ్యవహరిస్తున్నట్లు ఆరోణలున్నారుు.
 
 ఉన్నతధికారులకు నివేదిస్తాం
 చిద్నెపల్లి గ్రామపంచాయతీ పరిధిలో చేపట్టిన భూ పంపిణీ లబ్ధిదారుల జాబితాలో కొంత    మంది అనర్హులు ఉన్నట్లు గుర్తించాం. విచారణ జరిపి ఏగుడుగురిని అనర్హులుగా తేల్చాం.     వీరి వివరాలను కలెక్టర్‌కు నివేదిస్తాం. వారి     ఆదేశాల మేరకు తిరిగి లబ్ధిదారుల ఎంపిక     చేపడుతాం. - బాల శ్రీనివాస్, ఆర్డీఓ, మంథని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement