ప్రతీకాత్మక చిత్రం
అక్కన్నపేట(హుస్నాబాద్): ప్రభుత్వ పథకాల అమలు, మంజురైన నిధులు, చేసిన పనులు తదితర వివరాల సమాచారం తెలుసుకునేందుకు ప్రభుత్వం సమాచార హక్కు చట్టం తీసుకొచ్చింది. అయితే, తాము కోరిన సమాచారం పొందేందుకు ఓ చట్టం ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. కేవలం రూ.10తో దరఖాస్తు చేసుకుంటే పంచాయతీ కార్యాలయం నుంచి రాష్ట్రపతి భవన్‌కు సంబంధించిన ఏ సమాచారమైనా పొందే వీలుంది. దీనిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నుంచి సమాచారాన్ని ప్రతి పౌరుడు అడిగి తెసుకోవాలన్న ఉద్ధేశంతో సమాచార హక్కు చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ఏ ప్రభుత్వ కార్యాలయం నుంచైనా దరఖాస్తు చేసుకుని.. కావాల్సిన సమాచారం పొందవచ్చు. ప్రభుత్వం చేసిన పనులు, నిధుల విడుదల, వినియోగం తదితర వివరాలను సమగ్రంగా తెలుసుకోవచ్చు.
ప్రతి కార్యాలయంలో వివరాలు ఉండాలి..
సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సహాయ పౌర సమాచార అధికారి, సమాచార అధికారి, అప్పిలేట్ అధికారిని నియమిస్తారు. వారి పేర్లు, ఫోన్ నంబర్లను ప్రజలకు కనిపించేలా బోర్డుపై స్పష్టంగా రాసి ఉంచాలి.
తెల్లకార్డు ఉంటే ఫీజు ఉచితం
తెల్లకార్డు ఉన్నవారికి దరఖాస్తు రుసుం ఉచితం. గ్రామస్థాయి సంస్థల్లో అడిగే సమాచారానికి దరఖాస్తు రుసుం లేదు. మండల స్థాయిలో అయితే రూ.5, జిల్లా స్థాయిలో రూ.10 చెల్లించాలి. దీనిని నగదు, డీడీ, బ్యాంక్ చెక్కు, పోస్టల్ ఆర్డర్ రూపంలో చెల్లించవచ్చు. కాగా, అడిగిన సమాచారం మేరకు వివరాలు ముద్రణ రూపంలో ఇచ్చేందుకు అయ్యే ఖర్చు మాత్రం దరఖాస్తుదారుడి నుంచే వసూలు చేస్తారు. సాధారణంగా దరఖాస్తు ఫీజుతో పాటు ముద్రణ రూపంలో సమాచారం కోరితే పేజీకి రూ.2 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. సీడీ ద్వారా సమాచారం కోరితే రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. రికార్డులు పరిశీలన విషయంలో మొదటి గంటకు ఉచితం, ఆపై ప్రతి గంటకు రూ.5 చెల్లించాలి.
సమాచారం కోరే పద్ధతి..
సమాచారం కావాల్సిన వారు సంబంధిత కార్యాలయంలో సమాచార అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు తెల్లకాగితంపై రాస్తే సరిపోతుంది. రాయడం తెలియకపోయినా.. సమాచారం సక్రమంగా కోరే అవగాహన లేకపోయినా.. సంబంధిత పౌర సమాచార అధికారి తగిన సహాయం చేస్తారు. కోర్టు పరిశీలనలో ఉన్న సమాచారం, కేబినేట్ మీటింగ్‌లు, రికార్డులు, మంత్రులు, వారి కార్యదర్శుల నిర్ణయాలు, వ్యక్తిగత భద్రతకు భంగం కలిగించే సమాచారం ఇచ్చేందుకు నిరాకరించవచ్చు. అయితే, అవి ప్రజా ప్రయోజనాలకు సంబంధించినవైతే తప్పక ఇవ్వాల్సి ఉంటుంది.
స.హ. చట్టంపై అవగాహన కల్పించాలి
సామాన్యులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. సామాన్యులు వివిధ కార్యాలయాల సమాచారం కోసం కాళ్లరిగేలా తిరిగిన సందర్భాలు అనేకం. అలాగే సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్నవారికి నిర్ణీత గడువులోగా సమాచారం అందించాల్సి ఉంటుంది.
– వడ్డెపల్లి మల్లేశం, ఐకాస మండల చైర్మన్, హుస్నాబాద్
నిర్ణీత సమయంలో సమాచారం అందించాలి
సమాచారం హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకున్న సమాచారాన్ని నిర్ణీత గడువులోగా దరఖాస్తుదారుడికి అందించాలి. లేని పక్షంలో సంబంధిత పౌర సమాచార అధికారులు బాధ్యుత వహించాలి. దరఖాస్తుదారుడి ఫిర్యాదు మేరకు కోర్టు చట్టరీత్యా వారిపై చర్య తీసుకునే అవకాశం ఉంది.
– భీమా సాహెబ్, న్యాయవాది, హుస్నాబాద్
Comments
Please login to add a commentAdd a comment