= వణుకుతున్న జనం
= చలికి తట్టుకోలేక వృద్ధురాలు మృతి
= ప్రబలుతున్న వ్యాధులు
= కిటకిటలాడుతున్న ఆస్పత్రులు
= అంతంతమాత్రంగా వైద్యసేవలు
= ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వాతావరణంలో భారీ మార్పులతో జనం విలవిలలాడిపోతున్నారు. చలితో వణికిపోతున్నారు. ఫలితంగా వేలాదిమంది రోగాలబారిన పడి ఆస్పత్రుల బాటపట్టారు. జిల్లాలో గత కొద్దిరోజులుగా వాతావరణంలో మార్పులు రావటంతో చలితీవ్రత పెరిగింది. సాధారణంగా 32 డిగ్రీల నుంచి 28 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం 24 నుంచి 22 డిగ్రీలు నమోదవుతోంది. దీంతో జిల్లా అంతటా ముసురేసుకున్నట్లు ఉదయం నుంచి చీకటి అలముకుంది. సన్నని తుంపర్లు, ఈదరుగాలులు వీయటం ప్రారంభించింది. ఫలితంగా జనం చలితీవ్రతకు అల్లాడిపోతున్నారు.
పెరిగిన రోగులు
ఒక్కసారిగా వాతావరణంలో పెనుమార్పులు చోటుచేసుకోవటంతో చిన్నారులు, వృద్ధులు అనారోగ్యం పాలవుతున్నారు. జబ్బుల నుంచి ఉపశమనం పొందేందుకు వైద్యులను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో 74 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 14 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, మూడు ఏరియా ఆస్పత్రులతో పాటు నెల్లూరులో పెద్దాసుపత్రి ఉంది. ఈ ఆస్పత్రుల్లో సాధారణ రోజుల్లో కంటే గత మూడు రోజులుగా రోగాల బారినపడిన వారు ఎక్కువగా వస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు.
జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోజుకు సుమారు 3 వేలమంది వివిధ రోగాలతో వస్తుండగా.. మూడురోజులుగా రోజుకు 5 వేల నుంచి 6 వేలకుపైనే వస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులతో కలుపుకుంటే 9వేల వరకు ఉంటుందని అంచనా. గూడూరులోని ఎగువవీరారెడ్డిపల్లికి చెందిన పుండ్ల తిరుపతమ్మ(75) చలిగాలులకు తట్టుకోలేక సోమవారం తెల్లవారుజామున మృతిచెందింది.
విజృంభించిన వ్యాధులు
చలితీవ్రతకు చిన్నారులు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. జలుబు, దగ్గు, జ్వరంతో పాటు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో ఎక్కువమంది ఆస్పత్రులకు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. వాతావరణం చల్లగా ఉండటంతో దోమలు అధికమయ్యాయి. దోమకాటుతో మలేరియా జ్వరాలు కూడా విజృంభించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొన్నిచోట్ల సిబ్బంది అందుబాటులో లేకపోవటంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో ప్రైవేటు వైద్యులకు కాసుల వర్షం కురుస్తోంది.
ఎన్నడూ లేనివిధంగా..
తడ : గతంలో ఎన్నడూ లేని విధంగా సోమవారం చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఓ వైపు పొగమంచు కొండ ప్రాం తాలను తలపిస్తుంటే, ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న జల్లులు వాతావరణాన్ని పూర్తిగా మార్చేశాయి. చలికి ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టేందుకు భయపడుతున్నారు. రహదారిపై వాహనాలు నడిపై డ్రైవర్లకు రోడ్డు సరిగా కనిపించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఇక్కడి వాతావరణం ఉటీ, కొడె కెనాల్, మంచుతో కూడిన కొండ ప్రాంతాలను తలపిస్తున్నాయి. మంచు కారణంగా చిన్న పిల్లలు, వృద్ధులే కాకుండా ఆరోగ్య వంతులు కూడా అనార్యోగం పాలవుతున్నారు. వృద్ధు లు, ఆస్త్మా వ్యాధిగ్రస్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఎంతో అవసరమైన పనులు ఉంటే తప్ప వీరు వీరితో పాటు చిన్న పిల్లలు సరైన రక్షణ పద్ధతులు పాటించకుండా బయటకు రావద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
వీడని మంచు
కావలి: ఆకాశం మేఘావృతం కావడంతో పాటు మధ్యాహ్నం 11 గంటల వరకు పట్టణంలో కురుస్తున్న మంచు సోమవారం వీడలేదు. దీంతో మధ్యాహ్నం వరకు జనసంచారం తక్కువగా కనిపించింది. 10 గంటల వరకు ఆకాశం మేఘావృతం కావడంతో పట్టణంలో చిమ్మ చీకట్లు అలముకున్నాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షసూచన ఉన్నప్పటికీ అందుకు భిన్నంగా మంచు కురుస్తూ చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది.
అధికమైన చలి తీవ్రత
అల్లూరు : బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంగా సోమవారం వేకువ నుంచి మండలంలో చిరుజల్లులు మొదలయ్యాయి. చలిగాలులు అధికంగా వీస్తుండటంత ప్రజలు చలికి వణికిపోతున్నారు. స్వెటర్లు, మఫ్లర్లు ముఖాలకు ధరించి తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు చలిగాలులు అధికంగా ఉండడంతో ప్రజలు అల్లాడిపోయారు. దీంతో వ్యవసాయ పనులకు ఆటంకం ఏర్పడింది.
జిల్లాలో వర్షాలు
నెల్లూరు (రెవెన్యూ): బంగళాఖాతంలో ఏర్పాడిన అల్పపీడన ప్రభావంగా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. రాబోవు 24 గంటల్లో వర్షాలు అధికంగా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. చిన్నపాటి వర్షానికే నగరంలోని రోడ్లల్లో నీరు నిలిచింది. దీంతో పాదచారులు, వాహన చోదకులు ఇబ్బందులు పడ్డారు.
సోమవారం జిల్లావ్యాప్తంగా 1.5 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదైంది. సూళ్లూరుపేట లో 7.6 మి.మీ వర్షపాతం నమోదైంది. అల్లూరులో 4.2, విడవలూరు 3, కొడవలూరు 1.8, పొదలకూరు 1.2, నెల్లూరు 1.2, కోవూరు 3, ఇందుకూరుపేట 2, టీపీగూడూరు 4.4, మనుబోలు 1.8, గూడూరు 2.6, సైదాపురం 1.8, వెంకటగిరి 1.4, బాలాయపల్లి 1.2, ఓజిలి 1.6, చిల్లకూరు 2.6, కోట 3.2, వాకాడు 4.2, చిట్టమూరు 4.8, నాయుడుపేట 2.2, పెళ్లకూరు 2.4, డీవిసత్రం 6.2, తడ మండలంలో 4.2 మి.మీ వర్షపాతం నమోదైంది.
జాగ్రత్తలు తీసుకోవాలి
కాలుష్యంతో పర్యావరణం దెబ్బతిని రుతువులు మారిపోయాయి. మంచు కాలంలో విపరీతంగా మంచుకురువటం.. వానాకాలంలో అధికవర్షాలు పడటం.. ఎండాకాలంలో ఎక్కువ ఎండ లు కాయటం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఎక్కువ మంచు. ఇది చాలా ప్రమాదకరమైంది. చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలి.
= వాకింగ్ చేసేవారు ఉదయం 7 గంటల పైన చేయాలి.
= స్వెట్టర్లు, శాలువాలు, మంకీక్యాప్, చేతిక గ్లౌజులు వాడాలి.
= కోల్డ్ క్రీమ్‌లు, గ్లిజరిన్ సోపులు వాడాలి.
= నీటిని వేడిచేసుకుని తాగాలి. చల్లని ఆహార పదార్థాలు తీసుకోవటం మంచిదికాదు.
= రాత్రిపూట నివాసాల్లో హీటర్లు పెటుటకోవాలి.
- ఈదూరు సుధాకర్, సీనియర్ పబ్లిక్‌హెల్త్ అధికారి.
వామ్మో.. చలి
Published Tue, Dec 30 2014 8:17 AM | Last Updated on Sat, Sep 2 2017 6:59 PM
Advertisement
Advertisement