సమాజంలో మహిళ పురుషుడితో పాటు సమానంగా ఎదగడానికి చదువు ఒక్కటే మార్గం. చదువుతోనే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. మహిళలు భరించేతత్వం వీడి ప్రశ్నించేతత్వం పెంచుకున్నప్పుడే అన్ని రంగాల్లో రాణించగలరు’ అని యాదాద్రి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జి. గీతారెడ్డి తెలిపారు. మహిళా సాధికారత– సమాన అవకాశాలు అనే అంశంపై ‘సాక్షి’కి పలు విషయాలు వెల్లడించారు. వివరాలు ఆమె మాటల్లోనే..
సాక్షి, యాదాద్రి : ఇంటర్ చదువుతుండగానే నాకు వివాహమైంది. కుటుంబ సభ్యులు అందించిన ప్రోత్సాహంతోనే ఉన్నత చదువులు చదివినా. 1990లో మొదటిసారిగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరా. 1995లో గ్రూప్–2 అధికారిగా ఎంపికై డిప్యూటీ తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2014 వరకు మహబూబ్‌నగర్‌లో మెప్మా పీడీగా పని చేశా. 2014లో యాదగిరిగుట్ట దేవస్థానం ఈఓగా వచ్చాను. మహిళలు అన్నిరంగాల్లో రాణించలేరని నాతో చాలా మంది అన్నారు. ఆ మాటలను నేటి మహిళలు కొట్టిపడేస్తున్నారు.
రిజర్వేషన్లు 50శాతానికి పెంచాలి
సమాజంలో సగభాగం ఉన్న మహిళలకు అన్నింటిల్లో సమాన అవకాశాలు కల్పించాలి. ప్రధానంగా 33శాతంగా ఉన్న రిజర్వేషన్లను 50శాతానికి పెంచాలి. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. అయితే మహిళలు చదువును మధ్యలో ఆపివేయకుండా ఉన్నత చదువులు చదివి తన కాళ్లపై తాను నిలబడగలిగే స్థితికి ఎదగాలి. ఉద్యోగాలు సంపాదించి ఆర్థిక స్వాలంబన సాధించాలి. ప్రస్తుతం ప్రభుత్వాలు మహిళలకు అనేక చట్టాలను ప్రవేశపెట్టింది. అయితే కుటుంబంలో, సమాజంలో మహిళలపై ఇంకా వివక్ష ఉంది. కొన్నిచోట్ల రెండో తరగతి పౌరులుగా చూస్తున్నారు. మనస్సుల్లో మార్పు రావాలి. కుటుంబంలో మగపిల్ల వాడితో సమానంగా ఆడపిల్లను చూడాలి. అక్కడ నుంచే వివక్ష తొలగిపోతోంది. మార్పు ప్రారంభమవుతుంది. విద్య, వైద్యం వంటి విషయాలపై శ్రద్ధ పెట్టాలి.
గృహహింసను ఎదుర్కోవాలి
ఇంకా కొన్నిచోట్ల గృహహింస చోటు చేసుకుంటుంది. గృహ హింసను సహించి ఊరుకునే పరిస్థితి నుంచి ఎదుర్కోవడానికి ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలి. చదువుకోవాలి. ఆర్థికంగా ఎదగాలి. మరింతగా ముందుకుసాగాలి. నలుగురున్న సమాజంలో ఉన్నామన్న భావన పెంపొందించుకోవాలి. పురుషుల్లో తోటి మనిషిని వేధించే మనస్తత్వం మారాలి.
సతాయించాలనే విధానం తొలగిపోవాలి. గృహహింసను పట్టించుకోకుండా నాకేమిటి అనే బాధ్యతారాహిత్యాన్ని సమాజం వీడనాడాలి. చట్టాలు మరింత వేగంగా పనిచేయాలి.
లింగనిర్ధారణ పరీక్షలు మానుకోవాలి
సమాజంలో మహిళలు ఎక్కువగా చదువును మధ్యలోనే ఆపివేస్తున్నారు. చదువు ఆపివేయడానికి పలు కారణాలు ఉన్నాయి. ఆడపిల్లలకు చదువు ఎందుకులే అనే భావన నుంచి చదివించాలని అనే ఆలోచనలోకి తల్లిదండ్రులు వచ్చారు. ఇది శుభసూచకం. అయితే ప్రాథమిక స్థాయిలోనే విద్యను ఆపివేయకుండా ఉన్నత చదువులు చదవాలి. బ్రూణహత్యలను నివారణకు ఉన్న చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి. లింగనిర్ధారణ చేసే డాక్టర్లను, స్కానింగ్ సెంటర్లను గుర్తించి కఠినంగా శిక్షించి, ఆవిషయాన్ని సమాజానికి తెలపాలి. లింగనిర్ధారణ పరీక్షలు ఆపితే ఆడపిల్లల నిష్పత్తి పెరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment