ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో
జిల్లాదే చివరిస్థానం
నల్లగొండ అర్బన్ : ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో జిల్లా ఉత్తీర్ణతా శాతం మళ్లీ నిరాశే మిగిల్చింది. రాష్ట్ర సగటు ఉత్తీర్ణత 55.62 శాతం ఉండగా మన జిల్లా 12 శాతం తక్కువతో రాష్ట్రంలో చివరి స్థానానికి పరిమితమైంది. గత సంవత్సరంతో పోలిస్తే ఫలితాలు ఒక శాతం తగ్గాయి. ఈ ఏడాది 43 శాతం ఫలితాలు సాధించారు. కాగా ఒకేషనల్ విభాగంలో 3917 మంది విద్యార్థులు హాజరుకాగా 2059 మంది ఉత్తీర్ణతతో 53 శాతం ఫలితాలు సాధించారు. రాష్ట్రంలో 2వ స్థానం లభించింది.
బాలురు 2502 మందికిగాను 1244 మంది (50 శాతం), బాలికలు 1415 మంది పరీక్షకు హాజరుకాగా 815 మంది (58 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఈసారి జిల్లాలో 33 మోడల్ స్కూళ్ల నుంచి విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాసినప్పటికి జిల్లా కేంద్రంలోని ఇంటర్మీడియట్ అధికారుల వద్ద వారి ఫలితాల వివరాలు లేకపోవడం విశేషం. మోడల్ స్కూల్ బోర్డు అధికారులే ఫలితాలు తెలుపుతారని ఆర్‌ఐఓ కార్యాలయం వారు సమాధానమిస్తున్నారు. అదే విధంగా రెసిడెన్షియల్ కాలేజీల ఫలితాల వివరాల సమాచారం కూడ అందుబాటులో లేదు. దామరచర్లలోని గిరిజన సంక్షేమ కాలేజీలో 33మంది విద్యార్థులు హాజరుకాగా నూరుశాతం ఉత్తీర్ణత సాధించారు.
జనరల్ విభాగంలో బాలికలే టాప్...
ఇంటర్ ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో ఈ సంవత్సరం 37602 మంది విద్యార్థులకుగాను 15982 మంది (43 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 18827 మంది బాలురు హాజరుకాగా 6673 మంది (35 శాతం) ఉత్తీర్ణత సాధించారు. 18827 మంది బాలికలకుగాను 6673 మంది (50 శాతం) ఉత్తీర్ణులైనారు. బాలురకంటే బాలికలే 15 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు.
ఇవి నాణ్యమైన ఫలితాలే
జిల్లాలో విద్యార్థులు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో సాధించిన 43శాతం ఉత్తీర్ణతను నాణ్యమైన ఫలితాలుగా భావిస్తున్నట్లు ఆర్‌ఐఓ ఎన్. ప్రకాశ్‌బాబు అభిప్రాయపడ్డారు. ఆయా కాలేజీల్లో వెంటనే ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు సమీక్షా సమావేశం నిర్వహించుకొని ఫలితాలను విశ్లేషించాలని ఆయన ఆదేశించారు. ఈ నెల 25వ తేది నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. మే 25 నుంచి అడ్వాన్స్‌డ్ పరీక్షలు, సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారని, విద్యార్థులను తగు విధంగా శిక్షణ ఇచ్చి పరీక్షలకు సన్నద్ధం చేయాలని కోరారు.
జిల్లాలో ఉత్తమ మార్కుల సాధించిన విద్యార్థుల వివరాలు
ఎంపీసీ : టి. వంశికృష్ణ 465 (గీతాంజలి జూనియర్ కాలేజీ ,నల్లగొండ), అంబటి విద్యాసాగర్ 465 (శ్రీనిధి జూనియర్ కాలేజీ, సూర్యాపేట), తెల్లాకుల జయశ్రీ 465 (శ్రీనిధి జూనియర్ కాలేజీ, కోదాడ), పి.సోనియా, బి.శిరీష, ఎన్.సాయి, డి.సాయిప్రణిత్‌లు 464 (గౌతమిజూనియర్ కాలేజీ నల్లగొండ), వి.అజయ్ 464 (ప్రగతి జూనియర్ కాలేజీ, నల్లగొండ), ఎస్.స్వాతి 464 (ప్రగతి జూనియర్ కాలేజీ నల్లగొండ), లోకేష్‌రెడ్డి 463 (ప్రగతి జూనియర్ కాలేజీ నల్లగొండ), పి.లూర్థువసంత 461 (లిటిల్‌ప్లవర్ బాలికల జూనియర్ కాలేజీ నల్లగొండ), పి.జ్యోతి 456 (లిటిల్‌ప్లవర్ బాలికల జూనియర్ కాలేజీ, నల్లగొండ),
కె.ఉపేందర్ 456 (దీప్తి జూనియర్ కాలేజీ నల్లగొండ), ఎన్. నరేష్ 454 (ఆల్ఫా జూనియర్ కాలేజీ నల్లగొండ), ఎం. రమేష్ 454 (నల్లగొండ కాలేజీ).బైపీసీ : బి. సిరి 433 (ప్రగతి జూనియర్ కాలేజీ, నల్లగొండ), కె.సోని 433 (ప్రగతి జూనియర్ కాలేజీ, నల్లగొండ), ఆమాతున్‌నూర్ అర్షియా 433 (గౌతమి జూనియ ర్, కాలేజీ నల్లగొండ), పున్న మల్లిక 432 (గీతాంజలి జూనియర్ కాలేజీ, నల్లగొండ), సీహెచ్.హేమాంజలి 432 (ప్రగతి జూనియర్ కాలేజీ, నల్లగొండ), వి.శ్రావణి 432 (ప్రగతి జూనియర్ కాలేజీ, నల్లగొండ), బి.సౌమ్య 432 (ప్రగతి జూనియర్ కాలేజీ, నల్లగొండ), జే.సాయిశ్రీ 431 (ఆల్ఫా జూనియర్ కాలేజీ, నల్లగొండ), కె.భవాని 430 (దీప్తి కాలేజీ, నల్లగొండ), పి.మౌనిక 427 (నల్లగొండ, కాలేజీ).
సీఈసీ : హజ్రాకుల్‌సుం 474 (ఆల్ఫా జూనియర్ కాలేజీ, నల్లగొండ)
ఎంఈసీ, ఎం.దీప్తి 478 (లిటిల్‌ప్లవర్ బాలికల జూనియర్ కాలేజీ, నల్లగొండ), వినీత 475 (లిటిల్‌ప్లవర్ బాలికల జూనియర్ కాలేజీ, నల్లగొండ), కె.రమ్య 471 (లిటిల్‌ప్లవర్ బాలికల జూనియర్ కాలేజీ, నల్లగొండ), జి. శశాంక్‌రెడ్డి 465 (ఆల్ఫా జూనియర్ కాలేజీ, నల్లగొండ), బి. అనిల్‌కుమార్ 465 (నల్లగొండ కాలేజీ),
హెచ్‌ఈసీ : ఆర్. ఉపేందర్ 450 (ఆల్ఫా జూనియర్ కాలేజీ నల్లగొండ)
ఎంఎల్‌టీ : సీహెచ్. తరుణ్‌కుమార్ 436 (ఆల్ఫా జూనియర్ కాలేజీ నల్లగొండ)
ప్రభుత్వ కాలేజీల్లో పడిపోయిన ఫలితాల శాతం
జిల్లాలోని పలు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ సంవత్సరం ఇంటర్ ఫలితాల శాతం ఘోరంగా దెబ్బతింది. జీజేసీ కోదాడలో కేవలం 12.22 శాతం ఉత్తీర్ణత సాధించారు. అక్కడ 90 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా కేవలం 11 మంది ఉత్తీర్ణులయ్యారు. గత కొన్నేళ్లుగా 90 శాతానికి పైగా ఫలితాలతో అగ్రస్థానంలో నిలిచిన జీజేసీ నెమ్మికల్‌లో ఈ సంవత్సరం 167 మందికి గాను 23 మంది ఉత్తీర్ణతతో 13.77 శాతం ఫలితాలు సాధించారు. 94.53 శాతం ఉత్తీర్ణతతో జీజేసీ సంస్థాన్ నారాయణ్‌పూర్ ప్రథమ స్థానంలో ఉండగా, 87.90 శాతంతో జీజేసీ నడిగూడెం 2వ స్థానంలో నిలిచింది. 84.29 శాతం ఉత్తీర్ణతతో జీజేసీ విజయపురి నార్త్ (నాగార్జునసాగర్) తృతీయ స్థానం పొందింది.
ఎయి‘‘డెడ్’’..
జిల్లాలోని నాలుగు ఎయిడెడ్ కాలేజీల్లో కేవలం 12.02 శాతం ఉత్తీర్ణతే నమోదయ్యింది. 366 మంది విద్యార్థులకుగాను 44 మంది పాసయ్యారు. సూర్యాపేటలోని రాజారాం మెమోరియల్ జూనియర్ కాలేజీలో 70 మంది పరీక్ష రాయగా ఒకే ఒక్కడు ఉత్తీర్ణుడయ్యాడు.
అవాంఛనీయ పోటీలో సమిదలైన విద్యార్థులు
జిల్లాలోని కొన్ని జూనియర్ కాలేజీల మధ్య నెలకొన్న అవాంఛనీయ, అనారోగ్యకరమైన వాతావరణం వల్ల పలువురు విద్యార్థులు సమిదలు కావాల్సి వచ్చిందని ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల తీరును పలువురు విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో ‘ఇదిగో తోక అంటే అదిగో పులి’ అన్న చందంగా పుకార్లు షికార్లు చేయడంతో అధికారుల పై అధికారులు వరుసపెట్టి కొన్ని సెంటర్లను తనిఖీల పేరుతో హడావిడి చేయడంతో పలువురు విద్యార్థులు హడలిపోయి మానసికంగా బెంబెలేత్తినట్లు సమాచారం. జిల్లా ఫలితాల శాతం తగ్గడానికి ఇది కూడా ఒక కారణమని పేర్కొంటున్నారు. పరీక్షలు జరుగుతున్న సమయంలోనే ఈ పరిస్థితిపై సాక్షి ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన విషయం తేలిసిందే. ముఖ్యంగా సూర్యాపేట ప్రాంతంలోని కొన్ని కాలేజీల వారు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో పలు సెంటర్లపై ఇటు బోర్డు అధికారులు, రెవెన్యూ, పోలీసు అధికారుల తాకిడి తీవ్రమైంది. కాపీ అంటే తెలియని సగటు విద్యార్థి సైతం ఈ హడావిడిలో వచ్చిన సమాధానాలను సమగ్రంగా రాయలేక నష్టపోయినట్లు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రథమంలో..అథమం
Published Thu, Apr 23 2015 12:22 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement