జీవితంలో చదువు ఒక భాగమే.. చదువే జీవితం కాదు. మార్కులే ప్రతిభకు గీటురాయి కాదు. పరీక్షల్లో ఫెయిలయ్యామని కుంగిపోయి.. ఇక జీవితమే వ్యర్థం అనుకుని కొందరు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటే .. తమ ప్రాణం కంటే మిన్నగా భావించి మిమ్మల్ని పెంచి పెద్దచేసిన అమ్మానాన్నలకు కన్నీళ్లు మిగిల్చి వెళ్లడమేనా మీ బహుమానం..? చదువుల బాటలో ఎదురయ్యే ఒత్తిళ్లు, ఇబ్బందులను ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి. ఒకసారి కాకపోతే.. మరోసారైనా నెగ్గుతామన్న మనోధైర్యంతో ముందడుగు వేయాలి. కొండంత సమస్యనైనా చిరు ఆలోచనతో పరిష్కరించుకోవచ్చు.
పరాజయాలనుపట్టించుకోకండి..
అవి సర్వసాధారణంఅవే జీవితానికి మెరుగులు దిద్దేవి. ఓటములు లేని జీవితం ఉండదు– స్వామి వివేకానంద
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎవరి జీవితమూ పూల పాన్పు కాదు. జీవితం అన్నాక ఒడిదుడుకులు, ఆటుపోట్లు, ఎత్తుపల్లాలు, జయాపజయాలు, కష్ట సుఖాలు సహజం. ప్రతి మనిషిని నిత్య జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఇవన్నీ పలకరిస్తూనే ఉంటాయి. ఏ కష్టాన్నీ ఎదుర్కోకుండా ఉన్నత స్థాయికి ఎదిగిన వారు ప్రపంచంలోనే లేరన్న విషయాన్ని గ్రహించాలి. చిన్నచిన్న కారణాలకు ప్రాణాలను తీసుకుంటున్న వారు ఒక్క క్షణం ఆలోచించాలి. విఫలమైన వాళ్లంతా ఈ ప్రపంచానికి వీడ్కోలు చెబితే.. ఈ లోకంలో ఎవరూ మిగలరు. నిలబడి గెలిచే అవకాశాలు ఏదో ఒక దశలో ఉంటాయన్న సానుకూల దృక్పథాన్ని అలవరచుకోవాలి. కష్టాలకు ఎదురొడ్డి.. కన్నీళ్లను దిగమింగి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారిని ఆదర్శంగా తీసుకోవాలి. వారి జీవితాన్ని చదివితే మనోధైర్యం లభిస్తుంది. కష్టాలను, ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదుర్కోవచ్చో తెలుస్తుంది. తొందరపాటు నిర్ణయం తీసుకునే ముందు.. అమ్మానాన్నలు మీపై పెట్టుకున్న కొండంత నమ్మకం గురించి ఆలోచించండి. మీరు ప్రాణాలు తీసుకుంటే.. మీతోపాటే కన్నవారి ప్రాణాలూ తీసుకెళ్లినట్లేనని గుర్తుంచుకోండి.
అందరి కృషి అవసరం..
ప్రస్తుతం విద్యారంగంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో సమాజంతో సంబంధం లేకుండా విద్యార్థులు ఎదుగుతున్నారు.నాలుగు గోడల మధ్య తిరుగుతూ నిస్పృహతో నిండిపోతున్నారు. ఉదయం లేచింది మొదలు.. రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు పుస్తకాలే చేతబడుతున్నారు. కనీసం అరగంట కూడా విశ్రాంతి దొరకట్లేదు. మార్కులే జీవితమని కొన్ని విద్యాసంస్థలు, కొంత మంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఇది బాధాకరం. ఈ అంశంపై విస్తృతంగా చర్చ సాగాలి. మేధావులు ఆలోచించాలి. విద్యాసంస్థల్లో సదస్సులు నిర్వహించి విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని నింపడానికి అందరూ కృషిచేయాలి. అవసరమైతే వారంలో ఒకసారి మానసిక నిపుణులతో ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. చదువుతోపాటు.. జీవితమూ ముఖ్యమేనన్న భావన వారిలో కలిగించాలి. అప్పుడే తొందరపాటు చర్యకు పుల్‌స్టాప్ పెట్టవచ్చు. తల్లిదం్ర డుల గర్భశోకాన్ని దూరం చేయవచ్చు.
జీవితం అవకాశాల గని..ఓటమి విజయంతో సమానం
పిల్లల్లో అనవసర, అనారోగ్యకర పోటీతత్వాన్ని పెంపొందిస్తున్నాం. ఒక పిల్లవాడికి నచ్చని అంశం మీద.. మరొక పిల్లోడితో పోల్చడం తరచు చూస్తున్నాం. దీన్ని సాధారణంగా సూడో కాంపిటీషన్‌గా పిలుస్తాం. మార్కులు, ర్యాంకులు రాకుంటే జీవితమే వ్యర్థమనే రీతిలో ఇటు తల్లిదండ్రులు, విద్యాసంస్థలు విద్యార్థులను మలుచుతున్నాయి. దీనివల్ల ముఖ్యంగా టీనేజ్ వయసులోని పిల్లలు విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. ఒత్తిడి సర్వసాధారణం. ఇది దరిచేరకుండా చేయడం కష్టం. నియంత్రించే, అధిగమించే మార్గాలు లేకున్నా.. ఒత్తిడిని తట్టుకునే శక్తిమంతుల్లా పిల్లలను తీర్చిదిద్దాలి. ఇటీవల బాగా పెరిగిపోతున్న విద్యార్థుల బలవర్మరణాలు, ఒత్తిడికి చిత్తువుతున్న ఘటనలు నేర్పుతున్న పాఠమిది. జీవితాన్ని ఒక గేమ్‌లా చూస్తే గెలుపు మార్గాలు పుష్కలం. దాన్నే జీవన్మరణ సమస్యగా భావిస్తే విజయ తీరాలకు చేరే అవకాశాలు క్షీణిస్తాయి. జీవితాన్ని ఎన్నో అవకాశాల గనిగా అందరూ గుర్తించాలి.
పరీక్ష అనేది సముద్రంలోని నీటిబొట్టు లాంటిదే తప్ప దశ దిశను నిర్ణయించేది ఏమాత్రం కాదు. కేవలం నా తీరు వల్లే పరీక్షల్లో తప్పాను.. అనే ప్రతికూల దృక్పథాన్ని పిల్లల్లో దూరం చేయాలి. పరీక్ష ఫలితం.. విద్యార్థి చదివిన తీరు, ప్రతిభ, చదివిన వాతావరణం, తల్లిదండ్రుల ప్రభావం, పేపర్లు దిద్దేవారిపైనా ఆధారపడి ఉంటుంది. ఇలాంటి కారణాలను శోధించడం మానేసి ఇతర అవకాశాల కోసం అన్వేషించాలి. ఫెయిల్ అనేది.. ఎప్పుడు మన పొరపాటు కాదని భావించాలి. తొలి అవకాశంలోనే ఎవరూ నెగ్గలేరు. ఓటమితో ఒడిదుడుకులనే తట్టుకునే శక్తి లభిస్తుంది. ఇది విజయంతో సమానమని నేర్పించడం ముఖ్యం. ఓటమి ఎక్కువ అనుభవాలను నేర్పుతుంది. ఇలా సానుకూల దృక్పథాన్ని, పరిణతిని పిల్లల్లో పెంపొందిస్తే ఏదో ఒక దశలో విజయం వరించడం తథ్యం. ప్రతి పిల్లవాడికి సున్నితత్వం ఉంటుంది. ఈ విషయాన్ని సూడో కాంపిటీషన్ సృష్టిస్తున్న విద్యాసంస్థలు, వ్యక్తులు గుర్తుపెట్టుకోవాలి. హేళన చేస్తే, అవమానం చేస్తే.. పిల్లల్లోని ప్రతిభ బయటకు వస్తుందన్న పాతకాలపు ఆలోచన విధానాలను అందరూ మానుకోవాలి. – డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి,ప్రముఖ మానసిక వైద్య నిపుణులు
తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
♦ ప్రస్తుత సమాజంలో విద్యార్థుల్లో సున్నితత్వం పెరిగింది. వారిని మానసికంగా దృఢంగా మార్చడానికి తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలి.
♦ పిల్లలకు సమస్యలు తెలియకుండా పెంచడం
సరికాదు. పిల్లలతో కలిసి సమస్యలపై చర్చించాలి. వాటిని ఎలా పరిష్కరించుకున్నామో తెలియజేయాలి. తద్వారా సమస్యలు పరిష్కరించుకోగలమనే నమ్మకం వారిలో కలుగుతుంది.
♦ నోటి వద్దకు అన్నం వచ్చేలా.. ఎలాంటి సమస్యదరిచేరకుండా అన్ని తల్లిదండ్రులే దగ్గరుండిచూసుకోవడం సరికాదు. స్వతహాగా తమపనులను తామే చేసుకునేలా పెంచాలి. చిన్నప్పటి నుంచే కష్టాలనూ ఎదుర్కొనేలా మానసికంగాసిద్ధం చేయాలి.
♦ విద్యార్థులను తోటి విద్యార్థులతో పోల్చి మాట్లాడడం సరికాదు. పలానా వ్యక్తికి ఎక్కువ.. నీకు తక్కువ మార్కులు వచ్చాయని ఏనాడూ మందలించకూడదు. మార్కులకు.. ప్రతిభకు లింకు పెట్టకూడదు.
♦ అందరికీ చదువు అబ్బదు. విద్యార్థులుపెరిగిన నేపథ్యం, పరిసరాల ప్రభావం,ఆసక్తులు తదితర కారణాల వల్లచదువుపై ధ్యాస పెట్టకపోవచ్చు.
♦ కాకపోతే ఏదో అంశంలో ప్రతి ఒక్కరికీ టాలెంట్ ఉంటుంది. దీన్ని తల్లిదండ్రులు గుర్తించి ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలకు చేరవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment