
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) బ్రేకులు వేసింది. ప్రాజెక్టు నిర్మాణంపై స్టే విధిస్తూ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వరం నిర్మాణానికి అటవీ, పర్యావరణ అనుమతులు లేవని, పనులను ఆపాలని కోరుతూ సిద్దిపేటకు చెందిన హయాతుద్దీన్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గత కొన్ని నెలలుగా విచారణ జరిపిన ట్రిబ్యునల్ గురువారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
అనుమతులు అవసరం లేదు
కేసు సందర్భంగా పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలపై ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వివరణ ఇచ్చారు. అంబేడ్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన కాళేశ్వరం పథకాన్ని సాగునీటి అవసరాలకే కాకుండా తాగునీటి అవసరాల కోసం చేపట్టినట్టు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ద్వారా తాగునీటికే అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు ఎలాంటి పర్యావరణ అనుమతులు అవసరం లేదని వివరించారు. పర్యావరణ, అటవీ అనుమతులు వచ్చాక అప్పుడు సాగునీటి అవసరాలకు కూడా వినియోగిస్తామని వెల్లడించారు. ప్రాజెక్టుకు ప్రస్తుతం స్టేజ్–1 అనుమతులు లభించాయని, త్వరలోనే పూర్తిస్థాయి పర్యావరణ, అటవీ అనుమతులు లభిస్తాయని ట్రిబ్యునల్‌కు నివేదించారు.
ప్రభుత్వం చట్టాన్ని ఉల్లంఘిస్తోంది
ప్రాజెక్టు నిర్మాణంలో ప్రభుత్వం అటవీ సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని పిటిషనర్ల తరఫు న్యాయవాది సంజయ్ ఉపాధ్యాయ వాదించారు. ఈ ప్రాజెక్టు పరిధిలోని ఏడో లింక్‌లో 21, 22, 27 ప్యాకేజీల్లో 319 హెక్టార్ల అటవీ భూమిని ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండా వినియోగిస్తోందని తెలిపారు. మొత్తంగా ప్రాజెక్టు పరిధిలో 672.60 హెక్టార్ల అటవీ భూములను వినియోగిస్తోందని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రాజెక్టులో ప్రధాన భాగమైన మేడిగడ్డ వద్ద నిర్మిస్తున్న గ్రావిటీ కెనాల్ పూర్తిగా రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉందని తెలిపారు. దీనికి అటవీ అనుమతులు లేవన్నారు. పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలపై స్పందిస్తూ... ప్రాజెక్టు పరిధిలో వచ్చే అటవీ భూముల వివరాలను తమకు అందించాలని గతంలోనే ట్రిబ్యునల్ ఆదేశించింది. దీంతో అటవీ భూములపై ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ అఫిడవిట్‌లో ప్రభుత్వం ప్రాజెక్టు లక్ష్యాలను వివరించింది. ప్రాజెక్టు నిర్మాణంలోని కాంట్రాక్టర్లకు సరిహద్దులు తెలియక అటవీ ప్రాంతంలో కొంతమేర ఉల్లంఘనలు జరిగాయని పేర్కొంది. అయితే వాటిని వెంటనే గుర్తించి తొలగించడంతోపాటు అటవీశాఖకు జరిమానా కూడా చెల్లించినట్టు తెలిపింది.
వాటితో నిర్మాణాలు చేపట్టలేరు
ప్రభుత్వం చెబుతున్నట్టుగా స్టేజ్–1 అనుమతులతో ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టలేరని, ప్రాజెక్టు నిర్మాణ పనులకు ఈ అనుమతులు సరిపోవని పిటిషనర్ల తరఫు న్యాయవాది సంజయ్ చెప్పారు. అటవీ భూముల్లో నిర్మాణాలు చేపడుతున్నారు కాబట్టి దీనికి పూర్తి పర్యావరణ, అటవీ అనుమతులు అవసరమని వాదించారు. అటవీ భూముల వివరాల విషయంలో కూడా ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని చెప్పారు. దీనిపై ట్రిబ్యునల్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దశాబ్దకాలం నుంచి ఈ ప్రాజెక్టును చేపడుతున్నామని చెబుతున్న తరుణంలో ప్రాజెక్టు వివరాలను వేళ్ల మీద చెప్పాల్సింది పోయి.. అటవీ భూముల వివరాల్లో స్పష్టత లేదంటే ఎలా అని ప్రశ్నించింది.
ఇది ఉల్లంఘనే..
వాదనలు విన్న ట్రిబ్యునల్ క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు నిర్మాణానికి అటవీ భూములను ఎలాంటి అనుమతులు లేకుండా వినియోగిస్తున్నారంటూ ప్రాజెక్టు నిర్మాణంపై స్టే విధించింది. ప్రాజెక్టుకు పూర్తిస్థాయి అనుమతులు వచ్చే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని, చెట్లు నరకరాదని, బ్లాస్టింగ్ లాంటి పనులు చేపట్టరాదని ఆదేశించింది. అన్ని రకాల అనుమతులు పొందిన తర్వాత ప్రభుత్వం తమను ఆశ్రయించవచ్చని, అప్పటి వరకు ప్రాజెక్టును ఆపాలని స్పష్టం చేసింది. అనుమతులు వచ్చాక సంప్రదిస్తే తాము జారీ చేసిన ఉత్తర్వులను సవరించడానికి సిద్ధంగా ఉన్నామని సూచించింది. జస్టిస్ జావేద్ రహీమ్ ఆదేశాల ప్రతులను చదివే సమయంలో ప్రభుత్వం కల్పించుకొని... మధ్యంతర ఉత్తర్వుల అమలును మూడ్రోజులపాటు నిలుపుదల చేయాల్సిందిగా కోరింది. అయితే అందుకు తిరస్కరించిన బెంచ్ తమ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment