
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించేలా విద్యా శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రోజుకు 1 జీబీ డేటా సదుపాయం కల్పిస్తున్న రిలయన్స్ హాట్‌స్పాట్‌ను ఉన్నత పాఠశాలలకు అందిస్తోంది. దాన్ని స్కూళ్లలోని డెస్క్‌టాప్ కంప్యూటర్లకు అనుసంధానం చేయడంతోపాటు టీచర్లకు వైఫై సదుపాయం అందించనుంది.
పాఠ్యాంశాల బోధనలో కొత్త విషయాలను తెలుసుకుని విద్యార్థులకు చెప్పేలా టీచర్లకు ఇది దోహదపడుతుందని పాఠశాల విద్యా కమిషనర్ కిషన్ వెల్లడించారు. కేవలం విద్యా విజ్ఞాన, బోధన సంబంధమైన విషయాలను అందించే 400 వెబ్‌సైట్స్, టీవీ ప్రసారాలను అందుబాటులో ఉంచింది. ప్రసుత్తం రాష్ట్రంలో 4,500 వరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉండగా.. అందులో 130 కంటే ఎక్కువ మంది విద్యార్థులున్న 3,500 స్కూళ్లకు ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తోంది. తర్వాతి దశలో మిగతా పాఠశాలలకు అందించే యోచన చేస్తోంది.