సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ఐపీఎస్ అధికారుల బదిలీలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఒకటిరెండు రోజుల్లో ఇది కొలిక్కి వచ్చి పెద్ద సంఖ్యలో అధికారుల బదిలీలు జరగనున్నాయి. ఈ ప్రభావం రాజధానిలోని మూడు కమిషనరేట్ల పైనా ఉండే అవకాశం ఉంది. సైబరాబాద్, రాచకొండలతో పోలిస్తే హైదరాబాద్‌లో భారీ మార్పులు ఉండనున్నాయి. దాదాపు 11 నెలలుగా పదోన్నతి పొందిన అధికారులు బదిలీ ఉత్తర్వుల కోసం ఎదరు చూస్తున్నారు. సాధారణంగా కమిషనర్ స్థాయి అధికారులకు రెండేళ్లు టెన్యూర్‌గా పరిగణిస్తూ ఉంటారు. ఇది పూర్తయినప్పటి నుంచి బదిలీ ఇప్పుడా.. అప్పుడా..అనే పరిస్థితే ఉంటుంది. నగరంలో ఉన్న మూడు కమిషనరేట్లలోనూ రాచకొండ సీపీ మహేష్ మురళీధర్ భగవత్ ఈ పోస్టులో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన బదిలీ అనివార్యమని వినిపిస్తోంది. మరోపక్క ఆయన త్వరలో అదనపు డీజీగా పదోన్నతి పొందనున్న నేపథ్యంలో అప్పటి వరకు ఇదే పోస్టులో కొనసాగుతారనే వాదనా ఉంది. మరోపక్క నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఈ పోస్టులోకి వచ్చి 22 నెలలే అవుతోంది. దీంతో ఆయన బదిలీ ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్‌కు ఈ స్థాయి టెన్యూర్ కూడా పూర్తి కాలేదు. దీంతో ఈయన బదిలీ అనే ప్రశ్నే ఉత్పన్నం కావట్లేదు. నగర పోలీసు కమిషనరేట్‌లో పని చేస్తున్న ఐపీఎస్ అధికారుల్లో అనేక మందికి గత ఏడాది ఏప్రిల్‌లో పదోన్నతులు వచ్చాయి. నగర అదనపు సీపీగా (నేరాలు) పని చేస్తున్న షికా గోయల్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (ఐజీ) నుంచి అదనపు డీజీగా పదోన్నతి పొందారు. అలాగే తూర్పు మండల డీసీపీ ఎం.రమేష్, పశ్చిమ మండల డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, మధ్య మండల డీసీపీ ఎం.విశ్వప్రసాద్, సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి సైతం ఎస్పీ నుంచి డీఐజీలుగా పదోన్నతి పొందారు. అయినప్పటికీ అప్పటి నుంచి ఎస్పీ స్థాయి పోస్టుల్లోనే కొనసాగుతున్నారు. దక్షిణ మండల డీసీపీగా పని చేసిన అంబర్ కిషోర్ ఝా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వద్ద ఓఎస్డీగా వెళ్ళిన తర్వాత ఈ పోస్టులో ఎవరినీ నియమించలేదు.
కొన్నాళ్ళు అవినాష్ మహంతి, ఆపై రాయకొండ కమిషనర్ సత్యనారాయణ ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు నగర సంయుక్త పోలీసు కమిషర్ స్థాయిలో పరిపాలన, సమన్వయం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పొరుగున ఉన్న రాచకొండలో సంయుక్త సీపీగా విధులు నిర్వర్తిస్తున్న జి.సుధీర్‌బాబు సైతం ఐజీగా పదోన్నతి పొందారు. వీరికి తోడుగా ఇటీవలే సైబరాబాద్‌లోని మాదాపూర్ డీసీపీ ఎ.వెంకటేశ్వర్‌రావుకు డీఐజీగా ప్రమోషన్ వచ్చింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఎనిమిది పోస్టుల్లో మార్పు అనివార్యంగా మారింది. మరోపక్క సిటీలోని ఉత్తర మండల డీసీపీగా పని చేస్తున్న కల్వేశ్వర్ సింగెనవర్ టెన్యూర్ పూర్తికానప్పటికీ.. ప్రస్తుతం ఉన్న అవసరాల దృష్ట్యా ఆయన్ను సీసీఎస్ డీసీపీగా బదిలీ చేస్తారని తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి జీహెచ్‌ఎంసీ ఎన్నికలు కూడా రానుండటంతో ఈ బదిలీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment