ఖమ్మం: విద్యాశాఖలో వింతపర్వం మొదలైంది. సరిపడా ఉపాధ్యాయులు లేని స్కూళ్లకు అధికంగా ఉపాధ్యాయులు ఉన్న పాఠశాల నుంచి డిప్యుటేషన్ వేయాలనేది ఉన్నతాధికారుల ఆదేశం. అయితే దీన్ని సాకుగా తీసుకుని పలువురు అధికారులు ఇష్టానుసారంగా ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు డిప్యుటేషన్లు వేశారనే ఆరోపణలు వస్తున్నాయి.
తమ అనుచరుల అండదండలతో డిప్యుటేషన్ వేయించుకున్న ఉపాధ్యాయులు.. ప్రస్తుతం తాము పనిచేస్తున్న పాఠశాలల నుంచి సంతోషంగా రిలీవ్ కాగా, సాఫీగా పనిచేస్తున్న తమను మరో పాఠశాలకు.. అదీ మారుమూల ప్రాంతాలకు పంపిస్తే ఎలా వెళ్తామని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. తాము ఉన్నచోటు నుంచి కదిలేది లేదని తేల్చి చెపుతున్నారు. మరికొందరు ఉపాధ్యాయులు తమను కదిలించవద్దని పాఠశాల అభివృద్ధి కమిటీలతో, స్థానిక ప్రజాప్రతినిధులతో జిల్లా విద్యాశాఖాధికారికి చెప్పిస్తున్నారు. ఈ తంతు చూసిన విద్యాశాఖ అధికారులు ఏ ఉపాధ్యాయుడికి డిప్యుటేషన్ వేయాలి, ఎవరికి రద్దు చేయాలో తోచక తలపట్టుకునే పరిస్థితి నెలకొంది.
అధికారుల అనుమతి సాకుతో...
‘పదో తరగతి సిలబస్ మారింది. దీనితోపాటు పలు హైస్కూళ్లలో ప్రధాన సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయుల కొరత ఉంది. దీని ప్రభావం పది ఫలితాలపై పడే ప్రమాదం ఉంది. ఇప్పట్లో డీఎస్సీ నిర్వహించే అవకాశం లేదు. దీంతో ప్రత్యామ్నాయ మార్గం అవసరం’ అని జిల్లా విద్యాశాఖాధికారి రాష్ట్ర ఉన్నతాధికారులను కోరారు. దీనిపై స్పందించిన విద్యాశాఖ కమిషనర్ ఎక్కువ ఉపాధ్యాయులు ఉన్న చోటునుంచి అవసరమైన పాఠశాలలకు డిప్యుటేషన్‌పై ఉపాధ్యాయులను పంపించాలని ఆదేశించారు.
దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న హైస్కూళ్లలో ఖాళీగా ఉన్న 466 పోస్టులను గుర్తించారు. వీటిలో అత్యంత అవసరమైన పాఠశాలలను ఎంపిక చేయడంతోపాటు, ఎక్కువ సంఖ్యలో ఉపాధ్యాయులున్న పాఠశాలల నుంచి డిప్యుటేషన్ చేసే అవకాశం ఉన్నవారిని ఎంపిక చేయాలని డీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి డిప్యూటీ డీఈవోలను, ఎంఈవోలను ఆదేశించారు. దీనిని సాకుగా తీసుకొని పలువురు ఎంఈవోలు, డిప్యూటీ ఈవోలు తమ ఇష్టాను సారంగా డిప్యుటేషన్ జాబితా తయారు చేశారనే విమర్శలు వస్తున్నాయి.
అక్కడ ప్రధానోపాధ్యాయులకు తెలియకుండా ఎంఈవోలు, ఎంఈవోలకు తెలియకుండా డిప్యూటీ ఈవోలు తమ అనుచరుల బంధువులకు, అధికారులు, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెప్పిన వారికి డిప్యుటేషన్ వేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైరవీలు, పలుకుబడి ఉన్న వారిని అవసరం లేకపోయినా డిప్యుటేషన్ పేరుతో వారు అనుకున్న పాఠశాలలకు పంపుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో సాఫీగా సాగుతున్న పాఠశాలల నుంచి కూడా ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై పంపించడంతో ఆ స్కూళ్లలో బోధన కుంటుపడుతుందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చెందుతున్నాయి.
ఉన్న చోటు నుంచి కదిలేది లేదు..
తమకు ఇష్టం లేని చోటుకు డిప్యుటేషన్ వేస్తే ప్రస్తుత పాఠశాల నుంచి కదిలేది లేదని పలువురు ఉపాధ్యాయులు అంటున్నారు. డిప్యుటేషన్‌లో భాగంగా ఖమ్మం డివిజన్‌లో 28, మధిర డివిజన్‌లో 23, కొత్తగూడెం డివిజన్‌లో 15.. మొత్తం 62 మందిని ఇతర పాఠశాలలకు పంపిస్తూ డీఈవో ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇందులో ఇప్పటి వరకు 20 మంది కూడా రిలీవ్ కాలేదని సమాచారం. పలువురు ఉపాధ్యాయులు రిలీవ్ కాబోమని తేల్చిచెప్పగా.. మరికొందరు డిప్యుటేషన్ వేయవద్దని ఆయా గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులతో డీఈవోకు చెప్పించినట్లు తెలిసింది. దీనికి తోడు అక్రమంగా డిప్యుటేషన్లు వేశారని ఉపాధ్యాయ సంఘాలు బహిరంగంగానే విమర్శిస్తున్నాయి. దీంతో ఈ డిప్యుటేషన్ ప్రక్రియను ఎందుకు మొదలు పెట్టామా అని విద్యాశాఖ అధికారులు తలపట్టుకోవాల్సి వస్తోంది.
విద్యాశాఖలో వింతపర్వం !
Published Thu, Jul 24 2014 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 10:45 AM
Advertisement
Advertisement