రేషన్ డీలర్ల అక్రమాలపై కొరడా
ఎట్టకేలకు రేషన్ డీలర్ల అక్రమాలకు ‘చెక్’ పడుతోంది. నెల నుంచి దుకాణాలపై వరుస విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయి. ‘రేషన్’ అక్రమాలపై ‘సాక్షి’ చేసిన అక్షర సమరాన్ని తప్పు పడుతూ ఖండించిన అధికారులే నేడు అవే కథనాల ఆధారంగా తనిఖీలు చేస్తున్నారు. రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాల తీరును వివరిస్తూ మేలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. సరిగ్గా ‘సాక్షి’ ఎత్తి చూపిన అంశాలపైనే దృష్టి సారించిన జేసీ వెంకట్రామిరెడ్డి సారథ్యంలోని ప్రత్యేక బృందాలు... డీలర్ల ఆట కట్టిస్తున్నాయి.
- 13 మందిపై వేటు.. కేసులు నమోదు
- 3 బియ్యం మిల్లుల సీజ్.. రూ 6 కోట్ల బియ్యం స్వాధీనం
- ఎల్‌ఎమ్మెస్ పాయింట్ ఇన్‌చార్జి సస్పెన్షన్‌కు సిఫారసు
- ‘సాక్షి’ సాగించిన అక్షర సమరం ఎఫెక్ట్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో యథేచ్ఛగా సాగుతున్న రేషన్ దోపిడీ కట్టడికి ఆ శాఖ అధికారులు కార్యోన్ముఖులయ్యారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించి లక్షలు గడిస్తున్న వారి పని పట్టేందుకు జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు.
ఎట్టి పరిస్థితుల్లో రేషన్ బియ్యాన్ని అక్రమంగా అమ్ముకునే వీలు లేకుండా పకడ్బందీ చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వారిపై దాడులు చేసి పట్టుకుంటున్నారు. పౌరసరఫరాలు, రెవెన్యూ శాఖలను సమన్వయం చేసుకుంటూ నెల రోజులుగా దాడులు ముమ్మరం చేశారు. మూడు ప్రత్యేక విజిలెన్స్ టీంలు ఏర్పాటు చేసి దాడులు చేయిస్తున్నారు. నిత్యావసర సరుకులను నల్లబజారుకు తరలించడం, దుకాణాలు సమయపాలన పాటించకపోవడం, రికార్డుల్లో లబ్ధిదారుల సంతకం లేకపోవడం వంటి అభియోగాల మీద రేషన్ డీలర్ల మీద కేసులు నమోదు చేస్తున్నారు.
13 మంది డీలర్లు సస్పెన్షన్
రేషన్ డీలర్ల అక్రమాలు జిల్లాలో వ్యవస్థీకృతమయ్యాయి. కొందరు డీలర్లు కోట్లకు పడగలెత్తారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఇటువంటి డీలర్లపై నిఘా వర్గాలు దృష్టిపెట్టాయి. నెల రోజులుగా దాడులు చేస్తున్న అధికారులు... జిల్లా వ్యాప్తంగా పటాన్‌చెరు, నారాయణఖేడ్, కంగ్టీ, కల్హేర్, కంది, ఆందోల్, దుబ్బాక మండలాల్లో ఒక్కొక్క డీలర్ చొప్పున, తూప్రాన్‌లో ఇద్దరు డీలర్లను సస్పెండ్ చేసి కేసులు నమోదు చేశారు. అక్రమంగా బియ్యం కొనుగోలు చేసి రవాణా చేస్తున్న ఇద్దరిని గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
దీనికి సహరిస్తున్న సిద్దిపేటలోని మూడు రైస్ మిల్లులను సివిల్ సప్లై శాఖ అధికారులు సీజ్ చేశారు. వీటిల్లోని దాదాపు రూ 6.5 కోట్ల విలువైన బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తూప్రాన్ ఎల్‌ఎమ్మెస్ పాయింట్‌లో డీలర్లకు బియ్యం తక్కువగా ఇచ్చినట్టు, ఇక్కడ ఇన్‌చార్జి ఉద్దేశపూర్వకంగానే అక్రమాలకు పాల్పడినట్టు అధికారులు నిర్ధారించి, అతని సస్పెషన్ కోసం ఉన్నతాధికారులకు సిఫారసు చేసినట్లు తెలిసింది.
దాడులు పెరగాలి...
జిల్లాలో వేళ్లూనుకుపోయిన రేషన్ అక్రమాలను కూకటివేళ్లతో సహా పెకిలించాలంటే ప్రస్తుతం జరుగుతున్న దాడులు సరిపోవని ప్రజలు, ప్రజాప్రతినిధులు అంటున్నారు. జిల్లాలో దాదాపు 1860 దుకాణాలుండగా కేవలం మూడు ప్రత్యేక బృందాలు మాత్రమే ఏర్పాటు చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదంటున్నారు. నల్లగొండ జిల్లా తరహాలో సివిల్ సప్లై శాఖలలో దోపిడీని నిరోధించడానికి పోలీసులతో కలిపి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి తనిఖీలు చేయాలని కోరుతున్నారు.
అటకట్టు
Published Thu, Jul 16 2015 2:07 AM | Last Updated on Sun, Sep 3 2017 5:33 AM
Advertisement
Advertisement