భద్రాచలం, న్యూస్‌లైన్: తునికాకు సేకరణ టెండర్లు దక్కించుకున్న ఓ కాంట్రాక్టర్ బినామీ వ్యక్తుల పేరుతో నకిలీ బాండ్లను సృష్టించి అటవీశాఖకు కుచ్చుటోపీ పెట్టిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఏకంగా రూ.1.38 కోట్ల విలువైన డిపాజిట్లను కోల్‌కతలోని ఓ బ్యాంకులో తెరిచినట్లు చూపించి ఆ శాఖాధికారులకు బురిడీ కొట్లాడు. అటవీశాఖలోని కొంతమంది అధికారుల అండదండలతోనే ఈ మొత్తం వ్యవహారం సాగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అటవీశాఖలో తొలిసారిగా జరిగినట్లు చెబుతున్న ఈ మాయాజాలం ఆ శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది.
వివరాల్లోకి వెళితే...
భద్రాచలం నార్త్ డివిజన్‌లోని ఆర్లగూడెం, సౌత్ డివిజన్‌లోని ఏడుగురాళ్లపల్లి యూనిట్ పరిధిలో 2012 సంవత్సరానికి సంబంధించి తునికాకు సేకరణ టెండర్లను వరంగల్ జిల్లాలోని రేగొండ మండ లానికి చెందిన ఓ నలుగురు వ్యక్తులు దక్కించుకున్నారు. అప్పట్లో ఓ పేరుమోసిన తునికాకు కాంట్రాక్టర్.. నలుగుర్ని బినామీలుగా పెట్టుకొని తనికాకు సేకరించారు. భద్రాచలం సౌత్, నార్త్ డివిజన్‌లలో నాణ్యమైన తునికాకు లభిస్తుంది. ప్రతియేటా లక్ష్యానికి మించి ఆకు సేకరించేది ఈ యూనిట్లలో మాత్రమే. రూ.1.38 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను అటవీశాఖకు పూచీకత్తుగా పెట్టారు. సదరు కాంట్రాక్టర్లు పెట్టిన ఎఫ్‌డీఆర్‌లు నకిలీవని తేలడంతో తేరుకున్న అటవీశాఖాధికారులు దీనిపై ఉన్నతాధికారులకు నివేదించారు.
వెలుగులోకి వచ్చింది ఇలా..
2012 సంవత్సరంలో ఏడుగురాళ్లపల్లి, ఆర్లగూడెం యూనిట్ పరిధిలో కొంత తునికాకు మిగిలిపోయింది. దానిని భద్రాచలం గోదాంల్లోనే నిల్వ చేశారు. అమ్ముడుపోని తునికాకుకు ఇచ్చిన డిపాజిట్‌లను రెన్యువల్ చేయాలని సదరు కాంట్రాక్టర్లు అటవీశాఖాధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇంతలోనే డీఎఫ్‌వోలకు ఈ బాండ్లపై అనుమానం వచ్చి వీటిని తీసిన కోల్‌కతలోని బ్యాంకు అధికారులకు నిర్ధారణ కోసం పంపించారు. అవి నకిలీవని తేలింది. కాంట్రాక్టర్‌లు తమను మోసిగించినట్లుగా భావించిన భద్రాచలం నార్త్, సౌత్ డీఎఫ్‌వోలు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అటవీశాఖాధికారుల సహకారంతో వరంగల్ జిల్లాలోని రేగొండ మండలానికి చెందిన బినామీ కాంట్రాక్టర్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు భార్యభర్తలున్నట్లు సమాచారం.
రెండేళ్ల పాటు ఏం చేసినట్లు..
బినామీ పేర్లతో కాంట్రాక్టులు దక్కించుకొని కోట్లలో నకిలీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఇచ్చినా అటవీ శాఖాధికారులు వీటిని గుర్తించకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఏదైనా కాంట్రాక్టర్ టెండర్ దక్కించుకున్నప్పుడు పూచీకత్తుగా సమర్పించిన డీడీ లేదా ఎఫ్‌డీఆర్‌లను సదరు శాఖాధికారులు నిర్ధారించుకోవాలి. 2012లో వీటిని కాంట్రాక్టర్లు అటవీశాఖకు అందజేసినా..సదరు అధికారులు ఎఫ్‌డీఆర్‌లను నిర్ధారించుకోవడం కోసం కోల్‌కతలోని బ్యాంకు అధికారులకు భద్రాచలం కార్యాలయం నుంచి లేఖలు పంపారని సమాచారం. కోల్‌కతలోని బ్యాంకు అధికారులు ఇవన్నీ సక్రమమేనని భద్రాచలం అటవీశాఖ అధికారులకు లేఖ పంపారు. ఈ లేఖల పరంపరను గమనించిన ప్రస్తుత అధికారులు అన్నీ నకిలీ పత్రాలేనని గుర్తించినట్లు తెలిసింది. ఈ తతంగమంతా అప్పటి అధికారులకు తెలియకుండానే జరిగిందా? ఒకవేళ తెలిస్తే ఎందుకు ధ్రువీకరించలేకపోయారు? ఇలాంటి సవాలక్ష సందేహాలెన్నో వస్తున్నాయి.
పోలీసులకు ఫిర్యాదు చేశాం : రాజశేఖర్‌రావు, నార్త్ డీఎఫ్‌వో, భద్రాచలం
ఫిక్స్‌డ్ డిపాజిట్‌లను రెన్యువల్ చేసే క్రమంలో బ్యాంకు అధికారులకు పంపించాం. అప్పుడే అవి నకిలీవని తేలింది. అవి ఇచ్చిన కాంట్రాక్టర్‌లపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. వారి విచారణలోనే వాస్తవాలు వెల్లడవుతాయి.
విచారణ వేగవంతం చేశాం : ప్రకాష్‌రెడ్డి, ఏఎస్పీ, భద్రాచలం
అటవీశాఖాధికారుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించాం. ఎఫ్‌డీఆర్‌లు వాస్తవమైనవేనని కోల్‌కతలోని బ్యాంకు అధికారుల నుంచి కూడా లేఖలు ఉన్నాయి. అవికూడా నకిలీగా తేలటంతో దీనిలో బ్యాంకు అధికారుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం.
అటవీశాఖకు టోపీ!
Published Thu, May 22 2014 2:19 AM | Last Updated on Wed, Oct 3 2018 5:26 PM
Advertisement