భద్రాచలం: అటవీశాఖ భద్రాచలం, దుమ్ముగూడెం రేంజ్‌ల పరిధిలో ఒకే రోజు ముగ్గురు ఉద్యోగులపై వేటు పడింది. ఒక ఎఫ్‌ఎస్‌ఓతోపాటు ఇద్దరు ఎఫ్‌బీఓలను సస్పెండ్ చేస్తూ ఆ శాఖ డివిజనల్ అధికారి బాబు ఉత్తర్వులిచ్చారు. ఇటీవలనే ఇక్కడ ఇద్దరు ఉద్యోగులపై వేటు పడింది. తాజాగా, ముగ్గురు ఉద్యోగులు సస్పెండయ్యారు. ఇది, అటవీశాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. భద్రాచలం కేంద్రంగా అటవీశాఖలో ఏం జరుగుతుందనేది హాట్‌టాఫిక్‌గా మారింది. దుమ్ముగూడెం మండలంలోని సింగారం, అంజుబాక గ్రామాల సమీపంలోని అటవీభూములను కొంతమంది ఆక్రమించి పోడు చేశారు. దీనిపై అటవీశాఖ ఉన్నతాధికారులకు ఇక్కడి నుంచి ఫిర్యాదులు వెళ్లాయి. ఆయన విచారణకు ఆదేశించారు. దుమ్ముగూడెం మండలంతోపాటు అశ్వాపురం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లిపాక పరిధిలో కూడా వందల ఎకరాల అటవీభూములను పోడు సాగు పేరుతో పాడు చేశారని ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ స్పందించారు.
సమగ్ర విచారణ కోసమని దీనిని విజిలెన్స్‌కు అప్పగించారు. ఇటీవల విజిలెన్స్ అధికారుల బృందం గుట్టుచప్పుడు కాకుండా దుమ్ముగూడెం మండలంలో పర్యటించింది. ఫిర్యాదుల్లోని అంశాలపై క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అటవీశాఖ విజిలెన్స్ అధికారులు కూడా ఎట పాక అటవీ ప్రాంతంలో పర్యటించి వివరాలు సేకరించారు. ఇరు రాష్ట్రాలకు చెందిన అటవీశాఖ అధికారులు ఏక కాలంలో విచారణకు రావటంతో ఇది పెద్ద దుమారం రేపింది. రాష్ట్రస్థాయిలో ఫిర్యాదులు వెళ్లినందున ఇది తమ పర్యవేక్షణ లేమిని ఎత్తుచూపుతున్నదనే కారణం తో జిల్లాకు చెందిన అటవీశాఖ అధికారులు తేరుకున్నారు. అటవీభూములను పోడు సాగు కు ధ్వంసం చేసినందుకు బాధ్యులను చేస్తూ సింగవరం సెక్షన్ అధికారిని, సింగారం సౌత్, అంజిబాక బీట్ ఉద్యోగులను సస్పెండ్ చేశారు.
గతంలో కూడా ఇదే మండలంలో ఒక బీట్ అధికారిని (విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కారణంగా) సస్పెండ్ చేశారు. మరో బీట్ అధికారికి ఆర్టికల్ చార్జి చేశారు. పోడు భూముల కోసమని అటవీ భూమిని ధ్వంసం చేసే విషయంలో ఇక్కడ పనిచేసే ఓ అధికారి పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. దుమ్ముగూడెం మండలంలో రేంజ్ అధికారి తరువాత ఆ స్థాయిలో పర్యవేక్షణ చేసే ఓ అధికారి నిర్వాకం కారణంగానే ఇలా జరిగిందనే ప్రచారం సాగుతోంది. ఆయనపై విచారణ కోసమనే ఇక్కడి ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకులు అటవీశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినట్లుగా తెలిసింది. కానీ ఎప్పుడో జరిగిన పోడు సాగును ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్న ఉద్యోగులపై వేటు వేయటంపై ఆ శాఖ ఉద్యోగ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటవీశాఖ పరువు మురింత దిగజారకముందే ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. దీనిపై భద్రాచలం రేంజ్ అధికారి సత్యవతిని ‘సాక్షి’ వివరణ కోరింది. ‘‘ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేసిన విషయం వాస్తవమే. మాకు కూడా పూర్తి సమాచారం లేదు‘‘ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment