భద్రాచలం: ఎల్‌టీఆర్ కేసులను సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీఓ దివ్య అన్నారు. ఆర్డీఓలు, రెవెన్యూ అధికారులు, పారా లీగల్ వలంటీర్‌లతో ఈ విషయంపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అటవీ హక్కు చట్టం ప్రకారం గుర్తించిన రైతులకు జీపీఎస్ జీఐఎస్ రూపంలో డిసెంబర్ నెలాఖరు నాటికి హక్కు పత్రాలను అందజేయాలని సూచించారు. ప్రతీ సోమవారం నిర్వహించే గిరిజన దర్బార్‌కు కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వస్తున్నాయని, వాటిల్లో ఎక్కువగా హక్కు పత్రాల కోసమే ఉంటున్నాయని గుర్తు చేశారు.
ఆర్డీఓ కార్యాలయం స్థాయిలోనే వీటిని పరిష్కరించాలని ఆదేశించారు. ముఖ్యం గా ఎల్‌టీఆర్ కేసులకు సంబంధించి ప్రతీ గ్రామంలో మ్యాప్, కాస్రా, పాణి, రికార్డులు, ఆర్‌ఓఆర్‌లో ఉన్నది లేనిదీ, నిర్దారించుకుని తగు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. గుర్తించిన అటవీ భూముల గురించి గ్రామ సభల ఆమోదం మేరకు బాధ్యత గల అధికారులకు ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. డివిజన్ స్థాయిలో అవసరమైన సర్వేయర్‌లను అందుబాటులో ఉంచుకొని సమగ్ర స్థాయిలో సర్వే చేయించాలని సూచించారు. అటవీ హక్కు పత్రాల ప్రకారం జారీ చేసిన భూముల వివరాలను పూర్తిస్థాయిలో కంప్యూటరీకరించేందుకు పారా వలంటీర్లు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
ఏజెన్సీ ధ్రువపత్రాల జారీలో
జాగ్రత్తలు తీసుకోవాలి
గిరిజనులకు ఏజెన్సీ ధ్రువీకరణ పత్రాల జారీలో ప్రభుత్వ నిబంధనలను తప్పని సరిగా పాటించాలని ఐటీడీఏ పీఓ దివ్య సూచించారు. ఈ మేరకు ఏజెన్సీ పరిధిలోని ఆర్డీఓలతో మంగళవారం తన చాంబర్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ షెడ్యూల్డ్ ఏరియాలో ఉద్యోగ నియామకాలకు అవసరమైన ఏజెన్సీ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేటప్పుడు ఎలా వ్యవహరించాలనే విషయంపై గత అనుభవాలను దృష్టిలో ఉంచుకోవాలని అన్నారు.
కొండరెడ్లకు ధ్రువీకరణ పత్రాలను జారీ చేసేందుకు గ్రామ సభల ద్వారా తీర్మానం చేసి గుర్తించవచ్చని, కానీ మిగతా జాతులను ఎలా గుర్తించాలనే విషయంపై ట్రైబల్ కల్చర్ రిసోర్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ రిటైర్డ్ డైరక్టర్ వీయన్‌వీకే శాస్త్రి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంశ వృక్షం, తాతలు, తండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల ఆధారంగా ఏజెన్సీ ప్రాంతం వారా..? కాదా...? అనే విషయాన్ని గుర్తించవచ్చని, గిరిజనుల ఆచార వ్యవహారాల్లో ఒక భాగమైన గట్టు ద్వారా కూడా ఏ ప్రాంతం వారు అనే విషయం గుర్తించవచ్చని అన్నారు.
ఏజెన్సీ ధ్రువ పత్రాల జారీలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ విషయంలో ఆర్డీఓలు కీలకంగా వ్యవహరించాలని పీఓ సూచిం చారు. సమావేశంలో భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, ఆర్‌డీవోలు ఆర్ అంజయ్య, కె వెంకటేశ్వర్లు, అమయ్‌కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి, డీడీ సరస్వతి, ఏపీఓ జనరల్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఎల్‌టీఆర్ కేసులపై చర్యలు తీసుకోవాలి
Published Wed, Nov 19 2014 2:19 AM | Last Updated on Wed, Sep 26 2018 5:59 PM
Advertisement
Advertisement